ప్రపంచంలో జీవించిఉన్న అతిపెద్ద వయస్కుడిగా ఇటలీకి చెందిన వ్యక్తి రికార్డు సాధించాడు. ఆర్టురో లికాటా అనే వృద్ధుడు గిన్నెస్ బుక్లోకెక్కాడు.
లండన్: కలుషిత వాతావరణం, ఆహారం, పని ఒత్తిడి, ఆధునిక జీవనశైలితో కూడిన ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి సగటు వయసు ఎంత? ఓ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు జీవించగలడు. అన్నీ సవ్యంగా సాగితే వందేళ్లు బతకగలమా? వామ్మో అన్నేళ్లా అనే సందేహం రావచ్చు. ఈ మాట వినగానే ఆశ్చర్యపడేవారు ఎక్కువగా ఉండొచ్చు. ఏ డెబ్బై, ఎనబై (!) ఏళ్ల బతికితే అదే గొప్పగా భావించవచ్చు. కానీ ప్రపంచంలో జీవించివున్న అతిపెద్ద వయస్కుడు, అతిపెద్ద వయస్కురాలిని గురించి వింటే ఈ ఆశ చిగురించవచ్చు.
ప్రపంచంలో జీవించిఉన్న అతిపెద్ద వయస్కుడిగా ఇటలీకి చెందిన వ్యక్తి రికార్డు సాధించాడు. ఆర్టురో లికాటా అనే వృద్ధుడు గిన్నెస్ బుక్లోకెక్కాడు. అతని వయసు ప్రస్తుతం 111 సంవత్సరాలా 302 రోజులు. లికాటా జనన, వివాహ ధ్రువపత్రాలను పరిశీలించిన అనంతరం అతణ్ని ప్రపంచ వృద్ధుడిగా గుర్తించారు.
ఇక మహిళలలో జీవించిఉన్న అతిపెద్ద వయస్కురాలిగా జపాన్ బామ్మ నిలిచింది. మిసావో ఒకావా వయసు 115 ఏళ్లు. లికాటా కంటే ఆమె నాలుగేళ్ల ముందు జన్మించింది. 1898 మార్చిలో ఒకావా.. 1902 మేలో లికాటా జన్మించారు. లికిటా 19 ఏళ్ల వయసులోని సైన్యంలో చేరి 18 ఏళ్లు పనిచేశాడు. ఆయన భార్య 78 ఏళ్ల వయసులోనే 1980లో మరణించింది. వీరికి ఏడుగురు పిల్లలు, ఎనిమిది మంది మనవళ్లు, నలుగురు మునిమనవళ్లు సంతాన చక్రం. గిన్నిస్ బుక్ నిర్వాహకులు ప్రతి ఏటా ప్రపంచంలో అతిపెద్ద వయసు వారిని గుర్తించి సన్మానిస్తోంది. రికార్డుల ప్రకారం జీన్నె కామ్లెంట్ (ఫ్రాన్స్) అనే వ్యక్తి గరిష్టంగా 122 సంవత్సరాలా 164 రోజులు బతికాడు. ఆయన 1997లో మరణించాడు.


