అమెరికాలో హైదరాబాదీ ఇంజినీర్ దుర్మరణం | software engineer namburi sridatta died in america | Sakshi
Sakshi News home page

అమెరికాలో హైదరాబాదీ ఇంజినీర్ దుర్మరణం

Jun 22 2016 2:06 AM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికాలో హైదరాబాదీ ఇంజినీర్ దుర్మరణం - Sakshi

అమెరికాలో హైదరాబాదీ ఇంజినీర్ దుర్మరణం

స్నేహితులతో కలసి వీకెండ్‌ను ఎంజాయ్ చేద్దామనుకున్న హైదరాబాదీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికాలో ప్రమాదవశాత్తూ దుర్మరణం పాలయ్యాడు.

► ప్రాణాల మీదకు తెచ్చిన వీకెండ్ సరదా
► జలపాతంలో పడి శ్రీదత్త నంబూరి మృతి
► శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులు
► శనివారం హైదరాబాద్‌కు రానున్న మృతదేహం
 
 సాక్షి, హైదరాబాద్: స్నేహితులతో కలసి వీకెండ్‌ను ఎంజాయ్ చేద్దామనుకున్న హైదరాబాదీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికాలో ప్రమాదవశాత్తూ దుర్మరణం పాలయ్యాడు. జలపాతం దగ్గరకు వెళ్లిన అతను కాలుజారి లోయలో పడి మృతి చెందాడు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఆదివారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వనస్థలిపురం కమలానగర్‌లో నివాసం ఉంటున్న ఎన్‌వీఎన్ స్వామి, రాగమణి దంపతుల పెద్ద కుమారుడు శ్రీదత్త నంబూరి. స్వామి తార్నాకలోని మార్గదర్శి కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తుండగా.. రాగమణి నాంపల్లిలోని అటవీశాఖ కార్యాలయంలో ఉద్యోగిని. శ్రీదత్త నాలుగేళ్లుగా అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఉంటున్నాడు. చదువు కోసం అమెరికా వెళ్లిన శ్రీదత్త ఎంఎస్ పూర్తిచేసి రెండేళ్లుగా అక్కడి టీసీఎస్ కంపెనీలో సీవీఎస్ హెల్త్ నెట్‌వర్క్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం వీకెండ్ కావడంతో స్నేహితులతో కలసి స్థానికంగా ఉన్న జలపాతం వద్దకు వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు కాలుజారి లోయలో పడి మృతిచెందాడు.

సోమవారం శ్రీదత్త మరణవార్త తల్లిదండ్రులకు తెలియడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. ‘మూడేళ్ల క్రితం చివరిసారిగా శ్రీదత్త హైదరాబాద్ వచ్చాడు. వచ్చే ఆగస్ట్‌లో ఇండియా వస్తానని రెండు రోజుల క్రితమే చెప్పాడు. ఈసారి బీటెక్ పూర్తిచేసిన సోదరుడు యజ్ఞను కూడా అమెరికా తీసుకెళ్తానని చెప్పిన మాటలు ఇంకా మా మదిలో మెదులుతున్నాయి’ అని శ్రీదత్త తల్లిదండ్రులు స్వామి, రాగమణి కన్నీటి పర్యంతమయ్యారు. చివరిసారిగా అన్నయ్య శనివారం వాట్సాప్‌లో చాటింగ్ చేశాడని, అమ్మానాన్నా అందరూ బాగున్నారా అని, ఆగస్ట్‌లో తనను కూడా అమెరికా తీసుకెళతానని చెప్పాడని, అంతలోనే ఘోరం జరిగిందని యజ్ఞ వాపోయాడు. కాగా, శ్రీదత్త మృతదేహం శనివారం వరకు హైదరాబాద్‌కు రావచ్చని బంధువులు తెలిపారు.

చదువులో ఎప్పుడూ ఫస్టే..
ఎన్‌వీఎన్ స్వామి సొంతూరు అనంతపురం జిల్లా తాడిపత్రి. వీరి కుటుంబం వనస్థలిపురం కమలానగర్‌లో కొన్నేళ్ల క్రితం వచ్చి స్థిరపడింది. వీరికి ఇద్దరు కుమారులు. శ్రీదత్త, యజ్ఞ. శ్రీదత్త చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు. వనస్థలిపురం శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి, నారాయణ కళాశాలలో ఇంటర్, సికింద్రాబాద్‌లోని స్వామి వివేకానంద ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ఎంఎస్ పూర్తిచేసి రెండేళ్లుగా టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement