కాంగ్రెస్‌కు ‘గ్రీన్‌కార్డు’ ప్రతిపాదనలు

Greencards are expected to come soon to Indians - Sakshi

ప్రతిభ ఆధారిత వలస విధానంతో భారతీయులకే లబ్ధి

భారతీయులకు గ్రీన్‌కార్డులు త్వరగా వస్తాయని అంచనా 

ప్రతిపాదనల్లో జీవిత భాగస్వామి, పిల్లలకు మాత్రమే అవకాశం 

అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందించామన్న ట్రంప్‌ 

వాషింగ్టన్‌: గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు వరంలా భావిస్తున్న ప్రతిభ ఆధారిత వలస విధానం ప్రతిపాదనల్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ దేశ కాంగ్రెస్‌కు పంపారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగులు గ్రీన్‌కార్డులు త్వరగా పొందేందుకు తాజా వలస విధానం ఉపయోగకరమని అంచనావేస్తున్నారు. అయితే భారతీయ ఐటీ నిపుణులు ఎంతో ముఖ్యంగా భావించే హెచ్‌–1బీ వీసాల ప్రస్తావన ప్రతిపాదనల్లో లేకపోవడం గమనార్హం. అలాగే వలసదారుల జీవిత భాగస్వామి, పిల్లలకు మాత్రమే గ్రీన్‌కార్డు అవకాశం కల్పిస్తూ తల్లిదండ్రులు, సోదరులు, సోదరిలకు అమెరికాలో నివసించే అవకాశాన్ని నిరాకరించారు. అమెరికాకు తమ కుటుంబసభ్యుల్ని తీసుకురావాలని ఆశపడుతున్న వేలాది మంది భారతీయ– అమెరికన్లకు మాత్రం ఈ నిర్ణయం శరాఘాతమని భావిస్తున్నారు.  

70 సూత్రాల ప్రతిభ ఆధారిత వలస విధాన ప్రతిపాదనను ట్రంప్‌ ఆదివారం అమెరికన్‌ కాంగ్రెస్‌కు పంపుతూ పలు సూచనలు చేశారు. తాజా వలస విధానం అమెరికా దేశ ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందించినట్లు పేర్కొన్నారు. ‘ప్రస్తుత వలస విధానం దేశ ప్రయోజనాలకు అనుగుణంగా లేదు. నైపుణ్యం ఆధారంగా కాకుండా వలసదారుల కుటుంబసభ్యులు అమెరికాకు వచ్చేందుకు అనుకూలంగా ఉంది. దశాబ్దాలుగా తక్కువ నైపుణ్యమున్న వలసదారులకు అవకాశం ఇవ్వడం వల్ల అమెరికాలో వేతనాలు తగ్గాయి. నిరుద్యోగం పెరిగింది. అలాగే అమెరికా వనరులకు నష్టం జరిగింది’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. పాయింట్లు ఆధారంగా గ్రీన్‌కార్డులు మంజూరు చేయాలని, ప్రస్తుతమున్న లాటరీ పద్ధతిని రద్దు చేయాలని ఆయన కోరారు. ప్రతిభ ఆధారిత వలస విధానం అమెరికా ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులకు రక్షణ కల్పిస్తుందని, గొలుసుకట్టు వలస విధానానికి ముగింపు పలకడంతో పాటు, కొత్తవారికి అవకాశం కల్పించవచ్చని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు.  ఈ ప్రతిపాదనల్లో కేవలం శాశ్వత వలసదారులు, అక్రమ వలసదారుల గురించే ట్రంప్‌ ప్రస్తావించారు. వృత్తి నిపుణులకు, అమెరికా విశ్వ విద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించే వారికి ఇచ్చే తాత్కాలిక హెచ్‌1–బీ వీసాల అంశాన్ని ప్రస్తావించలేదు.   

వారితో అమెరికన్లకు నష్టం: ట్రంప్‌  
అలాగే అమెరికాలో నివసిస్తున్న 8 లక్షల మంది డ్రీమర్ల అంశంపై కూడా కాంగ్రెస్‌కు సూచనలు చేశారు. డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌వుడ్‌ అరైవల్స్‌ (డీఏసీఏ) అంశం పరిష్కారానికి రూపొందించే ఏ చట్టంలోనైనా సంస్కరణల్ని తప్పకుండా చేర్చాలని ట్రంప్‌ కోరారు. సంస్కరణలు అమలు చేయకపోతే అక్రమ వలసలతో అమెరికన్‌ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులకు నష్టం చేకూరుతుందన్నారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పడు తల్లిదండ్రులతో పాటు అమెరికా వచ్చి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న యువత(డ్రీమర్స్‌)ను అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ.. గత నెల్లో వారి వర్క్‌ పర్మిట్లను ట్రంప్‌ రద్దుచేశారు. 

గ్రీన్‌కార్డు వస్తే చాలు.. 
అమెరికాకు హెచ్‌–1బీ వీసా లేదా మరో ఉద్యోగ వీసాపై వెళ్లినవారు... ఆ దేశంలో స్థిరపడాలనుకుంటే మొదట శాశ్వత నివాసితుడి హోదా (గ్రీన్‌కార్డు) పొందాలి. గ్రీన్‌కార్డు వస్తే.. ఇక వీసాతో పని ఉండదు. గ్రీన్‌కార్డు వచ్చిన ఐదేళ్లకు అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రీన్‌కార్డు/పౌర సత్వం ఉన్నవాళ్లు తమ కుటుంబసభ్యులకు గ్రీన్‌కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా 4,80,000 మందికి డిపెండెంట్‌ విభాగంలో గ్రీన్‌కార్డులిస్తారు. అలాగే శాశ్వత ఉద్యోగుల కోటాలో ఏటా 1,40,000 గ్రీన్‌కార్డులు మంజూరు చేస్తారు. కాగా, ట్రంప్‌ జాబితాలో అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి నిధుల అంశం కూడా ఉంది.   

30 పాయింట్లు సాధిస్తేనే..
గ్రీన్‌కార్డు కేటాయింపునకు చదువు, వయ సు, ఆంగ్ల ప్రావీణ్యం, జీతాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని ప్రతిపాదించారు. వీటి ఆధారంగా పాయింట్లను కేటాయిస్తారు. గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 30 పాయింట్లను అర్హతగా నిర్ణయించారు. పాయింట్లు అధికంగా ఉన్నవారికే గ్రీన్‌కార్డులిస్తారు. ట్రంప్‌ ప్రతిపాదనలు ఆమోదం పొందితే.. గ్రీన్‌కార్డుల్ని సీనియారిటీ ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా ఇస్తారు. గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఈ ప్రతిపాదనలు వరం కానున్నాయి. అమెరికాలో భారత టెకీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

అందువల్ల ప్రస్తుతం గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారు 12 ఏళ్లకుపైగా వేచి ఉండాల్సి వస్తోంది. ఏడాదికి ఒక దేశానికి (ఆ దేశ పౌరులకు) జారీచేసే గ్రీన్‌కార్డులపై పరిమితి ఉన్నందున భారతీయుల దరఖాస్తులు భారీగా పోగు పడుతున్నాయి. కొత్త విధానంతో భారతీయులకు వీలైనంత త్వరగా గ్రీన్‌కార్డులు వస్తాయని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ ఆమోదం పొందాక తదుపరి ఆర్థిక సంవ త్సరం నుంచి అమల్లోకి వస్తుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top