మరణంలోనూ యాజమానికి తోడుగా..

Bulldog Nero Dies Just 15 Minutes After His Owner - Sakshi

ఎడిన్‌బర్గ్‌ : మరణంలోనూ యాజమానికి తోడుగా నిలిచిందో శునకం. యాజమాని చనిపోయిన 15 నిమిషాల్లోపే వెన్నెముక విరగ్గొట్టుకుని చనిపోయింది నిరో అనే ఓ బుల్‌డాగ్‌. వివరాల్లోకి వెళితే.. స్కాట్‌లాండ్‌కు చెందిన స్టువర్ట్‌ హట్చిసన్‌ అనే వ్యక్తి నిరో అనే ఫ్రెంచ్‌ బుల్‌డాగ్‌తో పాటు మరో రెండు కుక్కలను పెంచుకునే వాడు. నిరో అంటే అతడికి ఓ ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. అది కూడా అంతే! అతడిని విడిచి ఒక్కనిమిషం కూడా ఉండేది కాదు. ఇదిలా ఉండగా 2011లో స్టువర్ట్‌కు బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స చేయించుకుంటునప్పటికి అది కాస్తా పెరిగి ఎముకకు వ్యాపించింది. దీంతో అతడి కుటుంబసభ్యులు నిరోను మిగిలిన రెండు కుక్కలను వేరేవాళ్లకు దత్తతకు ఇచ్చేశారు. స్టువర్ట్‌ గత నెలలో బ్రెయిన్‌ ట్యూమర్‌ కారణంగా మరణించాడు.

యాజమాని మీద ప్రేమో లేక యాధృచ్ఛికమో తెలీదు కానీ, సరిగ్గా అతడు మరణించిన 15 నిమిషాల్లో నిరో వెన్నెముక విరగ్గొట్టుకుని మరణించింది. దీనిపై స్టువర్ట్‌ తల్లి ఫియానా కొనెఘన్‌ మాట్లాడుతూ.. ‘‘ నా కొడుకు సరిగ్గా మధ్యాహ్నం 1:15నిమిషాలకు మరణించాడు. అతడు మరణించిన దాదాపు 15 నిమిషాలకే నిరో వెన్నెముక విరగ్గొట్టుకుని మరణించింది. అతడు మొత్తం మూడు కుక్కలను పెంచుకునేవాడు. కానీ, నిరో అంటే అతడికి ప్రత్యేకమైన అభిమానం. అది ఎల్లప్పుడు అతని వెంటే ఉండేది. అతడు చనిపోయే నాలుగు వారాల ముందు అతన్ని ఇంటికి తీసుకొచ్చాము. ఇంట్లో కళ్లు మూయాలన్నది అతడి చివరికోరిక’’ అని తెలిపిందామె.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top