
ప్రభుత్వం కోరితే రిజిస్ట్రేషన్లు నిషేధించాల్సిందే
ఏదైనా ఒక ఆస్తిపై ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు హక్కును కోరుతూ దానిని రిజిస్టర్ చేయకుండా నిషేధించాలని కోరితే ఆ ఆస్తులను రిజిస్టర్ చేయకుండా తిరస్కరించాల్సిన బాధ్యత రిజిస్ట్రేషన్...
⇒ రిజిస్ట్రేషన్ చట్టంలోని 22ఏపై హైకోర్టు కీలక తీర్పు
⇒ సెక్షన్-22ఏ లోని క్లాజ్ (ఇ)పైనే ప్రధాన చర్చ
⇒ ఏ-డీ క్లాజుల్లో నిషేధిత ఆస్తుల జాబితా వెబ్‌సైట్లో ఉంది
⇒ క్లాజ్ (ఇ) పరిధిలోకి వచ్చే ఆస్తులపై నోటిఫికేషన్ జారీ చేయాల్సిందే
⇒ ఆ ఆస్తులపై అభ్యంతరాలు లేవనెత్తితే కమిటీ ఏర్పాటు చేయాలి
⇒ అభ్యంతరాలను ఈ కమిటీ మూడు నెలల్లో పరిష్కరించాలి
⇒ కమిటీ ఉత్తర్వులకు ప్రభుత్వం, బాధిత వ్యక్తులు కట్టుబడి ఉండాలి
⇒ ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై అధికారులకు దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: ఏదైనా ఒక ఆస్తిపై ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు హక్కును కోరుతూ దానిని రిజిస్టర్ చేయకుండా నిషేధించాలని కోరితే ఆ ఆస్తులను రిజిస్టర్ చేయకుండా తిరస్కరించాల్సిన బాధ్యత రిజిస్ట్రేషన్ అధికారులపై ఉందని ఉమ్మడి హైకోర్టు విస్తృత ధర్మాసనం స్పష్టంచేసింది. కొన్ని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయకుండా నిషేధించేందుకు ఉద్దేశించిన రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్-22ఏ విషయంలో శనివారం అత్యంత కీలక తీర్పు వెలువరించింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఇకపై ఎటువంటి విధానాన్ని అనుసరించాలో ఉమ్మడి రాష్ట్రాల రిజిస్ట్రేషన్ అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఏదైనా ఒక ఆస్తిపై ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు హక్కును కోరుతూ దానిని రిజిస్టర్ చేయకుండా నిషేధించాలని కోరుతుంటే ఆ ఆస్తి సెక్షన్-22ఎ క్లాజ్ (ఇ) పరిధిలోకి వస్తుందని తేల్చి చెప్పింది. అలాగే రీ సెటిల్‌మెంట్ రిజిష్ట్రార్ (ఆర్‌ఎస్‌ఆర్)లో డాట్లు ఉంటే ఆ ఆస్తికి సైతం క్లాజ్ (ఇ) వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇలాంటి ఆస్తులను నిషేధిత జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తే, ఆ ఆస్తులను రిజిష్టర్ చేయకుండా తిరస్కరించాల్సిన బాధ్యత రిజిస్ట్రేషన్ అధికారులపై ఉందని పేర్కొంది.
సెక్షన్-22ఎ విషయంలో ఇప్పటివరకు వేర్వేరు సందర్భాల్లో ఆరుగురు హైకోర్టు న్యాయమూర్తులు వెలువరించిన తీర్పులు, తాము వెలువరించిన ఈ తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా ఉంటే ఆ తీర్పులపై తమ తీర్పే అమలువుతుందని విస్తృత ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పునకు అందరూ కట్టుబడి ఉండాలంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తులు జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్, జస్టిస్ ఎం.సీతారామమూర్తులతో కూడిన ధర్మాసనం ఇటీవల 86 పేజీల తీర్పునిచ్చింది. సెక్షన్-22ఎ విషయంలో వచ్చిన తీర్పులపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, బాధిత వ్యక్తులు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఇదే అంశాన్ని పలువురు న్యాయవాదులు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నివేదించారు. దీంతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తన నేతృత్వంలో విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. 1200లకు పైగా వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. అందులోని ముఖ్యాంశాలు...
