ఫ్లోరిడాలో నెత్తుటిధార ; భీకర కాల్పులు

many dead in Florida school shooting - Sakshi

టీనేజర్‌ కాల్పుల్లో 17 మంది విద్యార్థుల మృతి

పార్క్‌ల్యాండ్‌ : ఉగ్రదాడికి ఏమాత్రం తీసిపోనిరీతిలో అమెరికాలో మారణహోమం జరిగింది. తుపాకి చేతబట్టిన ఓ టీనేజర్‌.. పాఠశాలలోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఫ్లోరిడా రాష్ట్రం పార్క్‌ల్యాండ్‌లో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో 17 మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. నెత్తుటిధారలతో స్కూల్‌ ఆవరణమంతా భీకరంగా మారిన స్థితిలో అక్కడివారు భయంతో పరుగులు తీశారు.

ఫైర్‌ అలారం మోగించి ఆపై కాల్పులు : పార్క్‌ల్యాండ్‌లోని మార్జోయ్‌ స్టోన్‌మన్‌ డగ్లస్‌ హైస్కూల్‌లో బుధవారం ఉదయం(స్థానిక కాలమానం ప్రకారం) కాల్పులు జరిగాయి. దుండగుడు లోపలికి వస్తూనే గేటు దగ్గర ముగ్గురిని కాల్చి చంపాడు. ఆ వెంటనే బిల్డింగ్‌ ఫైర్‌ అలారంను మోగించాడు. ఆ శబ్ధానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా ఒక్కసారిగా బయటికి వచ్చేప్రయత్నం చేశారు. అప్పుడా దుండగుడు ద్వారానికి ఎదురుగా నిలబడి.. బయటికి వచ్చినవారిని వచ్చినట్లు కాల్చిపారేశాడు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కాల్పుల్లో 17 మంది విద్యార్థులు చనిపోయారు.

అతను.. సస్పెండైన విద్యార్థి! : డగ్లస్‌ స్కూల్లో కాల్పులకు పాల్పడిన టీనేజర్‌ను నికోలస్‌ క్రూజ్‌(19)గా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. నికోలస్‌ కూడా అదే స్కూల్‌ విద్యార్థి అని, కొద్ది రోజుల కిందటే అతను సస్పెండ్‌ అయ్యాడని తెలిపారు. కాల్పుల అనంతరం స్కూల్లోనే నక్కిఉన్న నికోలస్‌ను పోలీసులు బంధించారు. సస్పెండ్‌ చేశారన్న కోపంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

ట్రంప్‌ సంతాపం : ఫ్లోరిడా స్కూల్‌ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతాపం తెలిపారు. ఫ్లోరిడా గవర్నర్‌ రిక్ స్కాట్‌కు ఫోన్‌ చేసిన ట్రంప్‌.. సహాయకార్యక్రమాల గురించి మాట్లాడారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top