
మొక్కలు నాటితేనే ఇళ్ల అనుమతులు
ఇంకుడుగుంత నిర్మిస్తేనే ఇంటి నిర్మాణానికి ప్రస్తుతం అనుమతులిస్తున్నట్లుగానే ఇకపై ఇంటి స్థలం ఆవరణలో మొక్కలు నాటిన ఫొటోను జతచేసి ఇంటి నిర్మాణ దరఖాస్తును
- దీనిపై త్వరలో చట్టం తెస్తాం
- హరితహారంలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : ఇంకుడుగుంత నిర్మిస్తేనే ఇంటి నిర్మాణానికి ప్రస్తుతం అనుమతులిస్తున్నట్లుగానే ఇకపై ఇంటి స్థలం ఆవరణలో మొక్కలు నాటిన ఫొటోను జతచేసి ఇంటి నిర్మాణ దరఖాస్తును సమర్పిస్తేనేఅనుమతులు మంజూరు చేస్తామని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. అపార్ట్‌మెంట్ల వద్ద స్థలం లేకపోతే మరోచోట మొక్కలు నాటడానికి అవకాశం కల్పిస్తామన్నా రు. ఈ మేరకు త్వరలో చట్టం చేస్తామమ న్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో హరితహారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణ అనుమతుల విధానంలో మార్పులు తీసుకొచ్చి మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడం లక్ష్యంగా పనిచేస్తామని...తద్వారా దేశంలోనే హరిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు.
ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలు...
రాష్ర్టంలో ప్రస్తుతం 24 శాతంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి పెంచాలనుకుంటున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇందుకోసం ఏటా 46 కోట్ల మొక్కల చొప్పున వచ్చే ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలను నాటాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. వాతావరణ మార్పులను గమనించే కేసీఆర్ 1989లో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఏటా మొక్కలు నాటుతూ పచ్చదనంలో తన నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రభాగాన నిలిపారన్నారు. ఆ స్ఫూర్తితోనే హరితహారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఈ ఏడాది 10కోట్ల మొక్కలు నాటనున్నామన్నారు. ఈ నెల 11న జీహెచ్‌ఎంసీ పరిధిలో 25 లక్షల మొక్కలు, 15నరాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో 10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించామని చెప్పారు.
రాష్ట్రంలో 85 లక్షల కుటుంబాలు, 3.60 కోట్ల జనాభా ఉందని, ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటితే లక్ష్యం సులభంగా నెరవేరుతుందన్నారు. హైదరాబాద్‌లో 25 లక్షల కుటుంబాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటాలనే సంకల్పంతోహరిత ఉద్యమంలో పాల్గొనాలని కేటీఆర్ కోరారు. కార్యక్రమంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేదీ, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్లు కొమిరిశెట్టి సాయిబాబా, హమీద్ పటేల్, సైబరాబాద్ జంట కమిషనర్లు నవీన్‌చంద్, మహేష్ భగవత్, జాయింట్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్‌ఎంసీ వెస్ట్ జోన్ కమిషనర్ గంగాధర్‌రెడ్డి, డీసీపీ కార్తికేయ, ఏసీపీ రమణకుమార్, డీసీ మనోహర్, టెక్‌మహీంద్ర, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్, వ్యాన్‌గార్డ్, విద్యా జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థలకు చెందిన ఉద్యోగులు, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు పాల్గొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ వెస్ట్ పరిధిలో 50 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు కమిషనర్ నవీన్‌చంద్ తెలిపారు.