
విషం నుంచి విముక్తి!
పారిశ్రామిక వ్యర్థ జలాల నుంచి చారిత్రక హుస్సేన్ సాగర్‌కుత్వరలో విముక్తి లభించనుంది.
నెలాఖరుకు కూకట్‌పల్లి నాలా మళ్లింపు పనులు పూర్తి
మొత్తం 2.85 కి.మీ. మార్గానికి మిగిలింది 175 మీటర్లే
హాని కారక రసాయనాల నుంచి బయటపడనున్న సాగర్
ఫలించిన సీఎం కేసీఆర్ సంకల్పం
సిటీబ్యూరో: పారిశ్రామిక వ్యర్థ జలాల నుంచి చారిత్రక హుస్సేన్ సాగర్‌కుత్వరలో విముక్తి లభించనుంది. దశాబ్దాలుగా బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న గరళాన్ని గర్భంలో దాచుకుని కాలుష్య కాసారంగా మారిన ‘సాగరం’ ఈ నెలాఖరుతో విషపు కోరల నుంచి బయటపడనుంది. కూకట్‌పల్లి నాలా నుంచి రోజువారీ చేరుతున్న 500 మిలియన్ లీటర్ల (సుమారు 50 కోట్ల లీటర్లు) పారిశ్రామిక వ్యర్థ జలాలను మూసీలోకి మళ్లించే పనులు ఈ నెలాఖరుకు పూర్తి కానున్నాయి. మొత్తం రూ.53 కోట్ల అంచనా వ్యయంతో 2.85 కి.మీ. మార్గంలో నాలుగు ప్యాకేజీలుగాచేపట్టిన ఈ పనుల్లో సింహభాగం పూర్తయ్యాయి. ప్రస్తుతానికి 175 మీటర్ల మేరకు మిగిలి ఉన్నాయి. వీటిని ఈ నెలాఖరుకుపూర్తి చేయనున్నట్లు జలమండలి ప్రాజెక్టు డెరైక్టర్ కొండారెడ్డి, ఈడీ సత్యనారాయణలు ‘సాక్షి’కి తెలిపారు.
కాలుష్య కోరల నుంచి బయటకు...
బాలానగర్, జీడిమెట్ల, పాశమైలారం తదితర పారిశ్రామిక వాడల నుంచి నిత్యం 500 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు హుస్సేన్ సాగర్‌లో కలుస్తున్నాయి. వీటిలో బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు విడుదల చేస్తున్న లెడ్, అల్యూమినియం, క్రోమియం, నికెల్,పాదరసం వంటి హానికారక రసాయనాలు, లోహాలు సాగరంలో చేరుతున్నాయి. ఈ జలాశయంలోని వృక్ష, జంతుజాలం మనుగడను దెబ్బ తీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగరాన్ని ప్రక్షాళన చేసేందుకు ‘మిషన్ హుస్సేన్ సాగర్’ అనే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ముందుగా కూకట్‌పల్లి నాలా నుంచి వస్తున్న వ్యర్థ జలాలు సాగరంలో చేరకుండా నేరుగా మూసీలోకి మళ్లించేందుకు పనులు ప్రార ంభించారు. ఏడు నెలల క్రితం రూ.53 కోట్ల అంచనాతో వీటిని చేపట్టారు. ప్రకాశ్‌నగర్ ఐ అండ్ డీ (ఇంటర్‌సెప్టార్ అండ్ డైవర్షన్) నుంచి మారియట్ హోటల్ దిగువ వరకు ఈ పనులను చేపట్టారు. ఈ మార్గంలో 2,200 డయా వ్యాసార్థం గల భారీ మైల్డ్‌స్టీల్ పైపులైను ఏర్పాటు చేసి వ్యర్థజలాలు మారియట్ హోటల్ అవతల ఉన్న సాగర్ సర్‌ప్లస్ నాలాకు వదిలి పెట్టనున్నారు. అక్కడి నుంచి ప్రకాశ్ నగర్, గోల్నాక, అంబర్‌పేట్‌ల మీదుగా మూసీలోకి ప్రవేశించనున్నాయి. మార్గమధ్యలో అంబర్‌పేట్ మురుగు శుద్ధి కేంద్రం వద్ద వ్యర్థజలాల్లో ఉన్న ఘన వ్యర్థాలను తొలగించి మూసీలోకి వదలుతారు.
కష్టాలకు ఎదురొడ్డి...
కూకట్‌పల్లి నాలా మళ్లింపు పనులకు అధికారులు శ్రమ పడాల్సి వచ్చింది. ప్రధానంగా మూడో ప్యాకేజి మార్గంలోని అంబేద్కర్‌నగర్ మురికివాడలో ఒకవైపు జనావాసాలు, మరోవైపు భారీ నీటి పైపులైన్ మధ్యలో ఈ నాలా మళ్లింపునకు అవసరమైన పైపులైన్ వేయడం కష్టంగా మారిందని పనులు చేపట్టిన జీఎస్‌కేసంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాం తంలో తవ్వకాలు చేపట్టినపుడు మట్టికుప్పలు, పెళ్లలు విరిగిపడడం, సాగర్ కు సమీపంలో ఉండడంతో తవ్విన వెంటనే గుంతలోకి నీటి ఊట రావడంతో సాంకేతికంగా అవాంతరాలు ఎదురయ్యాయన్నా రు. ఇసుక బస్తాలను అడ్డుగా పేర్చి రేయింబవళ్లు పనులు పూర్తి చేస్తున్నామన్నారు.