భారత్‌లో రుతుపవనాల ఆగమనం, నిష్ర్కమణాన్ని ముందుగానే కచ్చితంగా అంచనా వేసే కొత్త పద్ధతిని జర్మనీ వాతావరణ శాస్త్రవేత్తలు రూపొందించారు.
కొత్త విధానం రూపొందించిన జర్మన్ శాస్త్రవేత్తలు
బెర్లిన్: భారత్‌లో రుతుపవనాల ఆగమనం, నిష్ర్కమణాన్ని ముందుగానే కచ్చితంగా అంచనా వేసే కొత్త పద్ధతిని జర్మనీ వాతావరణ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ సరికొత్త విధానం భారత ఉపఖండంలో ఆహారోత్పత్తితో పాటు జల విద్యుత్‌ను పెంచేందుకు ఉపయోగపడుతుందని పరిశోధకులు చె బుతున్నారు. ప్రాంతీయ వాతావరణ సమాచారం సమగ్ర విశ్లేషణ ఆధారంగా ఈ విధానం పనిచేస్తుందని, దీన్ని ఉపయోగిస్తే భారత వాతావరణ విభాగం మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు.
రుతుపవనాల రాకపై 70 శాతం సరైన సమాచారం ఇచ్చిందని, నిష్ర్కమణంపై 80 శాతం కచ్చితంగా ఫలితం వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే ఎల్ నినో, లా నినా సమయాల్లో రుతుపవనాల అంచనాపై మెరుగైన సమాచారం ఇస్తుందని జర్మన్ పరిశోధకులు అంటున్నారు. జర్మనీలో పోట్సడామ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్(పీఐకె) చెందిన వెరోనికా స్టొల్‌బోవా మాట్లాడుతూ... కొత్త పద్ధతితో భారత్‌లో రుతుపవనాల రాకను రెండు వారాల ముందుగానే అంచనా వేయగలమని, నిష్ర్కమణను ఆరు వారాల ముందుగానే చెప్పవచ్చన్నారు. ఉత్తర పాకిస్తాన్, తూర్పు కనుమలు, హిందూ మహాసముద్రానికి సమీపంలోని పర్వత ప్రాంతాలు, కేరళల్లో ఉష్ణోగ్రతల్లో మార్పు, తేమ రుతుపవనాల విషయంలో కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించామన్నారు.