చరిత్ర సృష్టించిన స్పేస్‌ ఎక్స్‌

SpaceX Dragon crew capsule docks at International Space Station - Sakshi

తొలిసారిగా రోదసిలోకి వ్యోమగాముల్ని పంపిన ప్రైవేటు సంస్థ

అద్భుతమని కొనియాడిన ట్రంప్‌

వాషింగ్టన్‌: అంతరిక్షయానంలో మరో కొత్త అధ్యాయానికి తెరలేచింది. ప్రైవేటు కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ నిర్మించిన వ్యోమనౌక తొలిసారి రోదసిలోకి వెళ్లింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.22 గంటలకు లాంచ్‌ ప్యాడ్‌ 39ఏ నుంచి క్రూ డ్రాగన్‌ క్యాప్సూల్‌ను మోసుకెళ్లిన ఫాల్కన్‌ రాకెట్‌9 నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. అమెరికాకు చెందిన వ్యోమగాములు బాబ్‌ బెహంకన్‌ (49), డో హార్లీ (53)లను తీసుకొని ఈ రాకెట్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) బయల్దేరింది. నింగిలోకిదూసుకెళ్లిన 19గంటల తర్వాత ఐఎస్‌ఎస్‌కు చేరుకుంది.

నలుపు తెలుపు రంగుల్లో బుల్లెట్‌ ఆకారంలో ఉన్న డ్రాగన్‌ కాప్సూ్యల్‌ నింగికి ఎగరడానికి ముందు ‘లెట్స్‌ లైట్‌ దిస్‌ క్యాండిల్‌’అంటూ వ్యోమగామి హార్లీ ఉద్నిగ్నంగా అరిచి చెప్పారు. ఇప్పటికే ఐఎస్‌ఎస్‌లో ఉన్న వ్యోమగాములతో వీరూ పనిచేస్తారు. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌లో జరిగిన ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని అధ్యక్షుడు ట్రంప్‌ నేరుగా వీక్షించారు. స్పేస్‌ ఎక్స్‌ సీఈవో ఎలన్‌ మస్క్‌తో ట్రంప్‌ ముచ్చటించారు. ఆయనని ఒక మేధావి అంటూ ప్రశంసించారు. ఒక ప్రైవేటు సంస్థ వ్యోమగాముల్ని తీసుకొని రోదసి యాత్ర చేయడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా ప్రభుత్వాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి.

అగ్రరాజ్యానికి ఊరట
కరోనా వైరస్‌ విజృంభణతో లక్ష మందికిపైగా మరణించడం, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై కోట్లాదిమంది ఉద్యోగాలు కోల్పోయిన తరుణంలో స్పేస్‌ ఎక్స్‌ సాధించిన విజయం అగ్రరాజ్యానికి బాగా ఊరటనిచ్చింది. వాస్తవానికి బుధవారమే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించక వాయిదా పడింది. 2011 తర్వాత  మానవసహిత అంతరిక్ష ప్రయాణాలు అమెరికా నేల మీద నుంచి జరగలేదు. చంద్రుడు, అంగారకుడిపైకి మనుషుల్ని పంపే ప్రయోగాలపైనే నాసా దృష్టి సారించింది. రష్యాకు చెందిన సూయజ్‌ అంతరిక్ష నౌకలో అమెరికా వ్యోమగాముల్ని రోదసిలోకి పంపిస్తోంది. ఇంచుమించుగా దశాబ్దం తర్వాత అమెరికా గడ్డ మీద నుంచి ఒక ప్రైవేటు సంస్థ రోదసిలోకి మనుషుల్ని పంపడంతో అమెరికా భారీ విజయాన్ని నమోదు చేసుకున్నట్టయింది.

స్పేస్‌ ఎక్స్‌..
అంగారక గ్రహంపై నివసించడానికి వీలుగా కాలనీలు నిర్మించాలని, అంతరిక్ష ప్రయాణానికయ్యే వ్యయ భారాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ప్రారంభమైంది. అమెరికాకు చెందిన బిలియనీర్‌ ఎలన్‌ మస్క్‌ 2002లో కాలిఫోర్నియాలో ఈ సంస్థను ప్రారంభించారు. అప్పట్నుంచి వ్యోమనౌకల తయారీ పనులు, ఇతర అంతరిక్ష పరిశోధనల్లో ఈ సంస్థ నిమగ్నమైంది. 2011 తర్వాత ఐఎస్‌ఎస్‌ కేంద్రానికి సరకు రవాణా చేసిన అనుభవం కూడా ఉంది.

ప్రయోగ బృందంలో భారతీయుడు
ఈ మధ్య కాలంలో చరిత్ర సృష్టించే అన్ని ప్రయోగాల్లోనూ భారత్‌ భాగస్వామ్యం ఏదో విధంగా ఉంటోంది. అలాగే స్సేస్‌ ఎక్స్‌ డెమో–2 ప్రయోగంలోనూ భారత ఇంజనీర్‌ ఒకరు ఉండడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. స్పేస్‌ క్రూ ఆపరేషన్స్‌ అండ్‌ రీసోర్సెస్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బాల రామమూర్తి ఈ ప్రయోగం సమయంలో కెన్నడీ లాంచ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఫైరింగ్‌ రూమ్‌ 4లో విధులు నిర్వర్తించారు. చెన్నైకి చెందిన రామమూర్తి అన్నా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. తొమ్మిదేళ్లుగా ఆయన స్పేస్‌ ఎక్స్‌లో పనిచేస్తున్నారు.  

ఇవాళ అద్భుతమైన రోజు. దేశం సంక్లిష్టపరిస్థితుల్ని ఎదుర్కొంటున్న వేళ స్పేస్‌ ఎక్స్‌ చేపట్టిన ఈ ప్రయోగం ఎందరికో స్ఫూర్తినిస్తోంది. అందుకే నేను స్వయంగా దీనిని వీక్షించడానికి వచ్చాను. నాసాకు, ఎలన్‌ మస్క్‌కు అభినందనలు.
డొనాల్డ్‌ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

పట్టరాని భావోద్వేగంతో నోట మాట రావడం లేదు. నేను కన్న కలలు, స్పేస్‌ ఎక్స్‌లో ప్రతీ ఒక్కరి కల నిజమైన రోజు. స్పేస్‌ ఎక్స్‌ బృందం చేసిన కృషితో అత్యుత్తమ ఫలితాన్ని సాధించింది. నాసా, ఇతర భాగస్వాముల సహకారంతో ఇది సాధ్యమైంది.  ఎలన్‌ మస్క్, స్పేస్‌ ఎక్స్‌ సీఈవో
నింగిలోకి దూసుకెళ్తున్న ఫాల్కన్‌ రాకెట్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top