ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులకు రుణాలను మాఫీ చేశామని ప్రభుత్వం చెబుతోందని, ఎంతమందికి రుణాలను మాఫీ చేశారని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులకు రుణాలను మాఫీ చేశామని ప్రభుత్వం చెబుతోందని, ఎంతమందికి రుణాలను మాఫీ చేశారని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మొత్తంగా కౌలు రైతులకు ఎన్ని కార్డులు ఉన్నాయని అడిగారు. చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు అంశాన్ని సభలో ప్రస్తావించారు. ఈ రోజు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగియగానే అవిశ్వాస తీర్మానం అంశాన్ని తీసుకుంటామని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు చెప్పారు.
సభలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, గౌరు చరితారెడ్డి రైతుల సమస్యలను ప్రస్తావించారు. కౌలు రైతులకు రుణాలు అందడం లేదని, కనీసం 20 శాతం మంది రైతులకు కూడా ఇవ్వలేదని ఆదిమూలపు సురేష్ అన్నారు. కర్నూలు జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని గౌరు చరితారెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.