వందేళ్ల కథ

Sriramana Article On Karunanidhi - Sakshi

అక్షర తూణీరం 

’’తమిళ కట్టు’’ అనే పలుకుబడి వుంది. ఆ పలుకుబడికి చేవ తెచ్చిన రచయిత, సంస్కరణ వాది, ప్రజా నాయకుడు కరుణా నిధి. అసలు పేరు దక్షిణా మూర్తి. పూర్వీకులు గుండ్లకమ్మ ప్రాంతం నుంచి  కావేరి తీరానికి వలస వెళ్లారు. రచయితగా జీవితాన్ని  ప్రారంభించి, నాటకకర్తగా, సినిమా రైటర్‌గా,  పాత్రికేయునిగా విశేష ఖ్యాతి గడించారు. రాజకీయ  రంగంలో దశాబ్దాల పాటు రాణించారు. తమిళనాట కరుణానిధి ఒక శతాబ్దిని తనదిగా చేసుకున్నారంటే, అస్సలు అతిశయోక్తి కాదు. పెరియార్‌ ప్రభావంతో  హేతువాదిగా తనని తాను మలుచుకున్నాడు.  కడదాకా ఆ వాదంతోనే గడిపారు. అయితే కరుణానిధి జననేత. తన సొంత అభిప్రాయాలను జనసామాన్యంమీద రుద్దేవారు కాదు. ఆ సంవ త్సరం తమిళనాడులో వర్షాలు లేవు. నీళ్లకి  కటకటగా వుంది. మద్రాస్‌ కపాలి ట్యాంకులో  పాలకుడు మట్టితవ్వితే, వర్షాలు పడతాయని  స్థానికుల నమ్మకం.

సరే, అని ఒక సూర్యోదయాన నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి  సంప్రదాయ సిద్ధంగా కపాలేశ్వరస్వామి ఆలయం  దగ్గరకు మందీమార్బలంతో వచ్చారు. ఎండిపోయిన   కపాలి కొలనులోకి దిగారు. తలకి పాగా చుట్టారు. పలుగు, పార పట్టి స్వయంగా మట్టి తవ్వి శ్రద్ధగా  కరసేవ చేశారు. తమిళ, ఆంగ్ల, తెలుగు ప్రెస్‌ మొత్తం  అక్కడికి కదిలి వచ్చింది. ఆ దృశ్యాన్ని కెమెరాల్లోకి ఎక్కించుకుని వెళ్లింది ప్రెస్‌. ప్రజల నమ్మకాలకు గౌరవం ఇస్తానని వినయంగా చెప్పారు కరుణ. మర్నాడు పత్రికలన్నీ ఆ ఫొటోల్ని, వార్తల్ని ప్రముఖంగా ప్రచురించాయి. ’’కళైజ్ఞర్‌ నల్ల జెంటి ల్మనప్పా’’ అని పెద్దలు ప్రస్తుతించారు. కరుణానిధి ఒకనాటి చక్రవర్తి రాజగోపాలాచారి తర్వాత, ఎన్న తగిన తమిళ మేధావిగా కరుణానిధిని చెబుతారు. తమిళ జననాడి ఆయనకు తెలిసినంత క్షుణ్ణంగా మరొకరికి తెలియదని చెప్పుకుంటారు. 

రాజాజీ పరమ ఆస్తిక భావాలతో  జీవితం గడిపారు. కరుణ పరమ నాస్తిక భావాలతో గడిపారు. రచనలు కూడా భావాలకు తగ్గట్టే చేశారు. చాలా నాటకాలు రాశారు. చిత్ర రంగానికి వచ్చి ప దుల కొద్దీ స్క్రిప్ట్‌లు రాశారు. మదురై ప్రాచీన చరిత్రలో ప్రముఖంగా చెప్పుకునే ఒక సంఘటనని  ’’శిలప్పదికారం’’ నాటకంగా రచించారు. 

