రాజ్యాంగంతోనే లౌకికవాదం పరిరక్షణ

Conservation of secularism with the constitution - Sakshi

లౌకికవాదంపై దాడులు జరుగుతున్నాయి

సెక్యులరిజాన్ని కాపాడేందుకు రాజ్యాంగమే ఆయుధం

‘మైనారిటీ’ అనే పదాన్ని విస్తృత పరిధిలో చూడాలి

లిటరరీ ఫెస్టివల్‌లో సీనియర్‌ జర్నలిస్ట్‌ సీమా ముస్తఫా  

సాక్షి, హైదరాబాద్‌: అనేక రకాల దాడుల నుంచి సెక్యులరిజాన్ని కాపాడుకునేందుకు రాజ్యాంగమే గొప్ప ఆయుధమని, రాజ్యాంగం ప్రసాదించిన అత్యున్నతమైన విలువల వెలుగులలో లౌకికవాదాన్ని పరిరక్షించుకోవాలని సీనియర్‌ జర్నలిస్టు సీమా ముస్తఫా పిలుపునిచ్చారు. సెక్యులరిజానికి విఘాతం కలిగించే చర్యలను నియంత్రించకపోవడం వల్ల రోజురోజుకూ తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా శనివారం బేగంపేట్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ‘బీయింగ్‌ ఏ సెక్యులర్‌ ముస్లిం ఇన్‌ ఇండియా’అనే అంశంపై ఆమె ప్రసంగించారు. అషార్‌ఫరాన్‌ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. గాంధీ, నెహ్రూ కాలం నాటి సెక్యులరిజాన్ని ఇప్పుడు చూడలేమని, ఆనాటి లౌకికవాద విలువలు ఇప్పుడు ఏ మాత్రం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వరుసగా జరుగుతున్న దాడులతో సెక్యులరిజానికి తూట్లు పడుతున్నాయి. దీంతో రాజ్యాంగ లక్ష్యం అమలుకు నోచడం లేదు. ప్రభుత్వాలు కూడా ఎలాంటి నష్టనివారణ చర్యలు చేపట్టడం లేదు. ఇది మన సెక్యులర్‌ వ్యవస్థకే ప్రమాదకరం’’అని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ వర్గాల్లో రోజురోజుకూ అసహనం పెరుగుతోందని, దీనివల్ల దాడులు, హింస చెలరేగుతున్నాయన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు పరమత సహనం, లౌకిక భావాలపై అవగాహన కల్పిస్తే భావితరాల్లో సెక్యులరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. 

వేర్పాటువాదం, మతం ఒకటి కాదు.. 
ప్రపంచంలో ఎక్కడ హింస చోటుచేసుకున్నా, దాడులు జరిగినా ఇక్కడ ముస్లింల పట్ల అసహనాన్ని ప్రదర్శించడం సరైంది కాదన్నారు. భారతీయ ముస్లింలు ఈ దేశ సంస్కృతిలో ఒక భాగమని అర్థం చేసుకోవాలన్నారు. ‘మైనారిటీ’భావనను ఏ ఒక్క దేశానికి, రాష్ట్రానికి పరిమితమైన అర్థంలో కాకుండా విస్తృత పరిధిలో చూడాలని, మొత్తం ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకుని మైనారిటీ భావనను పునర్నిర్వచించాలని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో తలెత్తే వేర్పాటువాద ఆందోళనలకు ముస్లిం మతానికి ఎలాంటి సంబంధం లేదని, రెండూ ఒకటి కాదని చెప్పారు. రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ విలువల పట్ల స్పష్టమైన అవగాహన ఉంటే ఇలాంటి అనేక విషయాలు స్పష్టంగా బోధపడతాయన్నారు. జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో సొంత అభిప్రాయాలకు తావు లేకుండా వాస్తవాలను యథాతథంగా రిపోర్ట్‌ చేయాలన్నారు. 

