
పెద్ద నోట్ల రద్దుతోనే ఆగదు: కేసీఆర్
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం అసాధారణ నిర్ణయమని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం అసాధారణ నిర్ణయమని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. శనివారం తెలంగాణ శాసనమండలిలో నోట్ల రద్దుపై జరిగిన చర్చలో కేసీఆర్ ప్రసంగించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం చాలామందికి అర్థం కావడం లేదని, ఇది ఇంతటితో ఆగదని, నల్లధనం ఏ రూపంలో ఉన్నా బయటకు కక్కించాల్సిందేనని కేసీఆర్ అన్నారు.
ప్రజలు కరెన్సీ కోసం ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని, నగదు రహిత సమాజం కోసం కృషి చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు. పెద్ద నోట్లను రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిది కాదని, దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఇక్కడా అదే జరుగుతోందని చెప్పారు. తెలంగాణలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రజలు నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూల్లో నిల్చుంటున్నారన్నారు. జనం కరెన్సీ కోసం ఎప్పటి వరకు క్యూలలో నిల్చోవాలని ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అడిగారని, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేందుకు 50 రోజులు సమయం ఇవ్వాలని ప్రధాని మోదీ అప్పుడే చెప్పారని కేసీఆర్ గుర్తు చేశారు.
ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న సయమంలో కూడా పెద్ద నోట్లను రద్దు చేయాలని భావించారని చెప్పారు. ఏదో కారణం వల్ల ఇది ఆగిపోయిందని తెలిపారు. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ప్రధాని మోదీతో మాట్లాడానని, సామాన్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. కడ్డీల రూపంలో అక్రమ నిల్వలు ఉన్న బంగారాన్ని లాక్కొంటారని, ఆభరణాలు ఉన్న మహిళలకు ఎలాంటి ఢోకా లేదని భరోసా ఇచ్చారు. మహిళలు భయపడాల్సిన పనిలేదని, అలాంటి పరిస్థితే వస్తే తాను మరోసారి తెలంగాణ ఉద్యమంత పోరాటం చేస్తానన్నారు. బంగారు, వజ్రాలు, నగదు రూపంలో దాచుకున్న నల్లధనం పోతుందని కేసీఆర్ చెప్పారు.