గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తొలి అంకమైన నామినేషన్ల పర్వం నేటి(మంగళవారం) నుంచి మొదలుకానుంది.
♦ గ్రేటర్ లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు..
♦17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ.. 18న స్క్రూటినీ
♦ ఉపసంహరణకు 21వరకు గడువు.. అదే రోజు తుదిజాబితా
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తొలి అంకమైన నామినేషన్ల పర్వం నేటి(మంగళవారం) నుంచి మొదలుకానుంది. మంగళవారం నోటిఫికేషన్ జారీతోపాటు నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కానుంది. జీహెచ్‌ఎంసీ చట్టం మేరకు రిటర్నింగ్ అధికారులు దీనికి సంబంధించి పబ్లిక్ నోటీసు జారీ చేస్తారు. నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభిస్తారు. మంగళవారం నుంచి 17వ తేదీ ఆదివారం వరకు నామినేషన్ల దాఖలుకు గడువుంది. అయితే ఇందులో భోగి, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 14, 15 తేదీల్లో నామినేషన్లు స్వీకరించరు. దీంతో నామినేషన్లు దాఖ లు చేసేందుకు నాలుగు రోజులే గడువుంది. 17వ తేదీ ఆదివారం అయినా నామినేషన్లు స్వీకరిస్తారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. జీహెచ్‌ఎంసీలోని 24 సర్కిళ్లలో ఆయా రిట ర్నింగ్ అధికారుల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. 18వ తేదీ సోమవారం నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుంది. అభ్యర్థుల తుది జాబితాలను అదే రోజు సాయంత్రం ప్రకటిస్తారు. అభ్యర్థులు నామినేషన్ డిపాజిట్‌గా రూ. 5 వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు నామినేషన్ డిపాజిట్ చెల్లింపులో రాయితీ ఇచ్చారు. వీరు రూ. 2,500 చెల్లిస్తే సరిపోతుంది.