GHMC: ‘ఇంటెలిజెన్స్‌’తో లోపాలకు చెక్‌! ఆస్తిపన్ను ఆదాయం పెంపునకు జీహెచ్‌ఎంసీ చర్యలు 

GHMC Analytics Intelligence Solution Property Tax Assessment - Sakshi

జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను అసెస్‌మెంట్లలో.. పన్నుల విధింపులో పారదర్శకత, ఖచ్చితత్వం ఉండేందుకు అధికారులు దృష్టి సారించారు. వివిధ స్థాయిల్లో ఆస్తిపన్ను విషయంలో తలెత్తుతున్న లోపాలను సవరించి సక్రమంగా పన్నులు రాబట్టాలని, డిఫాల్టర్లను గుర్తించి జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఇందుకోసం  ‘అనలిటిక్స్‌ ఇంటెలిజెన్స్‌ సొల్యూషన్‌’ను అనుసరించాలని భావిస్తున్నారు. 

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను అసెస్‌మెంట్లలో.. పన్నుల విధింపులో వింతలెన్నో. ఒకే ప్రాంతంలో ఒకే విస్తీర్ణంలో ఉన్న భవనాలకే ఒక భవనానికి  రూ.12 వేల ఆస్తిపన్ను ఉంటే...ఇంకో భవనానికి రూ.7 వేలే ఉంటుంది. కొందరు యజమానులకు ఒక్క ఏడాది ఆస్తిపన్ను బకాయి ఉంటేనే చెల్లించేంతదాకా ఒత్తిడి  తెచ్చే సిబ్బంది, కొందరు ఏళ్ల తరబడి చెల్లించకున్నా పట్టించుకోరు. భవనం ప్లింత్‌ ఏరియాకు.. ఆస్తిపన్ను విధించే ఏరియాకు పొంతన ఉండదు. వాణిజ్య ప్రాంతాల్లో వాణిజ్య భవనాలుగా కొనసాగుతున్న వాటికి సైతం నివాస భవన ఆస్తిపన్ను మాత్రమే ఉంటుంది.

అంతేకాదు.. పక్కపక్కనే ఉన్న ఇళ్లకైనా సరే కొందరికి ఆస్తిపన్ను చదరపు మీటరుకు రూ.3 ఉంటే.. కొందరికి రూపాయికన్నా తక్కువే ఉంటుంది.  ఇలాంటి వాటితో జీహెచ్‌ఎంసీ ఖజానాకు వాస్తవంగా రావాల్సిన ఆస్తిపన్ను రావడం లేదని గుర్తించిన అధికారులు ఆదాయానికి ఎక్కడ గండి పడుతుందో గుర్తించాలనుకున్నారు.  అవకతవకలకు చెక్‌ పెట్టేందుకు ఆన్‌లైన సంబంధిత ‘అనలిటిక్స్‌ ఇంటెలిజెన్స్‌ సొల్యూషన్‌’ను అనుసరించాలని నిర్ణయించారు. తద్వారా లోపాలెక్కడున్నాయో గుర్తించి సరిదిద్దాలని భావించారు. అందుకు గాను ప్రతిష్టాత్మక ఐటీ సంస్ధ నుంచి ‘ప్రాపర్టీటాక్స్‌  ఇంటెలిజెన్స్‌ సిస్టమ్‌’ను సమకూర్చుకోవడంతోపాటు మూడేళ్ల వరకు నిర్వహణ బాధ్యతలు సైతం అప్పగించాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు సైతం ఈ సిస్టమ్‌ను వినియోగించడంలో శిక్షణ ఇవ్వనున్నారు. 

అసెస్‌మెంట్‌ లోపాలకు చెక్‌.. 
ఈ ఇంటెలిజెన్స్‌ ద్వారా, ముఖ్యంగా తక్కువ ఆస్తిపన్ను మాత్రమే ఉన్న భవనాలను గుర్తించి టాక్స్‌ అసెస్‌మెంట్‌లోనే తక్కువగా ఉంటే సరిచేస్తారు.  
భారీ మొత్తంలో బకాయిలున్నవారిని గుర్తించి వసూళ్ల చర్యలు చేపడతారు. అసెస్‌మెంట్‌ కాని భవనాలెన్ని ఉన్నాయో గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు.   
ఆస్తిపన్ను బకాయిదారులను గుర్తించడంలో ఏయే ప్రాంతాల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారో వంటి వివరాలను సైతం తెలుసుకుంటారు. తద్వారా టాక్స్‌సెక్షన్‌ సిబ్బంది  ప్రమేయాన్ని సైతం తెలుసుకునే వీలుంటుందని సమాచారం.  
రిజిస్ట్రేషన్, వాణిజ్యపన్నులశాఖ, తదితర  ప్రభుత్వశాఖల నుంచి సేకరించే సమాచారంతోనూ భవన వాస్తవ విస్తీర్ణాన్ని,  వినియోగాన్ని గుర్తించి వాస్తవంగా రావాల్సిన ఆస్తిపన్నును విధిస్తారు.  
360 డిగ్రీ వ్యూతో భవనాన్ని అన్నివిధాలుగా పరిశీలించి రావాల్సిన ఆస్తిపన్ను వసూలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతారు. అంతేకాదు..రావాల్సిన ఆస్తిపన్నును ముందస్తుగా అంచనా వేసి..అందుకనుగుణంగా జీహెచ్‌ఎంసీ  ఖర్చులకు ప్రణాళిక తయారు చేసుకుంటారు.  
ఈ సిస్టమ్‌ డెవలప్‌ ఆయ్యాక ఆస్తిపన్నుకు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలనుకున్నా వెంటనే పొందే వీలుంటుంది.  
ప్రస్తుతం ఏ సమాచారం కావాలన్నా సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(సీజీజీ)ని సంప్రదించాల్సి వస్తోంది. తమకు ఏ విధమైన వివరాలు కావాలో చెబితే.. తర్వాత ఎన్నో రోజులకు కానీ అది సమకూరడం లేదు. ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయి.  
ఆస్తిపన్ను డిమాండ్, వసూళ్లను సైతం ప్రాంతాలవారీగా లెక్కించి తక్కువ వసూలవుతున్న ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకుంటారు.  
ఆయా ప్రాంతాల్లో అత్యధికంగా ఆస్తిపన్ను చెల్లించే యజమానులను గుర్తించడంతోపాటు వారు   మూడేళ్లుగా చెల్లించిన ఆస్తిపన్ను వివరాలను కూ డా బేరీజు వేస్తారు. ప్రత్యేక డ్యాష్‌బోర్డులు  విని యోగించి  భవనయజమానుల్లో డిఫాల్టర్లను కూ డా గుర్తించి  అవసరమైన చర్యలు చేపడతారు.  

భవన వినియోగం తెలుస్తుంది.. 
ఖైరతాబాద్‌లోని ఒక వాణిజ్యప్రాంతంలో 90 శాతం వాణిజ్య భవనాలు కళ్లముందు కనబడుతున్నా జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్నురికార్డుల్లో మాత్రం వాణిజ్య భవనాలు 50 శాతానికి మించి లేవు.మిగతావన్నీ నివాసభవనాలుగా రికార్డుల్లో నమోదయ్యాయి. తద్వారా జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్నుకు గండి పడుతోంది.  ఇలాంటి అవకతవకలు సైతం ఈ సిస్టమ్‌ద్వారా వెల్లడవుతాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఆస్తిపన్నుకు సంబంధించి ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ ఎక్కువ ఆదాయం పొందేందుకు ప్రాపరీ్టట్యాక్స్‌ ఇంటెలిజెన్స్‌ సిస్టమ్‌ను వినియోగించనున్నారు. దీని ద్వారా పరిపాలనపరంగా పర్యవేక్షణ సైతం  సులభం కానుందని అధికారులు పేర్కొన్నారు.
చదవండి: కరోనా కేసుల్లేవ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top