స్కూల్‌ వేళల మార్పు | State government finalized the plan for the summer | Sakshi
Sakshi News home page

స్కూల్‌ వేళల మార్పు

Mar 19 2017 5:02 AM | Updated on Nov 9 2018 5:56 PM

స్కూల్‌ వేళల మార్పు - Sakshi

స్కూల్‌ వేళల మార్పు

వడగాడ్పుల నుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది.

వేసవి ప్రణాళిక ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఉపాధి కూలీలకు నీడ,నీటి వసతి కల్పించాలి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీ ప్లూయీడ్స్, ఐస్‌ ప్యాక్స్‌ ఉంచాలి


సాక్షి, హైదరాబాద్‌: వడగాడ్పుల నుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. ప్రధానంగా ఆరుబయట శారీరక శ్రమ చేసే ఉపాధి కూలీలకు అవసరమైన నీడ... నీటి వసతి కల్పించాలని, పాఠశాలలను ఉదయం 11 గంటల లోపే నిర్వహించాలని, మరీ వడగాడ్పులు తీవ్రమైతే ముందే వేసవి సెలవులు ప్రకటించాలని వేసవి కార్యాచరణ ప్రణాళిక స్పష్టం చేసింది. అలాగే పారిశ్రామిక వాడల్లో పనిచేసే కార్మికులకు ఏసీ సౌకర్యం కల్పించాలని, వడగాడ్పుల సమయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్య బస్సులను నడపొద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీ ప్లూయిడ్స్, ఐస్‌ ప్యాక్స్‌ తదితర వాటిని అందుబాటులో ఉంచాలని పేర్కొంది. విపత్తు నిర్వహణశాఖ ఈ ప్రణాళికను జిల్లా కలెక్టర్లకు, వివిధ శాఖల అధిపతులకు పంపించింది. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించింది.

ఈసారి ఉష్ణోగ్రతలు అధికమే..
సాధారణ ఉష్ణోగ్రత 40 డిగ్రీలుండి... దానికి అదనంగా నాలుగైదు డిగ్రీలు పెరిగితే అధిక ఉష్ణోగ్రతతో కూడిన వడగాడ్పులుగా పరిగణిస్తారు. అలాగే ఏడు డిగ్రీలు అధికంగా ఉండి 47 డిగ్రీలకు చేరకుంటే దాన్ని తీవ్రమైన వడగాడ్పులుగా పరిగణిస్తారు. ఈ పరిస్థితి ఏప్రిల్, మే నెలల్లో ఉంటుంది. గతేడాది ఇటువంటి వడగాడ్పులు అధిక రోజులు వచ్చాయి. ఈసారి అంతకుమించిన పరిస్థితి ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదీ ప్రణాళిక...
► బస్టాండుల్లో ప్రయాణికుల కోసం, ఆరుబయట పనిచేసే వారికి ఉచితంగా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందజేయాలి.
► నగరాలు, పట్టణాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్స్‌ పెట్టి ఉష్ణోగ్రతల వివరాలు ప్రదర్శించడం.
► పాఠశాల టీచర్లకు శిక్షణ ఇచ్చి విద్యార్థులు వడదెబ్బ నుంచి రక్షణ తీసుకునేలా చేయడం.
►ఎఫ్‌ఎం రేడియో ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడం.
► 108 సర్వీసును, ఆరోగ్య కార్యకర్తలను, ఆశా వర్కర్లను అందుబా టులో ఉంచడం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వేళలను పెంచడం.
► ట్వీటర్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించి ప్రజలను అప్రమత్తం చేయడం. మొబైల్‌ ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపడం.
► అత్యంత ఎండ తీవ్రత ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం. 
► అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి తాగునీరు, వైద్య వసతి, నీడ కల్పించడం వంటి చర్యలు చేపట్టడం.
► వడదెబ్బకు గురైన వారికోసం ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వార్డులను నెలకొల్పడం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement