
3డీ...హాబీ!
ఇప్పుడివి ట్రెండ్‌గా మారడమే కాదు... అతిథుల చేతుల్లో గిఫ్ట్‌గానూ ఒదిగిపోతున్నాయి. గృహిణులకు ఎక్కువ పెట్టుబడి అవసరం లేని ఉపాధి మార్గంగానూ మారుతున్నాయి.
3డీ బొమ్మలు...
ఇప్పుడివి ట్రెండ్‌గా మారడమే కాదు... అతిథుల చేతుల్లో గిఫ్ట్‌గానూ ఒదిగిపోతున్నాయి. గృహిణులకు ఎక్కువ పెట్టుబడి అవసరం లేని ఉపాధి మార్గంగానూ మారుతున్నాయి. సీనియర్ సిటిజన్స్, టెకీ పీపుల్ దీన్నో హాబీగా మార్చుకుంటున్నారు.
జేఎన్‌టీయూలో ఫైన్ ఆర్ట్స్ పూర్తిచేసిన మురళీధర్.. పెయింటింగ్స్‌కు స్కల్ప్చరింగ్ జోడించి బంక మట్టితో సరికొత్త రూపమిస్తున్నారు. వీటి తయారీలో ప్రత్యేక ముద్ర వేసుకున్న ఈయన మరెందరికో ఆ కళను నేర్పుతున్నారు. ఎస్పీ రోడ్‌లోని పైగా అపార్ట్‌మెంట్‌లో ఉన్న మురళీధర్ ఆర్ట్ గ్యాలరీ నిండా క్లేపెయింటింగ్స్, మ్యూరల్స్, స్కల్ప్చర్స్, ఆయిల్ పెయింటింగ్స్ కొలువుదీరి ఉంటాయి.
బంకమట్టితో త్రీ డెమైన్షన్ బొమ్మల్ని తీర్చిదిద్దడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడి శిబిరంలో నిత్యం వృద్ధులు, గృహిణులు 3డీ బొమ్మల తయారీలో శిక్షణ పొందుతుంటారు. సీనియర్ సిటిజన్స్ దీనినో హాబీగా మార్చుకుంటుంటే, గృహిణులు ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. ‘నేను రిటైర్డ్ అయిన తర్వాత 3డీ బొమ్మల తయారీని హాబీగా చేసుకున్నా. కొత్త బొమ్మల్ని ఇంకా డిఫరెంట్‌గా ఎలా చేయాలనే ఆలోచన నాలో ఉత్సాహాన్ని నింపుతోంది’ అంటారు కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి మల్లేష్.
బంకమట్టే ముడిసరుకు..
మురళీధర్ మొదట సిమెంట్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో త్రీడీ బొమ్మలు తయారు చేశారు. కానీ అవి బరువుతో కూడినవి కావడంతో పాటు పగుళ్లు కూడా వచ్చాయి. దీంతో బంకమట్టినే ముడిసరుకుగా బొమ్మల తయారీకి శ్రీకారం చుట్టారు. పర్యావరణంపై ప్రేమతో బంకమట్టి, జూట్, ఉడ్‌పౌడర్, ముల్తాన్‌మట్టి లాంటివే ఉపయోగించి రూపొందించిన ఆ శిల్పాల్లో జీవకళ ఉట్టిపడుతుంది. 2000 సంవత్సరం నుంచి ఆయన చేతిలో మదిని దోచే మట్టి బొమ్మలు, పోర్టరైట్స్, ల్యాండ్‌స్కేప్స్ కళాఖండాలు ప్రాణం పోసుకుంటున్నాయి.
వేలమందికి శిక్షణ
త్రీడీ బొమ్మలపై ఆసక్తితో తన గ్యాలరీకి వచ్చే వారి కోసం మురళీధర్ ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంటారు. పెయింటింగ్స్‌లో కాస్త అవగాహన ఉంటే చాలు 3డీ బొమ్మల తయారీని వారంలో నేర్చుకోవచ్చంటారు ఆయన. కొద్దికాలం శిక్షణ తీసుకుని ఇక్కడ దొరికే ముడిసరుకు తీసుకెళ్లి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఆయన దగ్గర రెండు వేల మంది శిక్షణ పొందారు.
సిటీతో పాటు బెంగళూరు, కోల్‌కతా, ముంబై నగరాల నుంచీ వస్తుంటారు. శిక్షణ పొందేవారిలో హాబీగా నేర్చుకునేవారే కాదు.. క్రాప్ట్, డ్రాయింగ్ టీచర్లు, విశ్రాంత ఉద్యోగులు, గృహిణులు కూడా ఉన్నారు. ‘నాకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్‌లో అనుభవం ఉంది. ఇక్కడి గ్యాలరీలో త్రీడీ బొమ్మల తయారీ నేర్చుకున్నా. ఇంట్లో ఉంటే బోర్ అనిపిస్తుంది. నాకు నచ్చిన ఈ పెయింటింగ్స్, బొమ్మల తయారీ ప్రక్రియను ఇప్పుడు ఇంట్లోనే చేసుకోగలుగుతున్నా’ అంటారు గృహిణి ప్రసన్న.