రైళ్లు వస్తున్నాయ్‌..!

Secunderabad railway station ready for trains arrival after 52 days - Sakshi

నేడు సికింద్రాబాద్‌ చేరుకోనున్న రెండు సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లు

ఢిల్లీ నుంచి బెంగళూర్, బెంగళూర్‌ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు 

ప్రయాణికుల రాకపోకల నేపథ్యంలో స్టేషన్‌లో కొత్త ఏర్పాట్లు 

పదో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచే ప్రస్తుతానికి రాకపోకలు

ఎస్కలేటర్లు, లిఫ్టులకు బ్రేక్, విశ్రాంతి గదుల్లో భౌతిక దూరం..

సాక్షి, హైదరాబాద్‌: సుమారు 52 రోజుల విరామం తర్వాత సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ రైళ్ల రాకపోకలకు సన్నద్ధమైంది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. న్యూఢిల్లీ నుంచి బెంగళూర్, బెంగళూర్‌ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే రెండు ప్రత్యేక సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లలో బుధవారం ఉదయం ఒకటి, సాయంత్రం మరొకటి సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకోనున్నాయి. ఈ రైళ్లలో దాదాపు 300 మంది నగరానికి చేరుకోనున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారి కోసం రైల్వేశాఖ ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. బుధవారం నగరానికి చేరుకోనున్న వారితో పాటు ఇక్కడి నుంచి బయలుదేరనున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

ఇక నుంచి సాధారణ రాకపోకలకు భిన్నమైన సరికొత్త నిబంధనల మధ్య ప్రయాణికుల రాకపోకలు సాగనున్నాయి. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో రైల్వేస్టేషన్‌ను ఇప్పటికే పూర్తిగా శానిటైజ్‌ చేశారు. అన్ని ప్లాట్‌ఫామ్‌లు, విశ్రాంతి గదులు, ట్రాక్‌లను శుద్ధి చేశారు. ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలపైన ప్రత్యేక సూచికలు, బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేందుకు ప్లాట్‌ఫామ్‌లపైన ప్రతి ఆరు అడుగులకు మార్కింగ్‌ చేశారు. ట్రైన్‌ ఎక్కేసమయంలో ఈ భౌతిక దూరం తప్పనిసరి. అలాగే రైలు బయలుదేరే సమయానికి 90 నిమిషాలు ముందు మాత్రమే లోనికి అనుమతించనున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతనే ట్రైన్‌ ఎక్కేందుకు అనుమతిస్తారు. ట్రైన్‌ దిగిన వారికి కూడా ఈ స్క్రీనింగ్‌ నిర్వహించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. ట్రైన్‌ ఎక్కేవారికి, దిగేవారికి చేతులు శుభ్రంచేసుకొనేందుకు శానిటైజర్లు ఇస్తారు. ప్రయాణికులు ఇంటి నుంచే భోజనం, వాటర్‌ బాటిల్‌ తెచ్చుకోవడం మంచిదని అధికారులు సూచించారు. 

అందుబాటులో వైద్యులు..
ప్రయాణికులకు జరిపే థర్మల్‌ స్క్రీనింగ్‌లో ఎలాంటి అనుమానాలు కనిపించినా, కరోనా లక్షణాలున్నా వెంటనే 104కు ఫోన్‌ చేసి పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం పదో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పైన నిపుణులైన డాక్టర్లు విధులు నిర్వహిస్తారు. అనుమానాలున్న ప్రయాణికులను ప్రత్యేక గదుల్లో ఉంచుతారు. అలాంటి వారు ట్రైన్‌ దిగిన తర్వాత, లేదా ఎక్కేందుకు వచ్చిన వారైనా సరే లక్షణాలను పరిగణనలోకి తీసుకొని 104కు సమాచారం అందజేస్తారు.

పదో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచే..
కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రత్యేక రైళ్ల రాకపోకలను పదో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌కే పరిమితం చేశారు. దీంతో ఒకటో నంబర్‌ నుంచి 9వ నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ వరకు ఎలాంటి కార్యకలాపాలుండవు. లిఫ్టులు, ఎస్కలేటర్లను కూడా వినియోగించుకొనేందుకు అవకాశం ఉండదు. ప్రయాణికులు నేరుగా బోయిన్‌పల్లి వైపున్న పదో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. బుధవారం నగరానికి చేరుకోనున్న బెంగళూర్‌–న్యూఢిల్లీ, న్యూఢిల్లీ–బెంగళూర్‌ ప్రత్యేక రైళ్లు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌ నుంచే బయలుదేరనున్నాయి. ప్రయాణికులు కూర్చునేందుకు సీట్ల మధ్య భౌతిక దూరం పాటించే విధంగా ప్లాట్‌ఫామ్‌పైన ప్రత్యేక మార్కింగ్‌ చేసినట్లు ఇండియన్‌ రైల్వే స్టేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రతినిధి శ్రీనివాస్‌ తెలిపారు.మరోవైపు ఇటు ప్రయాణికులు మినహా స్టేషన్‌లోకి ఇతరులు రాకుండా ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top