క్లాజ్ (ఇ) పరిధిలోకి వచ్చే ఆస్తులకు నోటిఫికేషన్ ఇవ్వాలి...
- ఆ ఆస్తులనైతే నిషేధించాలని కోరుతూ వాటి పూర్తి వివరాలను, అవి ఏ క్లాజు పరిధిలో వస్తాయో వాటి వివరాలను, అసలు వాటిని ఎందుకు నిషేధిత జాబితాలో చేర్చాలో సవివరంగా తెలియచేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది. ఇలా అన్ని వివరాలు అందుకున్న తరువాత, అందులో క్లాజ్ (ఇ) పరిధిలోకి వచ్చే ఆస్తులంటే వాటి గురించి మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసి, దానిని గెజిట్‌లో ప్రచురించాలి.
- క్లాజ్ (ఇ)లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, విద్యా, సాంస్కృతిక, ధార్మిక, మత సంస్థలకు అవోవ్డ్, అక్రూడ్ హక్కులున్న ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చకుంటే వాటిని విక్రయించే అవకాశాలుంటాయి. దీనివల్ల ప్రభుత్వానికి తీరని నష్టం కలుగుతుంది. అందువల్లే క్లాజ్ (ఇ) ఆస్తుల విషయంలో నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు, గెజిట్ ప్రచురణ అవసరం.
- ‘ఎ’ నుంచి ‘డి’ క్లాజుల్లో ఉన్న నిషేధిత ఆస్తుల జాబితా రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో ఉంది. ఏ పౌరుడైనా ఆ జాబితాను చూసుకునే సౌలభ్యం ఉంది. కాబట్టి వాటికి నోటిఫికేషన్ అవసరం లేదు.
ఉభయ రాష్ట్రాలు కమిటీని ఏర్పాటు చేయాలి...
- క్లాజ్(ఇ) కింద చేర్చిన ఆస్తులపై అభ్యంతరాలుంటే వాటిపై సంబంధిత అధికారులను ఆశ్రయించే ప్రత్యామ్నాయం ఉంది. అక్కడ ఎవరైనా తన వాదనలను వినిపించుకోవచ్చు. అందువల్ల ప్రాథమిక స్థాయిలో వాదనలు వినాల్సిన అవసరం ఏ మాత్రం లేదు.
- సెక్షన్-22ఎ కింద నిషేధిత జాబితాలో చేర్చిన ఆస్తి విషయంలో అభ్యంతరాలు ఉంటే వాటిని ప్రభుత్వం తనంతట తానుగా (సుమోటో) లేదా ఎవరైనా సమర్పించే దరఖాస్తు ఆధారంగా పరిష్కరించవచ్చు. నిషేధిత జాబితా నోటిఫికేషన్‌ను పూర్తిగా గానీ లేదా అందులో కొంత భాగాన్ని గానీ డీనోటిఫై చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది.
- ‘ఎ’ నుంచి ‘డి’ వరకు ఉన్న క్లాజుల్లో చేర్చిన ఆస్తులపై ఎవరికైనా అభ్యంతరాలుంటే వారు సంబంధిత కోర్టును ఆశ్రయించాలి. ఆ కోర్టు ఇచ్చే తీర్పే ఫైనల్.
- క్లాజ్ (ఇ)లో చేర్చిన ఆస్తులపై అభ్యంతరాలుంటే వాటిని పరిష్కరించేందుకు ఇప్పటికే ఓ యంత్రాంగం ఉంది. అయితే ఆ యంత్రాంగం సమర్థవంతంగా, న్యాయబద్ధంగా, వీలైనంత త్వరగా అభ్యంతరాలను పరిష్కరించేలా చూడాలి. ఇందుకుగాను ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా కమిటీ ఏర్పాటు చేయాలి. అందులో రెవిన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, డెరైక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, విశ్రాంత జిల్లా జడ్జీకి స్థానం కల్పించారు. ఈ కమిటీ గరిష్టంగా మూడు నెలల్లో అభ్యంతరాలను పరిష్కరించాలి.
- నిషేధిత జాబితాలో చేర్చిన ఆస్తులను ఆ జాబితా నుంచి తొలగించడంతోపాటు అభ్యంతరాల దరఖాస్తును తోసిపుచ్చే అధికారం ఈ కమిటీకి ఉంటుంది. ఈ విషయంలో అవసరమైన రికార్డులను పరిశీలించే అధికారం కూడా ఉంటుంది. కమిటీ ఇచ్చే ఉత్తర్వులకు రాష్ట్ర ప్రభుత్వం, బాధిత వ్యక్తులు కట్టుబడి ఉండాలి. లేదంటే సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఉభయ ప్రభుత్వాలు ఎనిమిది వారాల్లో కమిటీని ఏర్పాటు చేయాలి.
ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలు...
1. ఆస్తుల నిషేధిత జాబితా తయారు చేసే అధికారి ఆ ఆస్తి ఏ క్లాజు కింద వర్గీకరించారో స్పష్టంగా పేర్కొన్నాలి.
2. క్లాజు-ఏలో పేర్కొన్న ఆస్తులను ఏ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయకుండా నిషేధించారో కలెక్టర్ స్పష్టం చేయాలి. క్లాజు-బిలో పేర్కొన్న ఆస్తులకు సంబంధించి ఆ ఆస్తి ఏ ప్రభుత్వానికి చెందిందో పేర్కొనాలి.
3. క్లాజు-సీ, డీల ఆస్తుల విషయానికి వస్తే, ఆ ఆస్తులు దేవాదాయ లేదా వక్ఫ్, సీలింగ్ పరిధిలోకి వస్తాయా? రావా? అన్న దానిని స్పష్టంగా పేర్కొంటూ అందుకు సంబంధించి రిజిస్టర్‌లను, గెజిట్ నోటిఫికేషన్‌లను రిజిస్ట్రేషన్ అధికారులకు పంపాలి.
4. రిజిస్ట్రేషన్ అధికారులకు పంపే ఆస్తుల జాబితాను సంబంధిత అధికారులు రిజిస్ట్రేషన్ శాఖల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ వెబ్‌సైట్‌లో మార్పులు, చేర్పులు ఉంటే వాటిని పత్రికా ప్రకటన ద్వారా ప్రజలందరికీ తెలియచేయాలి.
5. ‘ఎ’ నుంచి ‘డి’ వరకు ఉన్న క్లాజ్లుల్లో తమ ఆస్తిని చేర్చడంపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే, ఆ జాబితా నుంచి తన ఆస్తిని తొలగించాలని ఆ వ్యక్తి అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తుపై అధికారులు ఆరు వారాల్లోపు నిర్ణయం వెలువరించాల్సి ఉంటుంది. నిర్ణయాన్ని ఆ వ్యక్తికి తెలియచేయాల్సి ఉంటుంది.
6. ‘ఎ’ నుంచి ‘ఇ’ వరకు ఉన్న క్లాజుల్లో చేర్చిన నిషేధిత ఆస్తుల జాబితాను బాధిత వ్యక్తి కోరితే, ఆ జాబితాను అధికారులు ఆ వ్యక్తికి పది రోజుల్లో అందచేయాలి.
7. ‘ఎ’ నుంచి ‘ఇ’ వరకున్న క్లాజుల పరిధిలోకి రాని ఆస్తుల్లో ఏదైనా ఆస్తి రిజిష్టర్ అయినంత మాత్రాన కొనుగోలు చేసిన వ్యక్తికి ఆ ఆస్తిపై హక్కు రాదు. ఆస్తి రిజిష్టర్‌పై అభ్యంతరాలుంటే ప్రభుత్వం తగిన ఫోరాన్ని ఆశ్రయించవచ్చు.
