
నేడే ఎంసెట్
ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడికల్, అగ్రికల్చర్ పరీక్షలు జరగనున్నాయి.
ఇంజనీరింగ్: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు
మెడికల్, అగ్రికల్చర్: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు..
- పరీక్షకు హాజరుకానున్న 2.46 లక్షల మంది అభ్యర్థులు
- ఇంజనీరింగ్ కు 276, మెడికల్, అగ్రికల్చర్ కు 190 పరీక్ష కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్
ఎంసెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడికల్, అగ్రికల్చర్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 2,46,586 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.
ఈ ఏడాది ఇంజనీరింగ్ పరీక్షకు 1,43,524 మంది దరఖాస్తు చేసుకోగా.. మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్షకు 1,01,005 మంది అభ్యర్థులు దరఖాస్తు చే సుకున్నారు. ఇంజనీరింగ్ పరీక్ష నిర్వహణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 276, మెడికల్, అగ్రికల్చర్ పరీక్షకు 190 పరీక్షకేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా ఆన్ లైన్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం హైదరాబాద్ లో మూడు, వరంగల్ లో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ లో అత్యధికంగా 93,986 మంది ఎంసెట్ కు హాజరవుతుండడం విశేషం.
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
ఎంసెట్ కు హాజరయ్యే అభ్యర్థులు నిర్దేశిత సమయం కన్నా గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించరు. పరీక్ష ప్రారంభమైనప్పట్నుంచీ పూర్తయ్యేవరకు ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపించరు. విద్యార్థులు హాల్టికెట్తోపాటు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను వెంట తెచ్చుకోవాలి. క్యాలిక్యులేటర్లు, సెల్ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతించరు. పరీక్ష పూర్తయిన తర్వాత విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలతో పూర్తి చేసిన దరఖాస్తును, ఓఎంఆర్ జవాబు పత్రాలను తప్పనిసరిగా ఇన్విజిలేటర్కు ఇవ్వాలి. పరీక్ష హాల్లో తప్పనిసరిగా తమ వేలిముద్ర (బయోమెట్రిక్)లు సమర్పించాలి. లేనిపక్షంలో వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తారు. ఒకరికి బదులు వేరొకరు పరీక్ష రాసినా, కాపీయింగ్కు పాల్పడినా క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
సెట్ కోడ్లను విడుదల చేయనున్న మంత్రులు
ఎంసెట్ పరీక్ష ప్రశ్నపత్రాల సెట్ కోడ్ లను విడుదల చేసేందుకు జేఎన్టీయూహెచ్ ఏర్పాట్లు చేసింది. ఉదయం 6 గంటలకు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంజనీరింగ్ ప్రశ్నపత్రం కోడ్ను విడుదల చేస్తారు. ఉదయం 9.30 గంటలకు ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి మెడికల్ అండ్ అగ్రికల్చర్ ప్రశ్నపత్రం సెట్ కోడ్ను విడుదల చేయనున్నారు.