ఆ నాటకంలో ’’కణ్ణగి’’ కథానాయిక,  తనకు రాజువల్ల జరిగిన అన్యాయానికి ప్రతిగా  ఆగ్ర హిస్తుంది. మదురై నగరం ఆమె ఆగ్రహా జ్వాలల్లో బూడిద అవుతుంది. మద్రాస్‌ మెరీనా బీచ్‌ దగ్గరో కణ్ణగి కాంస్య విగ్రహం ప్రతిషించారు.  మహారాజు దౌష్ట్యాన్ని ధిక్కరించిన ఒక సామాన్య  యువతిగా కణ్ణగి మంచి గుర్తింపు వుంది. ఆమె  కుడిచేత బంగారు కడియం ఆగ్రహంతో  ఎత్తిపట్టుకున్న ప్రతిమ మొదట మద్రాసు నగరం  వైపు తిరిగి ఉండేది. అప్పట్లో సిటీలో తరచూ  అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, కణ్ణగిని సముద్రం వైపుకి తిప్పారు. ఇలాంటి నమ్మకాలకు   ద్రవిడ నేలలో నమ్మకం, గౌరవం ఎప్పుడూ ఉంది. 

యస్సెస్‌ రాజేంద్రన్, శివాజీ గణేశన్,  యమ్‌.జి.ఆర్‌–యీ ముగ్గురూ కరుణానిధి  ఉధృ తంగా డైలాగులు రాసే రోజుల్లో అగ్రహీరోలు.  కరు ణానిధి మాటల్లో ఒక విలక్షణమైన పలుకు వుండేది. సమకాలీన వ్యవస్థపై పదునైన విసుర్లు, అచ్చ తమిళ నానుడులు, జాతీయాలు, వళ్లువర్‌ లాంటి కవుల మాటలు వొదిగిపోయేవి. ఆయన సంభాషణల్లో ఒక బరువు, ఒక పరిమళం తప్పక వుండేది. రచనలు చేయడం ఆయనకు హాబీ కాదు,  పిచ్చి. సమ తామూర్తి శ్రీ మద్రామానుజుల చరిత్రని టీవీకి ఎక్కిస్తున్నపుడు కరుణ కలంపట్టారు.  ఆనందిస్తూ, అనుభవిస్తూ ఆ మానవతావాది  సీరియల్‌లో పాలు పంచు కున్నానన్నారు. కరుణానిధి  ప్రసంగం ని జంగా ఒక జలపాతం సభకి దిగుతున్నట్టే వుం టుంది. ఆగటం, తడబడటం,  సరిదిద్దడం వుం డదు. ముఖ్య విష యంతో బాటు  పిట్ట కథలు చమ త్కార బాణాలు, సామెతలు, సెటైర్లు వర్షించేవి. కరుణానిధి ప్రసంగం వినడం ఒక అనుభవం. ఆ మ హాప్రవాహంలో తమిళం తప్ప  యింకో భాషా పదం దొర్లేది కాదు. తమిళ భక్తి,  ద్రావిడ భావోద్వేగం, సంస్కరణాభిలాష ధ్వనించేవి. 13 సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు ముఖ్యమంత్రిగా జన  క్షేత్రంలో నిలవడం అసాధారణం. దేవుడికి మొక్కకపోయినా తమిళమ్మకి కారైకుడిలో గుడి కట్టారు.ప్రాచీన తమి ళకవులకు మండపాలు నిర్మించారు. ద్రవిడవాదానికి జెండాలెత్తినవాడు. కరుణ, యమ్‌జీఆర్‌ ఒక చెట్టు కొమ్మలే అయినా,  వేరుగా ఎదిగారు. దూరం దూ రంగా జరిగారు.  ద్రవిడ కట్టుకి మాత్రం తేడా రాలేదు. యమ్జీర్‌ తన  గ్లామర్తో ఒక రాజ్యాన్ని పాలించారు. కరుణానిధి సొంతగ్రామర్‌లో ఒక రాజ్యాన్ని సృష్టించారు.

శ్రీరమణ
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top