రైల్వేస్టేషన్లలో ఇక మల్టీపర్పస్‌ స్టాళ్లు | Multipurpose stalls at railway stations | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్లలో ఇక మల్టీపర్పస్‌ స్టాళ్లు

Sep 10 2017 1:43 AM | Updated on Sep 19 2017 1:10 PM

రైల్వేస్టేషన్లలో ఇక మల్టీపర్పస్‌ స్టాళ్లు

రైల్వేస్టేషన్లలో ఇక మల్టీపర్పస్‌ స్టాళ్లు

ఒకవైపు రైలు ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉంటుంది. ఏ క్షణంలో కదులుతుందో తెలియదు.

- ఒకే చోట కేటరింగ్, నాన్‌ కేటరింగ్‌
ప్రయాణికుల సౌకర్యార్థం సరికొత్త మార్పులు  
సాక్షి, హైదరాబాద్‌: ఒకవైపు రైలు ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉంటుంది. ఏ క్షణంలో కదులుతుందో తెలియదు. కావలసిన వస్తువులు కొనుగోలు చేయాలంటే కనీసం నాలుగైదు స్టాళ్లయినా తిరగాలి. ఏ రైల్వేస్టేషన్‌లో చూసినా రకరకాల స్టాళ్లు కనిపిస్తాయి. స్టాళ్లన్నీ వడపోసి కావలసిన వస్తువులు కొనుక్కోవడమంటే చాలా కష్టమైన పని. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది. నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూనే అన్ని రకాల వస్తువులు ఒకేచోట లభించే విధంగా దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన రైల్వేస్టేషన్లలో మల్టీపర్పస్‌ స్టాళ్లు వినియోగంలోకి రానున్నాయి.

ఇప్పటి వరకు ఉన్న నిబంధనల మేరకు హస్తకళా వస్తువులు, పుస్తకాలు, పత్రికలు, మేగజైన్‌లు, ఇతర వస్తువులను విక్రయించే స్టాళ్లలో ఆహారపదార్థాల అమ్మకానికి అవకాశం లేదు. కొన్ని స్టాళ్లలో టీ, స్నాక్స్, వాటర్‌ మాత్రమే ఉండగా అల్పాహారం, భోజనం వంటివి లభించవు. కొన్ని రకాల స్టాళ్లు డెయిరీ ఉత్పత్తులకు మాత్రమే పరిమితమై ఉంటాయి. ఇలా ఒక్కొక్కటి ఒక్కో చోట లభించడం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలగడమే కాకుండా తీవ్రమైన జాప్యం కూడా కలుగుతుంది. ఉదాహరణకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మొత్తం 10 ప్లాట్‌ఫామ్‌లపై సుమారు 50 స్టాళ్లు ఉన్నాయి.

కేటరింగ్‌ ఐటమ్స్‌ విక్రయించేవి ఒకటి, పదో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కువగా ఉంటే నాన్‌ కేటరింగ్‌ స్టాళ్లు 7, 8 ప్లాట్‌ఫామ్‌లపైన కనిపిస్తాయి. ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పైన రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు ఏడో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌కు వెళ్లి అవసరమైన మేగజైన్‌లు తెచ్చుకోవడం చాలా కష్టం. 8వ నంబర్‌పై ఎదురుచూసే వాళ్లు ఆహారం కోసం ఒకటో నంబర్‌కు రావాలన్నా ఇబ్బందిగానే ఉంది. ఈ అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని అన్నీ ఒకేచోట అనే సరికొత్త నిబంధనను రైల్వేబోర్డు అమల్లోకి తెచ్చింది. ఎంపిక చేసే స్టాళ్లన్నీ ఈ కొత్త నిబంధనల మేరకు ప్రయాణికులకు అవసరమైన వస్తువులన్నింటినీ తప్పనిసరిగా విక్రయించవలసి ఉంటుంది.
స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యత...
రైల్వేస్టేషన్లలో స్థానిక వంటలు, స్నాక్స్, ఇతరత్రా ఆహార పదార్థాలు, హస్తకళా వస్తువులు, కళాకృతుల విక్రయాలకు ప్రాధాన్యతనిస్తోన్న రైల్వేశాఖ స్టాళ్ల కేటాయింపుల్లో మహిళా స్వయం సహాయక గ్రూపులకు ప్రాధాన్యతనివ్వాలని భావిస్తోంది. ఆసక్తి గల మహిళా సంఘాలు స్టాళ్లను ఏర్పాటు చేసుకొనేందుకు రైల్వేశాఖ ప్రోత్సాహం ఇవ్వనుంది. వ్యాపార రంగంలో అనుభవం ఉన్నవాళ్లకు అవకాశం కల్పిస్తూనే మహిళా సంఘాలకు కూడా స్టాళ్లను కేటాయిస్తారు. ఏ రైల్వేస్టేషన్‌లో ఎన్ని స్టాళ్లు ఉండాలి. వాటి ఎంపిక, మహిళా సంఘాలకు కేటాయింపులు వంటి అంశాల్లో జోనల్, డివిజినల్‌ అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement