బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని స్కైపార్క్ హుక్కా సెంటర్‌లో యువకుల మధ్య స్ట్రీట్ ఫైట్ జరిగింది.
హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని స్కైపార్క్ హుక్కా సెంటర్‌లో యువకుల మధ్య స్ట్రీట్ ఫైట్ జరిగింది. మంచినీళ్ల బాటిళ్లు ఎగిరేసుకుంటూ బెట్టింగ్‌లకు పాల్పడిన యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు... రోడ్ నెం.12లోని స్కై పార్క్ హుక్కా సెంటర్‌కు ఆనంద్‌నగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి సాద్ జాబ్రి తన స్నేహితుల తో కలిసి వచ్చాడు. అక్కడ హుక్కాతో పాటు మద్యం తాగుతూ సహచరులతో నీళ్ల బాటిళ్లు విసురుకునే బెట్టింగ్‌కు పాల్పడ్డాడు.
అయితే హుక్కా సెంటర్ యజమాని ముక్రం ఈ క్రీడను అడ్డుకున్నాడు. దీంతో బౌన్సర్లు రంగ ప్రవేశం చేశారు. రెండు గ్రూపులు గొడవకు దిగాయి. హుక్కా సెంటర్‌లో బీభత్స వాతావరణం నెలకొనడంతో వీరందరినీ బౌన్సర్లు బయటకి పంపేశారు.
అక్కడ కూడా తీవ్ర గొడవ జరగడంతో ముక్రం వారిని వారించే ప్రయత్నంలో జాబ్రికి దెబ్బ తగిలింది. మా స్నేహితుడిని కొడతారా అంటూ వెళ్లిన నవనీత్‌సింగ్‌పై కూడా దాడి చేశారు. అటు పాతిక మంది, ఇటు పాతికమంది గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. నిమజ్జన శోభాయాత్ర విధుల్లో ఉన్న పోలీసులు ఈ స్ట్రీట్‌ఫైట్‌ను చూసి అక్కడికి వచ్చి రెండు వర్గాలను చెల్లాచెదురు చేశారు. గాయాలపాలైన జాబ్రి, నవనీత్‌ను సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. దాడికి పాల్పడిన ముక్రంపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.