సీఎం కోసం అదనంగా బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సు | Bulletproof bus in addition to the CM | Sakshi
Sakshi News home page

సీఎం కోసం అదనంగా బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సు

Mar 6 2018 1:50 AM | Updated on Aug 15 2018 8:12 PM

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భద్రత విషయంలో పోలీస్‌ శాఖ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్, మావోయిస్టు పార్టీ హెచ్చరికల నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌ విభాగం మరింత అప్రమత్తమైంది. ఎన్నికలు సమీపిస్తుండడం, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో సీఎం పర్యటన కోసం అదనంగా మరో బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సును సమకూర్చాలని అధికారులు నిర్ణయించారు.

సీఎం కోసం రూ.7 కోట్లతో త్వరలో కొత్త బుల్లెట్‌ప్రూఫ్‌ బస్సు తయారు చేయించనున్నారు. రెండు లేదా మూడు నెలల్లో కొత్త బస్సును సిద్ధం చేయించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందుకోసం రవాణా శాఖ టెండర్లు పిలవనుంది. ఈ మేరకు బుల్లెట్‌ప్రూఫ్‌ బస్సు తయారీ కోసం సోమవారం సచివాలయంలో రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ అత్యవసర సమావేశం నిర్వహించారు. బస్సు తయారీ, సంబంధిత కొనుగోలు కోసం 8 మంది అధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు.

కొత్త బస్సు కోసం అవసరమైన అన్ని హంగులతో జీఏడీకి ప్రతిపాదనలు పంపాలని కమిటీ నిర్ణయించినట్టు తెలిసింది. బస్సు రూపకల్పనలో పాటించాల్సిన ప్రమాణాలు, పొందుపరచాల్సిన సాంకేతిక పరిజ్ఞానం, వాహనంలో ఏర్పాటు చేయాల్సిన ప్రత్యేక భద్రతా పరికరాలను ప్రతిపాదించడానికి 8 మంది సభ్యులు సూచనలు చేయనున్నారు. కమిటీ మెంబర్‌ కన్వీనర్‌గా ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ వ్యవహరించనున్నారు.

సభ్యులుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ త్రివేది, ఆర్టీసీ ఎం.డి. రమణారావు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌ చంద్, ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఓఎస్డీ ఎంకే సింగ్, టెక్నికల్‌ ఎక్స్‌ఫర్ట్, డీఐజీ శ్రీనివాస్‌రావు, ప్రొటోకాల్‌ అధికారి అర్విందర్‌ సింగ్, రవాణా శాఖ కమిషనర్‌ ఉంటారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement