పెట్టుబడులకు స్వర్గధామం | CM KCR grandwelcome speech on GES summit | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు స్వర్గధామం

Nov 29 2017 3:59 AM | Updated on Aug 15 2018 9:40 PM

CM KCR grandwelcome speech on GES summit - Sakshi

మంగళవారం సదస్సుకు వస్తున్న ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్, గవర్నర్‌ నరసింహన్, సీఎం కేసీఆర్, నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ తదితరులు

కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమని.. ప్రపంచస్థాయి సదస్సు నిర్వహించి, ఈ విషయాన్ని చాటి చెప్పడం ఎంతో ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభమైన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌–2017) ప్రారంభోత్సవంలో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. అందమైన హైదరాబాద్‌ ఆతిథ్యాన్ని స్వీకరించాలని.. ఇక్కడి బిర్యానీ రుచిని ఆస్వాదించాలని కోరారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..     
– సాక్షి, హైదరాబాద్‌

హైదరాబాదీ మజా ఆస్వాదించండి
‘‘వివిధ దేశాల నుంచి తరలివచ్చిన వారందరినీ స్వాగతించటం నాకెంతో సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి, చారిత్రక హైదరాబాద్‌ నగరానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్రపంచ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం, ఆతిథ్యమిచ్చే అవకాశం దొరకటం మాకెంతో గర్వంగా ఉంది. అన్ని రంగాల్లో శరవేగంగా వృద్ధి సాధించిన హైదరాబాద్‌ ఆకర్షణీయమైన ఆతిథ్య నగరంగా ప్రపంచ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మీరు (డెలిగేట్లు, పారిశ్రామికవేత్తలు) ఇక్కడ ఉండే కొద్ది సమయంలోనే.. తప్పకుండా హైదరాబాదీ మజాను ఆస్వాదిస్తారు.

అద్భుత రీతిలో పారిశ్రామిక విధానం
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నవ రాష్ట్రం. టీఎస్‌–ఐపాస్‌ పేరుతో రాష్ట్రంలో అమల్లోకి తెచ్చిన పారిశ్రామిక ప్రోత్సాహక విధానంలో భాగంగా పరిశ్రమలకు అవసరమైన అనుమతులన్నీ 15 రోజుల వ్యవధిలోనే ఇచ్చేలా చట్టం తెచ్చాం. నిర్ణీత వ్యవధిలో అనుమతులు ఇవ్వకపోతే.. మంజూరైనట్లుగానే పరిగణించటం ఇందులో ఉన్న విశేషం. ఈ విధానం ఇప్పటికే అద్భుతమైన ఫలితాలను సాధించింది. గత మూడేళ్లలో 5,469 పరిశ్రమల స్థాపనకు అనుమతులిచ్చాం. 17.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.లక్షా పదివేల కోట్లు) పెట్టుబడులతో పాటు నాలుగు లక్షల మంది ఉపాధికి అవకాశాలు లభించాయి. పెట్టుబడిదారులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిస్థితులున్నందుకే ఈ విజయం సాధించగలిగాం. ప్రపంచ బ్యాంకుతో పాటు భారత ప్రభుత్వం సంయుక్తంగా వెల్లడించే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల్లో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. ప్రస్తుతం విదేశాలతో పాటు దేశంలోని పెట్టుబడిదారులందరికీ తెలంగాణ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఎదిగింది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఐదు కంపెనీలు అమెరికా తర్వాత రెండో ప్రధాన వ్యాపార కేంద్రంగా హైదరాబాద్‌ను ఎంచుకున్నాయి. ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్‌ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాయి.

వినూత్న ఆవిష్కరణలకు ప్రోత్సాహం
యువ పారిశ్రామికవేత్తలందరినీ తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దేశంలోనే పెద్దదైన టెక్నాలజీ ఇంక్యుబేటర్‌ టీ–హబ్‌ను స్థాపించింది. నూతన ఆవిష్కరణలు, వినూత్న ఆలోచనలకు ఊతమిచ్చేందుకు విద్యాసంస్థలు, కార్పొరేట్‌ సంస్థలను సమ్మిళితం చేయడంలో ప్రభుత్వం క్రియాశీల పాత్రను పోషిస్తోంది. ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా (నీతి ఆయోగ్‌)’కూడా టీ–హబ్‌ను జాతీయ స్థాయిలో రోల్‌ మోడల్‌గా గుర్తించింది. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు సానుకూలంగా, స్నేహపూర్వకంగా ఉన్న ఇక్కడి వాతావరణాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈ అరుదైన వేదిక లభించటం ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచం నలుమూలలా  ఈ దిశగా జరిగే కృషిని, ప్రయత్నాలను తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నాను. సదస్సులో జరిగే చర్చలన్నీ కొత్త ఆలోచనలు, ప్రణాళికలకు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అందమైన హైదరాబాద్‌ ఆతిథ్యాన్ని స్వీకరించండి.. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన హైదరాబాద్‌ బిర్యానీ రుచిని ఆస్వాదించండి..’’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. 

ఔత్సాహికులకు మంచి అవకాశం
సదస్సులో అంతర్జాతీయ ప్రతినిధులతో అనుభవాలను పంచుకోవడం మాలాంటి ఔత్సాహికులకు, ముఖ్యంగా మహిళలకు ఎంతో ఉపయోగకరం. ఇవాంకా ట్రంప్‌ లాంటి పారిశ్రామికవేత్తలను కలవడం కూడా స్ఫూర్తిదాయకం. ఉమెన్‌ ఫస్ట్‌ స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం బాగుంది.
– అర్చన మోరపాక, కలాష్‌ ఎడ్యుటెక్‌ డైరెక్టర్‌

మహిళల నాయకత్వం మరింత పెరగాలి
ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తల శాతం చాలా తక్కువ. పనిచేసే మహిళల్లో 5 శాతం మంది మాత్రమే విజయవంతమవుతున్నారు. వెంచర్‌ క్యాపిటల్‌ రంగంలోనూ మహిళలు నాయకత్వం వహించే కంపెనీల సంఖ్యా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే 15–20 శాతం స్టార్టప్‌ కంపెనీలే మహిళల చేతిలో నడుస్తున్నాయి. ఈ సంఖ్య మరింత పెరగాలి. పారిశ్రామిక రంగంలో మహిళల నాయకత్వం ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తోంది. ఇందుకు ఈ సదస్సు దోహదపడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ సదస్సు పెట్టుబడుల రూపంలో మేలు చేకూరుస్తుందని ఆశిస్తున్నా. ఇవాంకా ట్రంప్‌ ఓ విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్త. సదస్సులో ‘ఉమెన్‌ ఫస్ట్‌’ నినాదాన్ని తీసుకురావడం శుభపరిణామం.  
 – నారా బ్రాహ్మణి, హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌

నాడు ఒక్కదాన్నే... నేడు చాలా మంది...
అమెరికా అధ్యక్షుడిగా బిల్‌ క్లింటన్‌ గతంలో చేపట్టిన హైదరాబాద్‌ పర్యటనలో ఆయన వెంట వచ్చిన పారిశ్రామికవేత్తల బృందంలో నేను ఒక్కదాన్నే మహిళను. ప్రస్తుతం జరుగుతున్న జీఈఎస్‌లో ఎక్కువగా మహిళలే పాల్గొంటున్నారు. అమెరికాలో ఉమెన్‌ ఇన్‌వెస్ట్‌ ఇన్‌... ఉమెన్‌ డిజిటల్‌ పేరిట మీడియా సంస్థను నిర్వహిస్తున్నా. నా సంస్థ ఫేస్‌బుక్‌ పేజీలో ప్రముఖుల ఇంటర్వ్యూలను చదవొచ్చు.
– అనుపమ భరద్వాజ్, పారిశ్రామికవేత్త, అమెరికా

సాయం కోసం నిరీక్షణ వద్దు
మనం ఏదైనా సాధించాలనుకుంటే ఇతరుల సాయం కోసం ఎదురు చూడకుండా మనలోని శక్తిసామర్థ్యాలతో ఆ పనిని ప్రారంభించాలి. నా సోదరితో కలసి నేను డిజిటల్‌ టెక్నాలజీ రంగంలో స్టార్టప్‌ను పెట్టినప్పుడు దేశంలో టీ–హబ్‌ లాంటి సౌకర్యం లేదు. అయినా స్టార్టప్‌ను నెలకొల్పి విజయవంతంగా నడుపుతున్నాం. భారత్, అమెరికాలలో మాకు 51 మందికిపైగా క్లయింట్లు ఉన్నారు. పెట్టుబడులు, వ్యాపార భాగస్వాముల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సదస్సు మంచి అవకాశం.    
– స్నేహరాజ్, శ్రీయల్‌ టెక్నాలజీస్, హైదరాబాద్‌

ప్రతిభకు ప్రోత్సాహం
అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సదస్సులు ప్రతిభకు ఎంతో ప్రోత్సాహాన్ని, బలాన్ని ఇస్తాయి. మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ఉపయోగపడతాయి.
– ఉపాసన, అపోలో ఫౌండేషన్‌ వైస్‌ చైర్‌పర్సన్, అపోలో లైఫ్‌ ఎండీ

దేశాభివృద్ధికి మహిళల భాగస్వామ్యం అవసరం
అమెరికాలో స్థిరపడిన నేను పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. 50 ఏళ్ల క్రితం భారత్‌లో మహిళలు చదువుకోవడమే ఘనంగా ఉండేది. కానీ నేడు పైలట్లు, కంపెనీల సీఈవోలుగా మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. నేను ఫౌండర్‌గా ఉన్న మిషన్‌ స్మార్ట్‌ రైడ్‌ కంపెనీలో ఆరుగురు డైరెక్టర్లున్నారు. అందులో ఇద్దరు మహిళలు. నా భార్య కూడా కో ఫౌండర్‌. వాళ్ల గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కాపాడేందుకు మహిళలను ప్రోత్సహించాలి. అది నేను చేస్తున్నా. దేశాభివృద్ధికి మహిళల భాగస్వామ్యం చాలా అవసరం.
– నందా భాగి, మిషన్‌ స్మార్ట్‌ రైడ్‌ ఫౌండర్‌ 

మహిళా నాయకత్వానికి ఊతం
జీఈఎస్‌పై మహిళా పారిశ్రామికవేత్తల ధీమా
గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ (జీఈఎస్‌) భవిష్యత్‌ పారిశ్రామిక రంగంలో మహిళల నాయకత్వానికి మరింత ఊతమిస్తుందని సదస్సుకు హాజరైన మహిళా పారిశ్రామికవేత్తలు ధీమా వ్యక్తం చేశారు. ‘ఉమెన్‌ ఫస్ట్‌’ నినాదంతో నిర్వహిస్తున్న సదస్సు ద్వారా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ఎంతో స్ఫూర్తి పొందొచ్చని, మహిళల నాయకత్వం పెరిగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు వారి మాటల్లోనే...    
– సాక్షి, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement