
ప్రతీకాత్మక చిత్రం
కాలిఫోర్నియా: మహమ్మారి కరోనా(కోవిడ్-19)ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్ కుటుంబ సభ్యుల మధ్య కలహాలకు కారణమవుతోంది. టాయిలెట్ పేపర్ దాచి ఉంచిందన్న కారణంతో ఓ కొడుకు తల్లిపై చేయిచేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన ఆమె పోలీసులకు ఫోన్ చేయగా.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన లాస్ ఏంజెల్స్‌లో చోటుచేసుకుంది. అగ్రరాజ్యం అమెరికాపై కరోనా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ దాదాపు 14 వేల మందికి పైగా మహమ్మారికి బలికాగా... లక్షలాది మంది ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ కఠినంగా అమలు అవుతోంది. కొన్నిచోట్ల నిత్యావసరాలు కావాల్సిన స్థాయిలో అందుబాటులో ఉండటం లేదు.(టాయిలెట్ పేపర్ కోసం కొట్టుకున్న మహిళలు)
ఇక కరోనా కాలంలో అత్యంత పొదుపుగా సరుకులను వాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో షెర్లీ మిల్లర్ అనే మహిళ టాయిలెట్ పేపర్లను వృథా చేయనీయకుండా కుటుంబ సభ్యుల నుంచి దాచిపెట్టింది. ఈ విషయం ఆమె 26 ఏళ్ల కొడుకు అడ్రియాన్ యాన్‌కు విపరీతమైన కోపం తెప్పించింది. దీంతో తల్లితో వాదులాటకు దిగి ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. అతడిని కట్టడి చేయడం సాధ్యం కాకపోవడంతో మిల్లర్ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది.(కుప్పలు కుప్పలుగా కరోనా మృతదేహాల ఖననం)
ఈ విషయం గురించి మిల్లర్ మాట్లాడుతూ.. ‘‘ వ్యక్తిగత శుభ్రత పాటించడం అత్యంత ముఖ్యం. అయితే నా కొడుకు అవసరం లేకున్నా టాయిలెట్ పేపర్లను వృథా చేస్తున్నాడు. అందుకే వాటిని కనపడకుండా చేశాను. లాక్‌డౌన్ వల్ల ఇంట్లోనే ఉంటున్న కారణంగా రోజురోజుకీ తగాదాలు ఎక్కువైపోతున్నాయి’’ అని విచారం వ్యక్తం చేశారు. కాగా లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే గృహహింస, చిన్న పిల్లలపై వేధింపుల కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే.(లాక్‌డౌన్: గృహ హింస కేసులు రెట్టింపు..)