కోవిడ్‌ దెబ్బ: భయపడవద్దన్న ట్రంప్‌!

Donald Trump Comments On Covid 19 And Payroll Tax Relief - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19(కరోనా వైరస్‌)కు అంతగా భయపడాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. సాధారణ ఫ్లూ వల్ల గతేడాది 37 వేల మంది అమెరికన్లు మరణించారని... వీటి సంఖ్య సగటున ఏడాదికి 27 నుంచి 70 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజల జీవితాలు ముగిసిపోలేదని.. ఆర్థికాభివృద్ధి ఆగిపోలేదని చెప్పుకొచ్చారు. కరోనా కూడా ఇలాంటిదేనని... దేశంలో 546 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. ఈ క్రమంలో 22 మరణాలు సంభవించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.(‘ఆ రెండు జన్యుక్రమాలు సరిపోలాయి’)

కాగా ట్రంప్‌ ట్రేడ్‌వార్‌, కరోనా భయం, చముర ధరల యుద్ధం తదితర కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ పతనాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. 2 వేల పాయింట్లకు పైగా సెన్సెక్స్‌ పతనం కావడంతో షేర్‌ మార్కెట్లు విలవిల్లాలాడాయి. ఈ నేపథ్యంలో కరోనా భయాలను తక్కువ చేస్తూ ట్రంప్‌ ట్వీట్‌ చేయడం గమనార్హం. నిజానికి అమెరికాలో 600 మందికి పైగా కరోనా బారిన పడినట్లు, 25 మంది మరణించినట్లు పలు వార్తా పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. (ప్రపంచవ్యాప్తంగా స్టాక్, కరెన్సీ మార్కెట్లలో కల్లోలం)

ఇక చైనాలో బయటపడి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా బాధితుల సంఖ్య లక్షకు, మరణాల సంఖ్య సోమవారం నాటికి 3,800కు చేరింది. ఈ ప్రాణాంతక వైరస్‌ మరింతగా విస్తరిస్తే.. అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, దక్షిణ కొరియా తదితర అభివృద్ధి చెందిన దేశాలు మాంద్యంలోకి జారిపోతాయని మూడీస్‌ సంస్థ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా శ్వేతసౌధం తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల నుంచి కోలుకునేందుకు పేరోల్‌ టాక్సులను తగ్గించడమే కాకుండా... ఆర్థిక ప్యాకేజీ కూడా ప్రకటించే దిశగా ట్రంప్‌ ఆలోచనలు చేస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు ఆయన చర్చలు జరిపి పలు ప్రతిపాదనలు కాంగ్రెస్‌ ముందు ఉంచుతారని.. తద్వారా వేతన జీవులకు ఉపశమనం కలుగుతుందని వెల్లడించింది. ఇక సోమవారం నాటి మీడియా సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘‘ వారి ప్రమేయం లేకుండా.. ఏ తప్పు చేయకుండానే శిక్ష అనుభవించాల్సిన పనిలేదు. వారు పేచెక్‌ మిస్‌ చేసుకోబోరు’’ అని పేర్కొన్నారు. (ఇప్పటివరకు 3,800 మంది మృతి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top