
వచ్చే వేసవిలో హుస్సేన్ సాగర్ ఖాళీ!
కాలుష్య కాసారంగా మారిన హుస్సేన్‌సాగర్‌ను వచ్చే వేసవిలో ఖాళీ చేసి.. ఇకపై శుద్ధిచేసిన నీటిని మాత్రమే హుస్సేన్‌సాగర్‌లో కలిసేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్: కాలుష్య కాసారంగా మారిన హుస్సేన్‌సాగర్‌ను వచ్చే వేసవిలో ఖాళీ చేసి.. ఇకపై శుద్ధిచేసిన నీటిని మాత్రమే హుస్సేన్‌సాగర్‌లో కలిసేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఆయా విభాగాల అధికారులు సాగర్‌ను ఖాళీచేసేందుకు తమ పరిధిలో చేయగల పనులపై దృష్టి సారించారు. ఈ మహాయజ్ఞంలో తాను కూడా శ్రమదానం చేస్తానని సీఎం స్వయంగా ప్రకటించడంతో ఆయా అధికారుల్లో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 'మిషన్ హుస్సేన్‌సాగర్' ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఆయా విభాగాలు సాగర్‌ను ఖాళీ చేయించే ప్రక్రియలో తాము చేపట్టాల్సిన పనులపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
త్వరలో జరుగబోయే ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ఆయా విభాగాల అధికారులు బాధ్యతలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా సాగర్‌ను ఎప్పటిలోగా ఖాళీ చేయాలి, పూడికను ఎక్కడకు తరలించాలి తదితర అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఇందుకుగాను అన్ని విభాగాలను సమన్వయం చేసే బాధ్యతను జీహెచ్‌ఎంసీకి అప్పగించనున్నట్లు సమాచారం. అయితే తాము ఇప్పటి వరకు హుస్సేన్‌సాగర్‌కు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని జీహెచ్‌ఎంసీ కమిషనర్.. స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో హుస్సేన్‌సాగర్ సమూల ప్రక్షాళన, సాధ్యాసాధ్యాలు, ఎదురయ్యే ఇబ్బందులు, విభాగాల వారీగా బాధ్యతల నిర్వహణ, ప్రణాళికలు, వ్యయం తదితర అంశాలపై 'సాక్షి' ఫోకస్..
బృహత్ ప్రణాళిక..
చెరువులు, నీటి తరలింపు, పూడిక తీతకు మూడు నెలల సమయం పట్టనున్నట్లు అంచనా. నీటి తరలింపు పనుల కోసం 45 రోజులు, సాగర్‌లోని పూడికను తరలించేందుకు మరో 45 రోజులు పట్టవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. హుస్సేన్‌సాగర్ నీటి నిల్వ సామర్ధ్యం 1 టీఎంసీ కాగా, సాగర్‌లో ప్రస్తుతం 0.8 టీఎంసీల నీరుంది. సగటున రోజుకు 400 క్యూసెక్కుల తోడిపోసినా జలాశయాన్ని ఖాళీ చేసేందుకు దాదాపు 45 రోజులు పట్టవచ్చు. అయితే సాగర్ నీరు వెళ్లే తూముల గుండానే నీటిని బయటికి పంపాల్సి ఉన్నందున నీటి వేగాన్ని పెంచేందుకు 200 హెచ్‌పీ సామర్ధ్యం కలిగిన పదికి పైగా మోటార్లు, లేదా 1800 హెచ్‌పీ సామర్ధ్యం కలిగిన నాలుగైదు మోటార్లు వినియోగించాల్సి ఉంటుందని అంచనా.
ప్రారంభంపై మల్లగుల్లాలు
ఈ మహాయజ్ఞానికి సంబంధించి ఆయా ప్రభుత్వ విభాగాలు తాము చేయగల పనులు.. వ్యయం తదితరమైన వాటిపై ప్రస్తుతం కసరత్తు చేసి, ఎవరికివారు నమూనా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే పని విభజన.. వ్యయం తదితర అంశాలతోపాటు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక తయారు కావాల్సి ఉంది. ఇందులో విభాగాల వారీగా బాధ్యతలు అప్పగించిన తర్వాతే వారు అధికారికంగా తమ పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి టెండర్లు పిలవాల్సి ఉంది. ఇవన్నీ ఈ వేసవిలోనే జరగడం కష్టమనే కొందరు పేర్కొంటున్నారు. ప్రక్రియ అంటూ ప్రారంభిస్తే.. వచ్చే నవంబర్-డిసెంబర్ నుంచి పనులు ప్రారంభం కాగలవని సమాచారం. అయితే ఈ విషయుంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయుంపైనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఉన్నతస్థాయి కమిటీ..
వివిధ పాలసీలు.. పథకాలకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ హుస్సేన్‌సాగర్ నీటిని తొలగించే అంశంపై తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకుగాను ఆయా విభాగాల నుంచి సమాచారం కోరినట్లు సమాచారం. ఈ నివేదికలను పరిశీలించిన తర్వాత మిషన్ హుస్సేన్‌సాగర్‌పై కమిటీ తగు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
పూడికతీతే కీలకం..
నీటి తరలింపు తర్వాత మరో కీలకమైన పని డీసిల్టింగ్. అయితే పూడికను తడిగా ఉన్నప్పుడే తరలిస్తారా.. లేక ఎండిపోయాక తరలిస్తారా అనేదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందుకు గాను దాదాపు 45 రోజులు పట్టవచ్చునని ప్రాథమిక అంచనా. పూడిక పరిమాణం దాదాపు 45 లక్షల క్యూబిక్ మీటర్లు ఉండవచ్చునని, రోజులకు లక్ష క్యూబిక్ మీటర్ల వంతున తరలించినా దాదాపు 45 రోజులు పట్టవచ్చునని అంచనా. ఇందుకుగాను దాదాపు 50 పొక్లెయిన్లు అవసరం కాగలవని నిర్ణయించారు. టెండరు పొందే కాంట్రాక్టు సంస్థ వనరుల ఆధారంగా తరలింపు పనులు చేపట్టనున్నారు.
నీటి తరలింపు.. పూడిక తరలింపు పనులకు దాదాపు రూ. 100 కోట్లు ఖర్చు కాగలవని ప్రాథమిక అంచనా. అయితే పూడికను డంప్ చేసే అంశాన్ని బట్టి ఖర్చులో హెచ్చుతగ్గులుంటాయి. పూడికను ఎక్కడ డంప్ చేయాలనే అంశంలోనూ స్పష్టత లేదు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ తరలిస్తున్న పూడికను కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో డంప్ చేస్తున్నారు. సాగర్ ఖాళీ ప్రక్రియలో వచ్చే వ్యర్థాలను సైతం అక్కడే డంప్ చేస్తారా.. లేక దూరప్రదేశాలకు తరలిస్తారా అన్నదానిపై ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీటితోపాటు భూసార పరీక్షలు చేసి.. దేనికి ఉపకరిస్తే అందుకనుగుణంగా తగు చర్యలు తీసుకోనున్నారు. భూసార పరీక్షలను బట్టి క్వారీలకు తరలించి, ఇటుకల తయూరీకి ఉపకరిస్తే అందుకు వినియోగించాలని భావిస్తున్నారు.
పర్యవేక్షక పాత్రలో పీసీబీ..
హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ప్రక్రియలో పీసీబీ పర్యవేక్షక బాధ్యతలు నిర్వహించనుంది. జలాశయంలోని నీటిని ఖాళీ చేసిన తర్వాత ప్రభుత్వం ఆదేశిస్తే జలాశయం అడుగున పేరుకుపోయిన రసాయనిక ఘన వ్యర్థాలు (సెడిమెంట్స్)ను పరీక్షిస్తామని పీసీబీ సీనియర్ పర్యావరణ శాస్త్రవేత్త ఒకరు 'సాక్షి'కి తెలిపారు. జలాశయం అడుగున దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఘన వ్యర్థాలు పోగుపడి ఉండవచ్చునని ఆయన పేర్కొన్నారు.
వీటిని తొలగించి గాజులరామారంలో ప్రభుత్వం కేటాయించిన భూమిలో ల్యాండ్‌ఫిల్లింగ్ (భూమిలో భూగర్భంలోనికి ఇంకని తరహాలో పూడ్చివేత) విధానంలో వ్యర్థాలను నిక్షిప్తం చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా పర్యావరణానికి, అక్కడి పరిసరాలకు, భూగర్భజలాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని స్పష్టం చేశారు.
తరలింపులోనే తలనొప్పి..!
సాగర్‌నుంచి వెలువడిన పూడికను పరిసరాల్లోనే ఒకే దగ్గర కుప్పగా పోసి దశలవారీగా దూరప్రాంతాలకు తరలించడమా.. లేక ఎప్పటికప్పుడే తరలింపు పనులు చేపట్టాలా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ కారణంగా వెలువడే వ్యర్థాలు, కలుషిత వాయువులు, దుర్గంధం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. తోడి వేసిన మట్టిని పిరమిడ్ ఆకారంలో కుప్పగా పోసి వాటిపై మొక్కలు పెంచేందుకు కూడా అవకాశం ఉందని సంబంధిత రంగం నిపుణులు పేర్కొంటున్నారు. సాగర్ ఒడ్డున ఇందుకు అవకాశం ఉందని, ఈ కారణంగా పక్షులు రావడానికీ వీలుంటుందని, తద్వారా జీవవైవిధ్యానికీ ఆస్కారముంటుందని వారు పేర్కొంటున్నారు. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో మొక్కల పెంపకం.. పిల్లల ఉద్యానవనాలు ఏర్పాటు చేసే వీలుందన్నారు.
చాలా మంచిపని చేస్తున్నారు
హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం నూటికి నూరుశాతం సరైంది. ఇందుకుగాను పక్కా ప్రణాళికలు రూపొందించాలి. గతంలో డ్రెడ్జింగ్ ద్వారా సుమారు 5.5లక్షల టన్నుల పూడిక తీసేందుకే రెండేళ్లు సమయం పట్టింది. ప్రస్తుతం సాగర్‌లో 40లక్షల టన్నుల మేర పూడిక ఉందంటున్నారు. అసలు ఎంత పూడిక ఉందన్నది ట్రయల్ పిట్ ద్వారా తెలుస్తుంది. ప్రాథమిక అంచనా ప్రకారం 40లక్షల టన్నులు పూడిక ఉందనుకొంటే.. సుమారు 16 లక్షల క్యూబిక్ మీటర్ల పిల్ట్ ఉంటుందని అంచనా. దీన్ని తొలగించడానికి ఎంత ఖర్చు అవుతుందన్నది ఇప్పుడే చెప్పలేం. డంపింగ్ యార్డ్ దూరం పెరిగితే.. వ్యయం కూడా పెరుగుతుంది. అయితే.. నీటి మట్టం తగ్గేకొద్దీ దుర్వాసన వెదజల్లుతుంది. దానిని నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- మాజీ ఈఎన్‌సీ టి.హనుమంతరావు
అందరూ కీలకమే..
సాగర్‌ను ఖాళీచేసే మహాక్రతువులో వివిధ ప్రభుత్వ విభాగాలు ముఖ్య భూమిక పోషించనున్నాయి. ఆయా విభాగాల వారీగా బాధ్యతలు ఇవీ..
* నీటిపారుదలశాఖ: ఈ యజ్ఞంలో ముఖ్యభూమిక వీరిదే. హుస్సేన్‌సాగర్ నీటి మట్టం.. నీటి నిల్వ.. నీటి తరలింపు.. తదితర అంశాలను పరిశీలించి అందుకు చేయాల్సిన ఏర్పాట్లు, తదితర కీలక బాధ్యతలు వీరే నిర్వహించాల్సి ఉంటుంది.
* మైనింగ్ విభాగం: భూగర్భపరీక్షలు నిర్వహించి వెలువడే వ్యర్థాలను ఎక్కడకు తరలించాలనే అంశంపై తగు నిర్ణయం తీసుకోనున్నారు.
* పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు: వెలువడే దుర్గంధం.. వాయు కాలుష్యం తదితర అంశాలపై అంచనా వేసి ప్రజల ఆరోగ్యానికి హాని కలుగకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది..
* జీహెచ్‌ఎంసీ: వ్యర్థాల తరలింపు.. తదితర బాధ్యతలతోపాటు స్థానిక సంస్థగా వివిధ విభాగాలను సమన్వయం చేయడంలో ప్రధాన భూమిక పోషించనుంది.
* హెచ్‌ఎండీఏ: ఇప్పటికే హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు సంబంధించిన అనుభవముండటంతో దానిని కొనసాగించాల్సి ఉంటుంది. గత అనుభవాలతో భవిష్యత్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
* జలమండలి: వివిధ నాలాల నుంచి వచ్చే మురుగునీరు హుస్సేన్‌సాగర్‌లో కలువకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
* పోలీసు: హుస్సేన్‌సాగర్‌ను ఖాళీ చేసే సమయంలో.. వ్యర్థాల తరలింపులో ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా అవసరమైన ఏర్పాట్లతోపాటు బందోబస్తు నిర్వహించాల్సి ఉంటుంది.
