 
															ఆగిన చిరునవ్వులు...
సెల్లార్‌లో పడుకొని ఉన్న చిన్నారిని గుర్తు తెలి యని వాహనం ఢీకొనడంతో మృతి చెందింది.
	వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు అకాల మృత్యువాతపడ్డారు. మణికొండలో సెల్లార్‌లో పడుకొని ఉన్న బాలికను గుర్తు తెలియని వాహనం బలిగొంది. మరో ఘటనలో కారు ఢీకొని ఏడాది బాలుడు చనిపోయాడు. వచ్చీ రాని మాటలతో చిరునవ్వులు చిందిస్తూ తమను అలరించే కన్నబిడ్డల అకాల మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదించారు. వారిని చూసి స్థానికులు కంటతడిపెట్టారు.
	
	సెల్లార్‌లో నిద్రిస్తుండగా..
	గచ్చిబౌలి: సెల్లార్‌లో పడుకొని ఉన్న చిన్నారిని గుర్తు తెలి యని వాహనం ఢీకొనడంతో మృతి చెందింది. ఈ హృదయ విదారక ఘటన రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పొట్ట కూటికోసం వచ్చి తమ బిడ్డను పోగొట్టుకున్నామని చిన్నారి తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. సీఐ దుర్గప్రసాద్ కథనం ప్రకారం... మధ్యప్రదేశ్‌కు చెందిన సురేం దర్‌కౌర్, అంచులా దంపతులు కొన్ని నెలల క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చారు.  మణికొండ చిత్రపురి కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనంలో ఇద్దరూ కూలీ పని చేస్తున్నారు. సోమవారం ఉదయం 9.30కి తమ ఏడాది కుమార్తె పవిత్రను సెల్లార్‌లో పడుకోబెట్టి పనులకు వెళ్లారు.  పది గంటలకు పాప వద్దకు వచ్చి చూడగా రక్తపు మడుగులో కొట్టుకుంటోంది.
	
	వెంటనే గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని  వైద్యులు ధ్రువీకరించారు. పాపను సెల్లార్‌లో ఓ వాహనం ఢీకొట్టడంతో చనిపోయిందని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. పాపను వాహనం ఢీకొట్టినట్లు చూశారా అని చిత్రపురి కాలనీకి చెందిన ఓ వ్యక్తి బాధితులను ప్రశ్నిం చాడు. నష్ట పరిహారం ఇస్తామని, పాప ఎలా చనిపోయిందో తమకు తెలియదని పోలీసులకు చెప్పాలని వారిపై ఒత్తిడి తెచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతోనే చిన్నారి పవిత్ర మృతి చెందిందని, త్వరలోనే ఆ వాహనాన్ని గుర్తిస్తామని స్పష్టం చేశారు. మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం చేయించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
	 
	శుభకార్యానికి వెళ్లొస్తుండగా...
	యాకుత్‌పురా: శుభకార్యానికి వెళ్లి వస్తుండగా బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులతో కలిసి బైక్‌పై ప్రయాణిస్తున్న ఏడాది వయసు బాలుడు మృతి చెందాడు. ఆదివారం రాత్రి చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. ఎస్‌ఐ శ్రీనివాస్ రావు తెలిసిన వివరాల ప్రకారం... గౌలిపురా మీర్‌కా దయారా ప్రాంతానికి చెందిన ఎం.ఎ.ముక్తార్, సఫియా బేగం దంపతులకు కుమారుడు నదీం (1) సంతానం. ఆదివారం రాత్రి బండ్లగూడలోని సిటీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ జరిగిన బంధువుల శుభకార్యానికి ముక్తార్ దంపతులు కుమారుడిని తీసుకొని బైక్‌పై వెళ్లారు. అర్ధరాత్రి 12.30కి ఇంటికి తిరిగి వస్తుండగా బండ్లగూడ అన్మోల్ గార్డెన్ ఫంక్షన్ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురూ కిందపడిపోయారు. ముక్తార్, సఫియా బేగంతో పాటు చిన్నారి నదీంకు గాయాలయ్యాయి.
	
	నదీం తలకు తీవ్ర గాయం కావడంతో ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు కారు (టీఎస్ 15 ఈసీ 0459) ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
