అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

Iran Missile Attack On US Forces Airbase Situated In Iraq - Sakshi

బాగ్దాద్‌: అమెరికా సైన్యాలు ఇరాన్‌ జనరల్‌ ఖాసిం సులేమానిని హతమార్చిన నేపథ్యంలో.. ఇరాన్‌ ప్రతీకార చర్యలకు సిద్ధమైంది. ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. అమెరికా బలగాలకు ఆతిథ్యం ఇస్తున్న ఇరాకీ స్థావరాలే లక్ష్యంగా బుధవారం దాడులకు దిగింది. అల్‌- అసద్‌, ఇర్బిల్‌లో ఉన్న వైమానిక స్థావరాలపై దాదాపు పన్నెండు బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో... ఇరాన్‌, ఇరాక్ గగనతలం మీదుగా తమ విమానాలు ప్రయాణించకుండా అమెరికా నిషేధం విధించింది.

అదే విధంగా పర్షియన్‌ గల్ఫ్‌, ఒమన్‌ గల్ఫ్‌ జలాల మీదుగా వెళ్లే విమానాలను సైతం నిషేధిస్తూ ఎయిర్‌మెన్‌కు నోటీసులు జారీ చేసింది. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఇక ఇరాన్‌ క్షిపణి దాడుల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని పెంటగాన్‌ తెలిపింది. ‘ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ పన్నెండుకు పైగా క్షిపణులతో దాడికి దిగింది’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. (సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట)

కాగా ఇరాన్‌ మద్దతున్న హిజ్బుల్‌ బ్రిగేడ్‌ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు.. గత మంగళవారం ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రతీకారంగా అమెరికా.. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో శుక్రవారం రాకెట్‌ దాడికి పాల్పడి.. ఇరాన్‌ జనరల్‌ సులేమానిని హతమార్చింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌- అమెరికాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.(‘అమెరికా ఉగ్రవాదులు’ ; జర్మనీ కీలక నిర్ణయం)

ఇక ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా విరోధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అండతో పాలిస్తున్న ఇరాన్‌ పాలకుడు మొహమ్మద్‌ రెజా పహ్లావీకి వ్యతిరేకంగా 1979లో ప్రజలు తిరుగుబాటు చేశారు. దీంతో ఆయన అమెరికాకు పారిపోయారు. ఆందోళనకారులు టెహ్రాన్‌లోని అమెరికా ఎంబసీని 1979 నవంబర్‌ నుంచి 1981 జనవరి వరకు ముట్టడించారు. ఈ సమయంలో దాదాపు 52 మంది అమెరికన్లను బందీలుగా చేశారు. ఈ క్రమంలో గల్ఫ్‌ ప్రాంతంలో ఇరాన్‌ పౌర విమానాన్ని అమెరికా బలగాలు కూల్చివేశాయి. ఈ ఘటనలో 290 మంది ప్రాణాలు కోల్పోయారు.(52తో పాటు.. 290 కూడా గుర్తుపెట్టుకో ట్రంప్‌!)
 
ఇందుకు కొనసాగింపుగా 2000లో ఇరాన్‌ అణ్వాయుధాలను తయారు చేస్తోందనే ఆరోపణలపై అమెరికా ఆంక్షలు విధించింది. అంతేగాకుండా ఇరాక్, ఉత్తరకొరియాతోపాటు ఇరాన్‌ను తమ దుష్టత్రయం(2002)లో చేర్చింది. ఈ నేపథ్యంలో బరాక్ ఒబామా తన పదవీ కాలంలో ఇరాన్‌తో సంబంధాలు మెరుగుపరచుకున్నారు. ఈ క్రమంలో 2015లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, రష్యా, చైనా, జర్మనీలు ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌... 2019లో అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజా దాడుల నేపథ్యంలో అవి తారస్థాయికి చేరుకున్నాయి. (ఇరాన్‌కు అమెరికా షాక్‌!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top