* పరిపాలన విభాగాలు: పరిపాలనను పర్యవేక్షించే జీహెచ్‌ఎంసీ పరిధిలోని జిల్లాల కలెక్టర్లు తమవంతు సేవలందించాల్సి ఉంటుంది.
వీరికి తోడు వివిధ శాఖలు ఎప్పటికప్పడు అవసరాలను బట్టి తమ సేవలు అందించాల్సి ఉంటుంది.
నిరోధమే మార్గం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూసీ పరివాహక ప్రాంతంలోని దాదాపు రెండు లక్షల ఎకరాలకుపైగా పంటపొలాలను విషతుల్యంగా మార్చే హుస్సేన్‌సాగర్ నీటి విడుదల కార్యక్రమానికి స్వస్తి పలకాలని సేవ్ అవర్ అర్బన్ లేక్స్ సంస్థ డిమాండ్ చేసింది. హుస్సేన్‌సాగర్ మురికినీటి తరలింపునకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమాన్ని చేపడతామని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అవసరమైతే ఈ విషయమై కోర్టుకు వెళతామన్నారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా, పర్యావరణ వేత్తల అభిప్రాయాలు పరిగణనలోనికి తీసుకోకుండా ప్రభుత్వం హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పేరుతో వ్యర్థాల తరలింపునకు పాల్పడడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అంతర్జాతీయ జల నిపుణులు డాక్టర్ సుబ్బారావు అన్నారు.
1974 ప్రివెన్షన్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ యాక్ట్ ప్రకారం పర్యావరణానికి హాని కలిగించే కర్మాగారాలు, ఫ్యాక్టరీలను మూసివేసేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్నారు. హుస్సేన్‌సాగర్‌లోకి వస్తున్న వ్యర్ధాలకు అడ్డుకట్ట వేయకుండా ప్రక్షాళన అసాధ్యమన్నారు. ప్రభుత్వం మొదట అటువంటి ఫ్యాక్టరీలు, కర్మాగారాలను నియుంత్రించాలని డిమాండ్ చేశారు. సాగర్ ఆక్రమణలు, కాలుష్యంపై రాజమణి, సాగర్‌ధార, ఆర్‌సీ రెడ్డి సమర్పించిన నివేదికలను ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకోలేదని సోల్ సంస్థ కోకన్వీనర్ లుబ్నా సర్వంత్ పేర్కొన్నారు.
ప్రజలకు ఉపయోగపడే చెరువులు, రిజర్వాయర్లు, నీటిని విషతుల్యంగా మార్చడం ఐపీసీ 277 ప్రకారం శిక్షార్హమన్నారు. సాగర్ నుంచి ఐదు నాలాల ద్వారా నీటిని తరలించడం వల్ల మూసీ పరివాహక ప్రాంత దిగవన ఉన్న ప్రజలు ముంపునకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కార్పొరేట్ సంస్థలు, రియల్టర్లకు మేలు చేసేందుకే ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సాగర్ లోని 40 లక్షల క్యూబిక్ మీటర్ల క్యాన్సర్ కారక వ్యర్థాలను ప్రజలపైకి వదిలి అసలే ప్రమాదకరంగా ఉన్న మూసీని మరింత విషతుల్యంగా మారుస్తున్నారని సంస్థ ఫౌండర్ కన్వీనర్ జస్లీన్ జేరత్ పేర్కొన్నారు.
పర్యావరణ నిపుణులు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వ్యర్థాలను తరలించేందుకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. పర్యావరణ వేత్తల, ప్రజల ప్రమేయంలేని సాగర్ ప్రక్షాళన కార్యక్రమంలో ప్రజాధనం వృథాకాదన్న గ్యారంటీ ఏమిటన్నారు. 2010లో ఏర్పాటు చేసిన లేక్ ప్రొటెక్షన్ కమిటీలో ఎందరో అధికారులు భాగస్వాములుగా ఉన్నా నగరంలో సరస్సులు, చెరువులు కాలుష్య కాసారాలుగా మారడానికి కారణాలేమిటో ప్రభుత్వమే తేల్చాలని సోల్ సంస్థ సభ్యులు శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాశహర్మ్యాల నిర్మాణం కాకుండా, ప్రజావసరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 28వ తేదీన సోల్ సంస్థ లేక్ మేళాను నిర్వహిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.