
'ఏకంగా ఉగ్రవాద సామ్రజ్యాన్నే నిర్మించాలనుకుంది'
ఇరాక్, సిరియా దేశాల్లో పూర్తి స్థాయిలో తమ ప్రాబల్యాన్ని పెంచుకొని సొంతంగా రాజ్యాన్ని ఏర్పాటుచేసుకోవాలని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రణాళికలు రచించుకున్నట్లు ఆధారాలు బయటపడ్డాయి.
లండన్: ఇరాక్, సిరియా దేశాల్లో పూర్తి స్థాయిలో తమ ప్రాబల్యాన్ని పెంచుకొని సొంతంగా రాజ్యాన్ని ఏర్పాటుచేసుకోవాలని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రణాళికలు రచించుకున్నట్లు ఆధారాలు బయటపడ్డాయి. సొంత మనుగడను కొనసాగించేందుకు ఆ దేశాల్లోని ప్రభుత్వ శాఖలన్నింటిని తన ఆధీనంలోకి తెచ్చుకునే కుట్రలకు పాల్పడినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మొత్తం 24 పేజీలతో కూడిన వ్యవహార పత్రాలు లీకవ్వగా గార్డియన్ అనే పత్రిక ప్రచురించింది.
ఈ పత్రాలకు 'ఇస్లామిక్ స్టేట్ పరిపాలన నిబంధనలు' అని ఒక టైటిల్ కూడా ఉంది. ఇందులో మొత్తం పది చాప్టర్లు ఉన్నాయి. దీనిని ఈజిప్టుకు చెందిన అబు అబ్దుల్లా అల్ మస్రి అనే వ్యక్తి రాశారు. 2014లో జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో దీనిని రాసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహార సూత్రాల ప్రకారం సిరియా, ఇరాక్ దేశాల్లో విద్య ఎలా ఉండాలి, సహజ వనరులు ఎలా ఉపయోగించుకోవాలి, పరిశ్రమలు, దౌత్యంతోపాటు మతపరమైన ప్రచారం ఎలా చేయాలి, మిలటరీని ఎలా ఉపయోగించాలి అనే అంశాలన్నీ ఉన్నాయి.
దీనిని పరిశీలించినవారంతా కూడా అవాక్కవడంతోపాటు ఇస్లామిక్ స్టేట్ చేసిన క్షేత్ర స్థాయి పరిశీలనలపట్ల విస్మయం వ్యక్తం చేశారు. పరిపాలనకు సంబంధించిన మూలాలన్నింటిని తెలుసుకున్న తర్వాతే ఉగ్రవాద సంస్థ ఒక్కొక్కటిగా దాడి చేస్తూ ఆక్రమిస్తూ వస్తుందని, ఇందుకోసం ముందుగానే తన వద్ద వ్యూహం ఉందని తాజాగా బయటపడిన అంశాల ద్వారా తెలుస్తోందని అన్నారు.