‘మిశ్రా’ దోషులకు యావజ్జీవం | LN Mishra murder case: Four convicts get life term | Sakshi
Sakshi News home page

‘మిశ్రా’ దోషులకు యావజ్జీవం

Dec 19 2014 2:36 AM | Updated on Sep 2 2017 6:23 PM

నిందితులను కోర్టుకు తీసుకొస్తున్న దృశ్యం

నిందితులను కోర్టుకు తీసుకొస్తున్న దృశ్యం

రైల్వే శాఖ మాజీ మంత్రి లలిత్ నారాయణ్ మిశ్రా హత్య కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది.

న్యూఢిల్లీ: రైల్వే శాఖ మాజీ మంత్రి లలిత్ నారాయణ్ మిశ్రా హత్య కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. నలభై ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో గురువారం కోర్టు తుది తీర్పు వెలువరించింది. 1975 జనవరి 2న అప్పటి రైల్వే మంత్రి ఎల్‌ఎన్ మిశ్రా పర్యటన సందర్భంగా బిహార్‌లోని సమస్తిపూర్‌లో జరిగిన పేలుడులో మిశ్రాతో పాటు మరో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆనందమార్గ ఆధ్యాత్మిక కేంద్రానికి చెందిన సంతోషానంద(75), సుదేవానంద(79), గోపాల్‌జీ(73), న్యాయవాది రంజన్ ద్వివేదీ(66)లను డిసెంబర్ 8న కోర్టు దోషులుగా తేల్చింది.
 
 ఈ కేసుకు సంబంధించి గురువారం విచారణ సందర్భంగా జిల్లా కోర్టు న్యాయమూర్తి వినోద్ గోయల్ నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే సంతోషానంద, సుదేవానందలకు రూ.25 వేల చొప్పున జరిమానా, గోపాల్‌జీ, ద్వివేదీలకు రూ. 20 వేల చొప్పున జరిమానా విధించారు. పేలుడులో మరణించిన మరో ఇద్దరి చట్టపరమైన వారసులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని బిహార్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. నాటి ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏడుగురి కుటుంబ సభ్యులకు రూ. 1.5 లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన 20 మందికి రూ. 50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో డిసెంబర్ 8నే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement