
ప్రచారం ...ఓ ప్యాకేజీ
‘కుదిరితే ఓ ర్యాలీ...వీలైతే రోజువారీ ప్రచారం. ఇంటింటికీ వెళ్లాల్సిన అవసరం. పని ఏదైనా మీరు మాకు జనాన్ని సమీకరించాలి.
ప్రచారం హోరెత్తించేందుకు అన్ని పార్టీల కసరత్తు
మందీ మార్బలాన్ని సమకూరుస్తున్న ‘ముఠా మేస్త్రీలు’
బస్తీల్లో అనధికార ఏజెంట్లు
తడిసి మోపెడవుతున్న ఖర్చులు
ఒక్కో అభ్యర్థి రోజు ఖర్చు రూ.5 లక్షలు పైనే
లెక్కాపద్దులతో అభ్యర్థుల కుస్తీ
‘కుదిరితే ఓ ర్యాలీ...వీలైతే రోజువారీ ప్రచారం. ఇంటింటికీ వెళ్లాల్సిన అవసరం. పని ఏదైనా మీరు మాకు జనాన్ని సమీకరించాలి. దేని లెక్క దానికే సర్దుతాం...’ అంటూ మన నేతలు ఇప్పుడు ముఠా మేస్త్రీలను(జనసమీకరణ జరిపే మధ్యవర్తులు) ఆశ్రయిస్తున్నారు. బల్దియా ఎన్నికల ప్రచార పర్వంలో జనసమీకరణ కోసం అభ్యర్థులు ఇలా పడరాని పాట్లు పడుతున్నారు. జెండాలు..కరపత్రాలు..పోస్టర్‌లు..హోర్డింగ్‌లు..ఫ్లెక్సీలు..టోపీలు...ప్రచార తోరణాల వంటి సరంజామా సమకూర్చుకోవడం ఒకెత్తయితే..వీటిని మోసుకెళ్లడం..తమ తరఫున ప్రచారాన్ని హోరెత్తించేందుకు అవసరమైన మందీ మార్బలాన్ని సమీకరించుకోవడం అభ్యర్థులకు ఇప్పుడు కఠిన పరీక్షగా మారుతోంది. ఆర్థికంగానూ ఇది తీవ్ర భారమవుతోంది. ప్రతి పనికీ ఓ ప్యాకేజీ ఉండడంతో అభ్యర్థులు హడలెత్తిపోతున్నారు. మరో వైపు ఎన్నికల కమిషన్ విధించిన ఆర్థిక పరిమితి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
జువారీగా సుమారు 200 నుంచి 400 మంది కార్యకర్తలు వెంట లేనిదే బల ప్రదర్శన, బైక్‌ర్యాలీ, వీధుల్లో ప్రచారం చేయడం కష్టాసాధ్యమవుతోందని అభ్యర్థులు సెలవిస్తున్నారు. స్థానిక ప్లే గ్రౌండ్‌లు, ఫంక్షన్‌హాళ్లలో ముఖ్య నేతల బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే వేలాదిగా జనాన్ని సమీకరించడం కత్తిమీద సాముగానే మారుతోందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల అవసరాలను క్యాష్ చేసుకునేందుకునగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి నయా జన సమీకరణ ఏజెన్సీలు.
వీటికి అన్ని సంస్థల్లాగా రిజిస్ట్రేషన్లు..కార్యాలయాలు..హంగులూ..బల్లలూ..కుర్చీలు..సెక్యూరిటీ..ఇతర ఆర్భాటాలు..గట్రా ఏమీ ఉండవండోయ్. కేవలం నోటి మాట ద్వారా బస్తీ..బస్తీలో ఉండే యావత్ జనాల్ని తమ వెంట తిప్పుకునే మాటల మరాఠీలు..ముఠా మేస్త్రీలే వీటి నిర్వాహకులు. ప్రచారానికి పంపించే మనిషికో రేటు. ర్యాలీకో లెక్క వీరు నిర్ణయిస్తారు. ముందు లెక్క తేలాకే ఎంతమంది జనం కావాలంటే అంతమందిని సమీకరించి వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు నిర్వహించే ప్రచారాలకు పంపించడం వీరి పని. పనిలోపనిగా వీరు పంపే ప్రతి మనిషిపై వీరికి రూ.వంద నుంచి రూ.200 కమీషన్ అదనంగా ముట్టజెప్పాల్సిందే మరి. ఇప్పుడు గ్రేటర్ వ్యాప్తంగా వీరి గిరాకీ..మూడు ర్యాలీలు..ఆరు ప్రచారాలు అన్నట్లు సాగుతుండడం విశేషం.
మహానగరం పరిధిలో సుమారు 1470 మురికివాడలున్నాయి. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న దినసరి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, సినిమా రంగంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సహాయకులకు మరో పదిరోజులపాటు ప్రచార పర్వం ఇలా ప్రత్యామ్నాయ ఉపాధిగా మారింది. రోజువారీగా పనికి వెళ్లని రోజున అడ్డా కూలీలు ..ముఠా మేస్త్రీ సూచనమేరకు ఏదో ఒక పార్టీ కండువా కప్పుకొని ప్రచార పర్వంలో పాల్గొంటే చాలు. రూ.400 నుంచి రూ.500 కూలీ గిట్టుబాటవడం తథ్యం. అంతేకాదు....బీరు..బిర్యానీ ఫ్రీ అంటూ అభ్యర్థులు ప్రకటిస్తున్న ప్రత్యేక ఆఫర్లు వారిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇక బైక్ ర్యాలీకి వెళ్లే వారికైతే ఒక్కరోజుకు లీటరు పెట్రోలు, రూ.400 నుంచి రూ.500 చేతిఖర్చులు ముట్టజెప్పనిదే ర్యాలీ విజయవంతం కాదనేది అభ్యర్థుల మాట.
ఈ లెక్కన ఒక భారీ ప్రదర్శన నిర్వహణకు వెయ్యి మందిని సమకూర్చుకుంటే ఒక్కరోజు ఖర్చు సుమారు రూ. ఐదు లక్షల వరకు తథ్యమని అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు. ప్రస్తుతం నామినేషన్ల ఉపసంహరణ పర్వంలో బిజీగా ఉన్న పార్టీలు గురువారం నుంచి ప్రచారంలో స్పీడు పెంచనున్నాయి. ఇందుకు ఇప్పటి నుంచే జనసమీకరణకు కసరత్తు ప్రారంభించాయి. ముఠామేస్త్రీలను సంప్రదిస్తూ వారితో గుట్టుగా జనసమీకరణ డీల్ కుదుర్చుకుంటున్నాయి మరి.
తీరొక్క ఖర్చు ఇలా...
►అభ్యర్థులు ప్రచార పర్వంలో భాగంగా చేసే ఖర్చులు విస్తుగొల్పుతున్నాయి. ఎన్నికల ప్రచారం ఎంత ఖరీదైన వ్యవహారమో తెలియజేస్తున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థుల నుంచి సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం అభ్యర్థులు ప్రచార పర్వంలో చేసే ఖర్చులు అందరూ ముక్కుమీద వేలేసుకునేలా చేస్తున్నాయి మరి.
►డప్పు కళాకారులను సమీకరించే మధ్యవర్తి..అభ్యర్థుల నుంచిఒక్కో కళాకారునికి రూ.800 నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. ఇందులో రూ.500 మాత్రమే కళాకారునికి దక్కుతుంది. మిగతాది మధ్యవర్తి జేబులోకే.
►వీధులు, రహదారులపై బ్యానర్లు కట్టేవారికి ఒక్కో బ్యానర్‌కు ప్రాంతాన్ని బట్టి రూ.25 నుంచి రూ.50 చెల్లించాలి. అంటే వెయ్యి బ్యానర్లు కట్టిస్తే రూ.25 నుంచి రూ.50 వేలు ఖర్చు చేయాల్సిందే.
►చిన్నపరిమాణంలో ఉండే గోడపత్రికలు అంటించేందుకు ఒక్కో పోస్టరుకు రూ.2 నుంచి రూ.5 చెల్లించాల్సి ఉంటుంది.
► జెండాలు మోసే మహిళా కార్యకర్తలకు రూ.300 చెల్లించాలి. పురుషులకైతే రూ.400 నుంచి రూ.450 చెల్లించాలి. టీ, టిఫిన్, భోజనం ఉచితం.
► బూత్‌స్థాయిలో ప్రచారం చేసే పార్టీ బృందాలకు పదిరోజులపాటు చేతి ఖర్చులకు రూ.40 నుంచి రూ.50 వేలు చెల్లించాలి.
► బైక్‌ర్యాలీకి వెళ్లే వారికి లీటరు పెట్రోలుతోపాటు చేతిఖర్చులకు రూ.400 నుంచి రూ.500 ముట్టజెప్పాల్సిందే.
►{పచార రథాలకు రూ.40 వేలు(పదిరోజులకు) చెల్లించాలి. డ్రైవరు బత్తా రూ.200 అదనం.
► పొదుపుసంఘాలు, బస్తీలీడర్లు, ముఖ్య నేతలకు సమర్పించుకునే ప్రత్యేక ప్యాకేజీలదనం.
ఎవరిలెక్కలు వారివే..!
కార్పొరేటర్‌గా పోటీచేసే అభ్యర్థి ప్రచార పర్వంలో మొత్తంగా రూ.5 లక్షలకు మించి ఖర్చు చేయరాదని ఎన్నికల కమిషన్ స్పష్టంచేసింది. అంతేకాదు ధరల పట్టిక సైతం విడుదల చేసింది. టీ, కాఫీకి రూ.10-12, వాటర్‌ప్యాకెట్ రూ.2, వాటర్‌బాటిల్ 200 ఎంఎల్ రూ.8, ఒకలీటరు వాటర్‌బాటిల్ రూ.21, పులిహోర 300 గ్రాములు రూ.40, ఆలు సమోసా రూ.10, వెజ్‌బిర్యానీ(750గ్రా)రూ.80, చికెన్‌బిర్యానీ రూ.140, బ్యానర్ చిన్నది రూ.100, కటౌట్(8 అడుగులు)రూ.1400, వాహనాల అద్దె వాహనాన్ని బట్టి రూ.1000-1800, హోటల్ గదుల అద్దెలు రూ.3 నుంచి 9 వేలు, టెంటు రూ.250 నుంచి రూ.600...ఇలా అభ్యర్థి చేసే ప్రతి ఖర్చుకు ఒక లెక్క ఉందని స్పష్టంచేసింది. కానీ ఇవన్నీ తమ ఖర్చులో ఒక భాగం మాత్రమేనని అభ్యర్థులు వాపోతున్నారు. జనసమీకరణ, ప్రచారపర్వాన్ని హోరెత్తించేందుకు ఖర్చుకు వెనుకాడితే ఇక గెలుపుసంగతి దేవుడెరుగు డిపాజిట్ దక్కే పరిస్థితి ఉండదని బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.