అసలు ‘22ఎ’ ఏం చెబుతోందంటే...
సెక్షన్-22ఎ (1): రిజిస్ట్రేషన్ నిషేధించిన ఆస్తులు, డాక్యుమెంట్ల గురించి చెబుతోంది.
క్లాజ్ (ఎ): రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం చేసిన ఏదైనా చట్టం ద్వారా స్థిరాస్తుల విక్రయాన్ని, బదలాయింపును నిషేధిస్తుంది.
క్లాజ్ (బి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఆస్తులను చట్టం అనుమతించి వ్యక్తులు మినహా) అమ్మడం, అమ్మేందుకు ఒప్పందం చేసుకోవడం, బహుమతి ద్వారా ఇవ్వడం, లీజుకివ్వడాన్ని నిషేధిస్తుంది.
క్లాజ్ (సి): దేవాదాయచట్టం, వక్ఫ్‌చట్టం పరిధిలోకి వచ్చే ఆస్తులను విక్రయించడం, అందుకు ఒప్పందం చేసుకోవడం, బహుమతి ద్వారా ఇవ్వడం, లీజుకివ్వడంపై నిషేధం విధిస్తుంది.
క్లాజ్ (డి): ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణ చట్టం, ఆంధ్రప్రదేశ్ పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం కింద మిగులు భూములు ప్రకటించిన భూములపై నిషేధం విధిస్తుంది.
క్లాజ్ (ఇ): సివిల్, క్రిమినల్, రెవెన్యూ కోర్టులు, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల బోర్డులు జప్తు చేసిన ఆస్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, విద్యా, సాంస్కృతిక, మత, ధార్మిక సంస్థలకు అవోవ్డ్, అక్రూడ్ హక్కులుప్పుడు ఆ ఆస్తులను రిజిస్ట్రేషన్ నుంచి నిషేధిస్తుంది.
అవోవ్డ్ ఇంట్రస్ట్: ఓ ఆస్తిపై ప్రభుత్వం బహిరంగంగా వ్యక్తం చేసే హక్కు
అక్రూడ్ ఇంట్రెస్ట్: ఓ ఆస్తిపై కాలానుగుణంగా సక్రమించే హక్కు
ఉదాహరణ 1: ప్రభుత్వం ఓ వ్యక్తిని భూమిని అసైన్‌మెంట్ కింద ఇచ్చింది. దీనిని అన్యాకాంత్రం చేయడం గానీ, విక్రయించడం గానీ చేయరాదన్న షరతుతో ప్రభుత్వం ఆ వ్యక్తికి పట్టా కూడా ఇచ్చింది. అయితే ఆ వ్యక్తి ఆ భూమిని ‘బి’ అనే వ్యక్తికి విక్రయించారు. ఆ తరువాత ఇది ప్రభుత్వ భూమి అని, దీని విక్రయంపై నిషేధం ఉందని ‘బి’ తెలుసుకున్నారు. అలాంటి భూమిని ప్రభుత్వం ఎప్పుడైనా స్వాధీనం చేసుకోవచ్చు. అలా ఉన్న హక్కే ‘అవోవ్డ్ ఇంట్రెస్ట్’ అవుతుంది.
ఉదాహరణ 2: ఓ ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగం ద్వారా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారు. దీంతో ఆ వ్యక్తిపై చట్టప్రకారం కేసులు నమోదుయ్యాయి. అతనిపై అభియోగాలు కూడా నిరూపణ అయ్యాయి. ఈ సమయంలో ప్రభుత్వం ఆ వ్యక్తి ఆస్తులను జప్తు చేయవచ్చు. అయితే కేసు తుది ప్రక్రియ ముగిసేంతవరకు ఆ ఆస్తులపై ప్రభుత్వానికి హక్కులు సంక్రమించవు. అంటే ఆ ఆస్తులపై ప్రభుత్వానికి కాలానుగుణంగా హక్కు సక్రమిస్తుంది. దీనినే ‘అక్రూడ్ ఇంట్రెస్ట్’ అంటారు.