‘పద్మావత్‌’ మూవ్‌మెంట్‌లో ఉన్నాం.. 
కొన్ని రకాల అసహన భావాలను చూస్తోంటే ఎంతో విస్మయం కలుగుతోందని, చరిత్రను ఉన్నదున్నట్లుగా స్వీకరించేందుకు కూడా కొన్ని వర్గాలు సిద్ధంగా లేవని నల్సార్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ కన్నబీరన్‌ అన్నారు. ఇప్పుడు మనమంతా ‘పద్మావత్‌’ సినిమా మూవ్‌మెంట్‌లో ఉన్నామని, పద్మావతి అనే మహిళ పేరును ‘పద్మావత్‌’గా మార్చి చెప్పుకునే దుస్థితిలో ఉన్నామన్నారు. ‘ది పబ్లిక్‌ వాయిస్‌ ఆఫ్‌ వుమెన్‌’అనే అంశంపై కొలంబియా రచయిత్రి లారా రెస్ట్రెపో, సీమా ముస్తఫా పాల్గొన్నారు. కొలంబియాలో ఇప్పటికీ మహిళలు అనేక రకాలుగా హింసకు గురవుతున్నారని లారా ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు తమ భావప్రకటన స్వేచ్ఛను అనుభవించలేకపోతున్నారని, ఇందుకు రాజకీయాల్లో, సమాజంలో వ్యవస్థీకృత పురుషాధిపత్యమే కారణమని సీమా ముస్తఫా అన్నారు. మరోవైపు ‘ది జర్నీ ఆఫ్‌ కాటన్‌ ఇండియా’ అనే అంశంపై జరిగిన చర్చలో మీనా మీనన్, ఉజ్రమ్మ పాల్గొన్నారు. బీటీ కాటన్‌బారి నుంచి దేశ రైతాంగాన్ని కాపాడాలని, మన దేశ అవసరాలకు అనుగుణమైన స్వదేశీ విధానాన్ని అమలు చేయాలని ఉజ్రమ్మ కోరారు. ‘ది జునూన్‌ ఆఫ్‌ ది కెండల్స్‌ అండ్‌ కపూర్స్‌’అనే అంశంపై శశికపూర్‌ కూతురు సంజనా కపూర్‌ మాట్లాడారు. తమ తండ్రి కుటుంబం నుంచి, అమ్మ కుటుంబం నుంచి నాటక రంగానికి జరిగిన కృషిని గురించి వివరించారు. రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా గిరీష్‌ కాసరవల్లి దర్శకత్వంలో వెలువడిన ‘గులాబీ టాకీస్‌’సినిమాను ప్రదర్శించారు. ముంబైకి చెందిన చింటూసింగ్‌ కళాకారుల బృందం ప్రదర్శించిన బాంబే బైరాగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ భాషల్లో సాగిన కవి సమ్మేళనం విశేషంగా ఆకట్టుకుంది.

మిలిటరీ హీరోస్‌కు సెల్యూట్‌.. 
దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ శత్రువుతో వీరోచితంగా పోరాడే ఎందరో సైనికులు తమ సొంత జీవితాలను త్యాగం చేశారని, వారి త్యాగాలు స్ఫూర్తిదాయకమని ప్రముఖ జర్నలిస్టులు శివ్‌అరూర్, రాహుల్‌సింగ్‌ అన్నారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌తో పాటు, ఇటీవల జరిగిన పలు ఘటనల్లో ప్రాణాలను కోల్పోయిన 14 మంది వీరుల గాథలను వివరిస్తూ వారు రాసిన ‘ట్రూ స్టోరీస్‌ ఆఫ్‌ మోడరన్‌ మిలటరీ హీరోస్‌’పుస్తకంపై నిర్వహించిన సమీక్షలో వారు మాట్లాడారు. సరిహద్దుల్లో సైనికులతో గడిపిన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు చెప్పారు.

డబ్బింగ్‌ సినిమాలతో తీవ్ర నష్టం.. 
‘లిటరేచర్‌ అండ్‌ ఫిల్మ్‌’అనే అంశంపై నిర్వహించిన చర్చలో ప్రముఖ కన్నడ డైరెక్టర్‌ గిరీష్‌ కాసరవల్లి మాట్లాడుతూ.. డబ్బింగ్‌ సినిమాల వల్ల సినీపరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూస్తోందన్నారు. డబ్బింగ్‌ సినిమాల్లో ఏ మాత్రం సృజనాత్మకత ఉండదని, దీనివల్ల ఆయా భాషల్లో సినిమాలు తీసేందుకు అవసరమైన 70 విభాగాలు నష్టపోతాయన్నారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన ప్రజలు ఇప్పటికీ కనీస అవసరాలకు నోచుకోవడం లేదని, ప్రభుత్వ సేవలను కూడా వినియోగించుకోలేకపోతున్నారని ప్రముఖ సామాజిక కార్యకర్త ఆదిరాజు పార్థసారథి అన్నారు. ఈశాన్య రాష్ట్రాల స్థితిగతులపై నిర్వహించిన చర్చా కార్యక్రమానికి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బీపీ ఆచార్య అధ్యక్షత వహించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top