ఫ్యాషనే వారి నినాదం

Historic Number Of Women, African Americans Sworn In To 116th Congress - Sakshi

దుస్తుల రంగులే  వారి భావాలకు ప్రతీకలు 

అమెరికా కాంగ్రెస్‌లో 102 మంది మహిళా ప్రతినిధుల ప్రమాణం 

రంగు రంగుల దుస్తులు, హొయలు చిందే ఫ్యాషన్లు.. ఇదంతా ఎవరినో ఆకర్షించాలని కాదు, పదిమందిలో గుర్తింపు పొందాలని అంతకంటే కాదు.. తాము ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి, ఆడదంటే సబల అని చాటి చెప్పడానికే అంటున్నారు ఈ మహిళా నేతలు. 

అమ్మాయి అంటే పింక్‌ కలర్‌. కంటికి ఇంపుగా, మనసుకు హాయిగా అచ్చం అమ్మాయిల్లాగే సున్నితంగా ఆ రంగు చెరగని ముద్ర వేస్తుంది. కానీ, ఇప్పుడు పింక్‌ అంటే ఆహ్లాదం కాదు. గుండె లోతుల్లోంచి పొంగుకొచ్చే భావావేశం, ధిక్కారానికి గుర్తు, చేరుకోవాల్సిన లక్ష్యాలకు ప్రతీక, మహిళల పట్ల ఇప్పటివరకు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి సంకేతం. అవును అమెరికా కాంగ్రెస్‌కి కొత్తగా ఎన్నికైన మహిళా ప్రతినిధులు ఇదే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నారు. అమెరికా 116వ కాంగ్రెస్‌లో ప్రమాణస్వీకారమహోత్సవానికి హాజరైనప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో, వారి సంప్రదాయాలు ఉట్టిపడేలా, సంస్కృతికి ప్రతీకలుగా తయారై వచ్చారు. అదే తమ పోరాట ఆయుధమని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అలంకరణ అనేది బాహ్య అందాన్ని పెంపొందించడమే కాదు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందని, సాంస్కృతిక గొప్పదనాన్ని చాటి చెబుతుందని వారంతా ముక్త కంఠంతో నినదిస్తున్నారు. ఫ్యాషన్‌కు పర్యాయపదంలా ఉన్న మహిళలంతా దానినే ఇప్పుడు తమ పోరాటాలకు పంథాగా మార్చుకోవడం విశేషం.

రికార్డు స్థాయిలో 102 మంది ఎన్నిక.. 
అమెరికా ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో ఈ సారి రికార్డు స్థాయిలో 102 మంది మహిళలు ఎన్నికయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వెల్లువలా వీరి సంఖ్య పెరిగింది. అయినప్పటికీ సభలో ఇంకా పురుషాధిక్యమే కొనసాగుతోంది. అయినా తాము ఎందులోనూ తీసిపోమని చాటిచెప్పడానికి ప్రమాణస్వీకార ఉత్సవాన్నే వేదికగా చేసుకున్నారు మహిళా ప్రతినిధులు. నాన్సీ పెలోసి ముదురు గులాబీ రంగు గౌనులో మెరిసిపోతూ సభకు వచ్చారు. ‘‘పింక్‌ అంటే శాంతి, సహనం కాదు. దానికి అర్థం మారింది. ఈ రంగు మాలోని భావావేశాన్ని తట్టిలేపుతుంది. అమ్మాయిల పట్ల చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని గట్టిగా నిలదీసి అడుగుతుంది‘అని వ్యాఖ్యానించారు. 

మహిళా ఓటుకు వందేళ్లు..  
ఈ ఏడాది అమెరికా ప్రజా స్వామ్య చరిత్రలోనే అత్యంత కీలకమైనది. మహిళలకు ఓటు హక్కు కల్పించి అమెరికాలో వందేళ్లు అవుతోంది. మహిళలకు ఓటు హక్కు కల్పిస్తూ 1919, జూన్‌ 4న కాంగ్రెస్‌లో బిల్లును ఆమోదించారు. అందుకే మహిళా ప్రతినిధులందరూ తమ ప్రసంగాల్లో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పొడవైన గౌను ధరిం చి వచ్చిన పాలస్తీనా అమెరికన్‌ రషీదా తాలిబ్‌ తన తల్లి లాంతర్‌ వెలుగులో అలాంటి ఎంబ్రాయిడరీ గౌనులు కుడుతూ ఎంత కష్టపడిందో ఉద్విగ్నభరితంగా చెప్పారు. దెబ్రా హాలండ్‌ రంగురంగుల పూసల గొలుసులు ధరించి వచ్చి తమ ప్రాంతంలో గల్లంతవుతున్న మహిళలు, వారి హత్యల గురించి ప్రస్తావించారు. ఆఫ్రికన్‌ అమెరికన్‌ మహిళ బార్బారా లీ మెడ చుట్టూ స్టోల్‌ని వేసుకొని వచ్చి మహిళలు విభిన్న పంథాలో నడుస్తూ నిరంతరం జలపాతంలా క్రియాశీలకంగా ఉండాలన్నా రు. ఇక సోమాలియా నుంచి శరణార్థిగా వచ్చిన ఇల్హాన్‌ ఒమర్‌ తెల్లరంగు గౌనులో వచ్చి తమ ప్రాంతంలో శాంతి స్థాపన ధ్యేయ మన్నారు.  
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top