అంతరిక్షంలో అందమైన హోటల్‌ | American Company Announces Build A Beautiful Hotel | Sakshi
Sakshi News home page

అంతరిక్షంలో అందమైన హోటల్‌

Sep 18 2019 4:06 AM | Updated on Sep 18 2019 4:36 AM

American Company Announces Build A Beautiful Hotel - Sakshi

ఊహ చిత్రం

అంతరిక్ష పర్యాటకం మరోమారు వార్తల్లోకి ఎక్కుతోంది.. భూమికి 400 కి.మీల ఎత్తులో..అందమైన హోటల్‌ కట్టేస్తామని.. ఓ అమెరికన్‌ కంపెనీ ప్రకటించడం ఇందుకు కారణం.

మనిషి జాబిల్లిపై అడుగుపెట్టి 50 ఏళ్లు దాటుతోంది. భూమిని వదిలి చందమామపై ఆవాసం ఏర్పరచుకోవాలని, సుదూర గ్రహాంతరయానానికి మన చందమామను వేదికగా మార్చుకోవాలని మనిషి ఎంతోకాలంగా ఆలోచిస్తున్నాడు. ఎలన్‌ మస్క్‌ లాంటివాళ్లు 2023 నాటికి అంగారకుడిపై మానవ కాలనీ ఏర్పాటు చేస్తానని ప్రకటించగా.. వర్జిన్‌ గెలాక్టిక్‌తో రిచర్డ్‌ బ్రాస్నన్, బ్లూ ఆరిజన్‌తో అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌లు.. అంతరిక్షపర్యటన కలను సాకారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న ‘ద గేట్‌వే ఫౌండేషన్‌’అనే కంపెనీ అంతరిక్షంలో తేలియాడే హోటల్‌ నిర్మించనున్నట్లు ప్రకటించింది. ‘ద వాన్‌ బ్రాన్‌ స్టేషన్‌’అని పిలుస్తున్న ఈ స్పేస్‌ హోటల్‌ విశేషాలు..

భారీ సైజు చక్రం..
24 విభాగాలున్న భారీ చక్రం ఆకారంలో ఈ హోటల్‌ ఉంటుంది. చక్రానికి మధ్యలో ఉండే నిర్మాణంలో రాకెట్లను నిలిపి ఉంచేందుకు వెసులుబాటు ఉంటుంది. హోటల్‌ మొత్తం భూమికి 400 కిలోమీటర్ల దూరంలో తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల గురుత్వాకర్షణశక్తి కృత్రిమంగా ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నీళ్లు ఉన్న బకెట్‌లో చేతితో వేగంగా తిప్పితే ఏమవుతుంది? కొంతసేపు నీళ్లన్నీ బకెట్‌ గోడలవైపు వెళ్తాయి. స్పేస్‌ హోటల్‌లోనూ ఇలాగే జరుగుతుందట. చక్రం తిరుగుతూ ఉండటం వల్ల అందులోని వస్తువులు ఎప్పుడూ చక్రం అంచుల వద్దే ఉంటాయి. జారి పడిపోకుండా అన్నమాట! చక్రం మధ్యభాగంలో ఎలాంటి కృత్రిమ గురుత్వాకర్షణ కూడా ఉండదని, అంచుల వైపు వెళ్లే కొద్దీ ప్రభావం పెరుగుతూ ఉంటుందని ఈ స్పేస్‌ హోటల్‌ డిజైనర్లలో ఒకరైన అలటోరే అనే ఇంజనీర్‌ ‘సీఎన్‌ఎన్‌ ట్రావెల్‌’కు తెలిపారు.

పేరులో ఏముంది?
ఈ స్పేస్‌ హోటల్‌కు వాన్‌ బ్రాన్‌ స్టేషన్‌ అని పేరు పెట్టడంలో ఓ విశేషముంది. రాకెట్‌ టెక్నాలజీకి ఆద్యుడైన జర్మన్‌ ఇంజనీర్‌ వెర్నెర్‌ వాన్‌ బ్రాన్‌ పేరు దీనికి పెట్టారన్నమాట. జర్మనీలో ఉండగా వాన్‌ బ్రాన్‌.. నాజీల కోసం పనిచేసినా.. ఆ తర్వాత అమెరికాకు వలస వచ్చి అపోలో ప్రోగ్రామ్‌లో పనిచేశారు. సుమారు 60 ఏళ్ల కింద వాన్‌ బ్రాన్‌ గీసుకున్న డిజైన్ల ఆధారంగానే ఈ స్టేషన్‌ నిర్మించడమూ ఇంకో కారణం. కాకపోతే నాటి డిజైన్లకు ఈనాటి అత్యాధునిక టెక్నాలజీ, పదార్థ విజ్ఞానాన్ని జోడిస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే 2025 నాటికల్లా ఈ స్పేస్‌ హోటల్‌ నిర్మించడం ప్రారంభిస్తారు. 2027 నాటికి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తారు. నిర్మాణం మొత్తం అంతరిక్షంలోనే జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం నిర్మాణాన్ని చిన్నచిన్న భాగాలుగా విడగొట్టి.. వాటిని అటూ ఇటూ తీసుకెళ్లేందుకు వ్యోమగాములతో కూడిన మినీ రాకెట్ల వంటి పాడ్స్, రోబోలు, ప్రత్యేకమైన స్పేస్‌ సూట్స్‌ను ఇందులో వాడతామని ఫౌండేషన్‌ పేర్కొంది.

నిధుల సేకరణకు లాటరీ..
స్పేస్‌ హోటల్‌ నిర్మాణానికి అవసరమైన నిధులను తాము లాటరీ ద్వారా సేకరిస్తామని ఫౌండేషన్‌ చెబుతోంది. అంతరిక్ష ప్రయాణాలపై నమ్మకం, ఆసక్తి ఉన్న వారు ఈ టికెట్లు కొంటారని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. స్పేస్‌ స్టేషన్‌లో మొత్తం 450 మంది వరకు ఉండొచ్చని, ఇందులో పర్యాటకుల సంఖ్య 352 వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది. వాన్‌ బ్రాన్‌ స్టేషన్‌లో ఉండేందుకు ఎంత ఖర్చవుతుందన్నది ఇంకా స్పష్టంగా తెలియదు. కాకపోతే వర్జిన్‌ గెలాక్టిక్‌లో ఒక టికెట్‌ ఖరీదు 2.5 లక్షల డాలర్లు కాగా.. అరోరా స్టేషన్‌ ఒక్కొక్కరికి 95 లక్షల డాలర్లు వసూలు చేసూ్తండటాన్ని బట్టి వాన్‌ బ్రాన్‌ స్టేషన్‌లో ఉండేందుకు ఎంత ఖర్చవుతుందన్నది ఊహించుకోవచ్చు.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement