నగరానికి నజరానా | telengana budjet | Sakshi
Sakshi News home page

నగరానికి నజరానా

Mar 15 2016 12:18 AM | Updated on Sep 3 2017 7:44 PM

నగరానికి నజరానా

నగరానికి నజరానా

ఇప్పటికే ఆస్తిపన్ను వసూళ్లలో దేశానికే ఆదర్శంగా నిలిచి, వివిధ మార్గాల ద్వారా తగిన రాబడి ఉన్న జీహెచ్‌ఎంసీ..

బడ్జెట్‌లో సింహభాగం కేటాయింపు
అన్ని రంగాల బలోపేతానికీ పెద్దపీట


స్వావలంబన దిశగా జీహెచ్‌ఎంసీ..
ఇప్పటికే ఆస్తిపన్ను వసూళ్లలో దేశానికే ఆదర్శంగా నిలిచి, వివిధ మార్గాల ద్వారా తగిన రాబడి ఉన్న జీహెచ్‌ఎంసీ.. తన ఆదాయాన్ని మరింతగా పెంచుకోగలదనే అంచనాతోనే బడ్జెట్‌లో దీనికి ప్రత్యేకంగా కేటాయింపులు చూపలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సంవత్సరం బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ల ద్వారానే జీహెచ్‌ఎంసీకి దాదాపు వెయ్యి కోట్లకు పైగా ఆదాయం రానుంది. ప్రభుత్వం వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వాస్తవిక దృక్పథంతో వ్యవహరించిందనే పలువురు భావిస్తున్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఎస్సార్‌డీపీ పనులకు సంబంధించి ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోనున్నందున వాటిని జీహెచ్‌ఎంసీ కేటాయింపుల్లో చూపలేదని భావిస్తున్నారు. అంతర్గత వనరుల సంపూర్ణ వినియోగంతో మరింత స్వావలంబన దిశగా పయనిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి అన్నారు. అవసరమైతే మాత్రం నిధుల కోసం ప్రభుత్వాన్ని సంప్రదిస్తామన్నారు. మోడల్ వూర్కెట్లు, వుల్టీ పర్పస్ ఫంక్షన్‌హాళ్లు, తదితర పనులను జీహెచ్‌ఎంసీ నిధులతోనే చేపడుతుండడం తెలిసిందే.
 
మెట్రోకు రూ.200 కోట్లు

నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మెట్రోరైలు ప్రాజెక్టుకు తాజా బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఈ ఏడాది జూన్‌లో ప్రారంభం కానున్న నాగోల్-మెట్టుగూడ, మియాపూర్-ఎస్.ఆర్.నగర్ రూట్లలో రహదారుల విస్తరణ, సుందరీకరణ, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాల కల్పన, పార్కింగ్ వసతుల కల్పనకు వెచ్చించనున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.500 కోట్ల మేర ప్రతిపాదనలను హెచ్‌ఎంఆర్ ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ సర్కారు రూ.200 కోట్లతో సరిపెట్టడం గమనార్హం. గతేడాది వార్షిక బడ్జెట్‌లో హెచ్‌ఎంఆర్‌కు రూ. 416 కోట్లు కేటాయించిన విషయం విదితమే.
 
వైద్యరంగం బలోపేతం
గ్రేటర్ వైద్యంపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న రోగుల అ వసరాలు తీర్చేందుకు నెదర్లాండ్స్ ఆర్థిక సహకారంతో నగరానికి నాలుగు వైపులా నాలుగు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించనున్నట్టు ప్రకటించింది. కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయడంతో పాటు శివారులో ఎల్బీనగర్-నాగోల్, ఉప్పల్-మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్-కూకట్‌పల్లి, రాజేంద్రనగర్-మెహిదీపట్నం మధ్యలో కొత్తగా నాలుగు ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నుట్టు పేర్కొంది. రూ. 600 కోట్లు ఖర్చుతో బోధనాస్పత్రులకు అధునాతన వైద్య పరికరాలు సమకూర్చనున్నట్లు స్పష్టం చేసింది. 40 రో గ నిర్థారణ కేంద్రాలు, 40 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనుండగా, వీటిలో సింహభాగం గ్రేటర్‌కే దక్కనున్నాయి. ఇదిలా ఉంటే గత బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో ఏ ఒక్క ఆస్పత్రిలోనూ సగానికి మించి మంజూరు చేయక పోవడం గమనార్హం. నిమ్స్ సహా ఉస్మానియా, గాంధీ జనరల్ ఆస్పత్రులు సహా అనుబంధ ఆస్పత్రులకు ఈసారి బడ్జెట్‌లో ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఉస్మానియా వైద్య కళాశాలలో కొత్త భవనాల కోసం రూ.189 కోట్లు కేటాయించగా, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రికి రూ. 29.04 కోట్లు, బీబీనగర్ నిమ్స్ అభివృద్ధికి రూ. 40 కోట్లు కేటాయించారు.
 
