చైనా ఆక్రమణ: వివరణ కోరిన నేపాలీ కాంగ్రెస్‌!

Opposition Party Motion In Parliament Over China Encroaching Nepal Territory - Sakshi

ఖాట్మండూ: చైనా.. నేపాల్‌ భూభాగాన్ని ఆక్రమించిందన్న వార్తలపై సమాధానం చెప్పాలని  ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ క్రమంలో పార్టీ సభ్యులు దేవేంద్ర రాజ్‌ కండేల్‌, సత్య నారాయణ్‌ శర్మ ఖనాల్‌, సంజయ కుమార్‌ గౌతం పార్లమెంటు దిగువ సభలో బుధవారం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘‘నేపాల్‌ భూభాగంలోని డోలఖ, హమ్లా, సింధుపాల్‌చౌక్‌, సంఖువాసభ, గోర్ఖా, రసువా జిల్లాల్లో దాదాపు 64 హెక్టార్లను చైనా ఆక్రమించింది. చైనా టిబెట్‌ రీజియన్‌ సమీపంలో ఉత్తర గోర్ఖాలోని రూయీ గ్రామం సరిహద్దు వద్ద గల పిల్లర్‌ 35ని ముందుకు జరిపారు. తద్వారా రూయీలోని 72 కుటుంబాలు, దార్చౌలాలోని 18 ఇండ్లు చైనా భూభాగంలోకి వెళ్లిపోయాయి’’ అని తీర్మానంలో పేర్కొన్నారు. దీనిపై చర్చ జరిపి వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వాస్తవాలేమిటో ప్రజలకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.(నేపాల్‌ భూభాగాన్ని ఆక్రమించిన చైనా!)

కాగా నేపాల్‌, చైనాతో దాదాపు 141,488 చదరపు కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉన్న విషయం తెలిసిందే. ఇక గత కొన్ని రోజులుగా చైనాతో మరింత స్నేహంగా మెలుగుతున్న నేపాల్‌కు డ్రాగన్‌ ఇటీవల గట్టి షాకిచ్చింది. టిబెట్‌లో చేపట్టిన రోడ్డు నిర్మాణ విస్తరణలో భాగంగా నేపాల్‌ భూభాగంలోని దాదాపు 33 హెక్టార్లకు పైగా భూమిని చైనా దురాక్రమణకు గురైందని.. నేపాల్‌ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సర్వే విభాగం నివేదిక వెల్లడించింది. ఇరు దేశాల మధ్య సహజ సరిహద్దులుగా ఉన్న నదుల గమనాన్ని మళ్లించి నేపాల్‌లోని 10 ప్రాంతాలను డ్రాగన్‌ ఆక్రమించిందని సర్వే పేర్కొంది. అయితే ఈ విషయంపై కేపీ శర్మ ఓలి ప్రభుత్వం ఇంతవరకు నోరు మెదపలేదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top