జలమండలికి రూ.వెయ్యి కోట్లు..
వార్షిక బడ్జెట్‌లో ప్రణాళికేతర పద్దు కింద జలమండలికి రూ.వెయ్యి కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఈ ఏడాది  జలమండలి రూ.1750 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలను సర్కారుకు సమర్పించింది. కానీ ప్రభుత్వం వెయ్యికోట్లు కేటాయించింది. గతేడాది బడ్జెట్‌లోనూ ప్రభుత్వం జలమండలికి వెయ్యి కోట్ల మేర నిధులను కేటాయించిన విషయం విదితమే. కాగా ఈ నిధుల్లో రూ.750 కోట్లు కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకాలకు తీసుకున్న రుణాలు, వాయిదాలు, వడ్డీ చెల్లింపులు, మిగిలిపోయిన పనులు చేపట్టేందుకు వెచ్చించనున్నారు. మరో రూ.100 కోట్లతో ఔటర్ రింగురోడ్డుకు లోపలున్న గ్రామ పంచాయతీల పరిధిలో మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. మరో రూ.150 కోట్లతో ప్రధాన నగరం, శివార్లలో మంచినీరు, మురుగునీటి పారుదల వ్యవస్థల ఆధునికీకరణ, మరమ్మతులకు ఖర్చు చేయనున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపలున్న 190 గ్రామ పంచాయతీల పరిధిలో మంచి నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు రూ.606 కోట్లు అవసరముండగా.. ప్రభుత్వం రూ.100 కోట్లతో సరిపెట్టింది.
 
జీహెచ్‌ఎంసీ నుంచే ఆర్టీసీ నష్టాల భర్తీ
ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ అభివృద్ధి కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. ఆర్టీసీ నష్టాలను ఇక నుంచి జీహెచ్‌ఎంసీయే భరించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దిశగా గతంలో రూ.120 కోట్ల మేర జీహెచ్‌ఎంసీ నుంచి ఆర్థిక సహాయం అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది నమోదైన రూ.275 కోట్ల ఆర్టీసీ నష్టాలను సైతం జీహెచ్‌ఎంసీయే భరించనున్నట్టు తెలిపారు. సుమారు 3800 బస్సులతో ప్రతి రోజు 32 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని ఆర్టీసీ అందజేస్తోంది. భారీగా పెరిగిన కార్మికులు, ఉద్యోగుల  జీతభత్యాలు, నిర్వహణ వ్యయం, విడిభాగాల ఖర్చు, ఏసీ బస్సులపై వరుస నష్టాలతో రోజుకు సుమారు రూ.కోటి ఆర్థిక భారం పడుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ముంబయిలోని ‘బెస్ట్’ తరహాలో ఆర్టీసీ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. విద్యుత్తు, రవాణా రంగాలు ముంబయి నగర పరిపాలనలో భాగంగా నిర్వహిస్తున్నట్టుగానే హైదరాబాద్ ఆర్టీసీని కూడా జీహెచ్‌ఎంసీకి అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నష్టాలను భర్తీ చేయడమే కాకుండా ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం, బస్‌బేలు, బస్ షెల్టర్లు తదితర మౌలిక సదుపాయాలను కూడా జీహెచ్‌ఎంసీయే అభివృద్ధి చేయనుంది.
 
పెరిగిన సాంస్కృతిక బడ్జెట్

రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వార్షిక బడ్జెట్‌లో సాంస్కృతిక, పర్యాటక, యువజన సర్వీసుల శాఖలకు ప్రాధాన్యతనిచ్చింది. ఈ విభాగాలకు గతంలో రూ. 154 కేటాయించింది. ముఖ్యమంత్రి సర్వేలో అభివృద్ధి దిశలో పయనించే శాఖల్లో నీటిపారుదల, ఐటీ శాఖల తర్వాత స్థానం సాంస్కృతిక శాఖకు దక్కింది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ 2016-17లో రూ. 336 కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదించగా ఈ వార్షిక బడ్జెట్‌లో రూ. 232 కోట్లు ఇచ్చింది. ఇందులో ఇందిరా పార్కు సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్మించ తలపెట్టిన కళాభారతికి రూ. 50 కోట్లు కేటాయించారు. దీని నిర్మాణ పనులు ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించారు. హ్యాపినింగ్ హైదరాబాద్‌కు, ఈవెంట్స్ నిర్వాహణ కోసం రూ. కోటి కేటాయించారు. పండుగలకు రూ. 50 కోట్లు ప్రకటించారు. రవీంద్రభారతికి గత బడ్జెట్‌లో రూ. 3 కోట్లు కేటాయించగా ఇప్పుడు రవీంద్రభారతితో పాటు పలు కళా సంస్థలకు రూ. 5 కోట్లు కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement