బ్రాండ్‌ రైస్‌

sri ramana writs on brand rice - Sakshi

అక్షర తూణీరం

అమరావతి కోసం అడిగిందే తడవుగా మూడు పంటలు పండే సుక్షేత్రాలను రైతులు అప్పగించారంటే– ఆరుగాలం కష్టించే రైతు విసిగి వేసారి ఉన్నాడని ఒక సర్వే సారాంశం.

గ్రామసీమలు, పల్లెపట్టులు, అన్నదాతలు, వెన్నెముకలు, రైతన్నలు, రైతురాజులు, కృషీవలురు, జైకిసాన్‌– ఇవన్నీ ఒఠ్ఠి మాటలు. గట్టి మేలెవరూ తలపెట్టడం లేదు. ప్రతిసారీ రైతుల్ని ఉద్ధరిస్తాం, గ్రామాల్ని ఉద్ధరిస్తాం అనే నినాదంతోనే రాజకీయ పార్టీలు బరిలోకి దిగుతాయి. తరాలు గడిచినా మట్టిని నమ్మిన వారికి అమాయకత్వం పోలేదు. తను దున్ని, విత్తి, పోషించి పండించకపోతే దేశానికి అన్నం ఉండదని గట్టిగా నమ్ముతాడు. తన కోసమే ఎండలు కాస్తున్నాయని, తన కోసమే వానలు పడుతున్నాయని విశ్వసిస్తాడు. దాన్ని ఆసరా చేసుకుని మన నల్లదొరలు హాయిగా ఏలుతున్నారు.

ఏనాడూ సేద్యం రైతుకి అధిక లాభాలు తెచ్చి పెట్టింది లేదు. అయినా రైతు కాడి కింద పారేసింది లేదు. కారణం ఆ రోజుల్లో గ్రామాల్లో జీవన వ్యయం తక్కువ. ఇప్పుడు బస్తీలతో పోటీ పడుతోంది. డెబ్భై ఏళ్లలో ప్రాథమిక సౌకర్యాలు కూడా పల్లెలకు అంద లేదు. రోడ్డు, కరెంటు లేని ఊళ్లు ఇంకా ఉన్నాయి. పెద్ద గ్రామాలకు సైతం శుద్ధమైన నీరు లేదు. సరైన విద్య లేదు. వైద్య సదుపాయం బొత్తిగా లేదు. ఎన్ని ప్రాథమిక పాఠశాలల్లో సరైన విద్య అందుతోందో, ఎన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మంచి వైద్యం ఉందో గుండెమీద చెయ్యి వేసుకు చెప్పండి. టీచర్లు, డాక్టర్లు నగరంలో ఉండి ఊళ్లో బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. దరిద్రం, అనారోగ్యం, విద్య లేమి కారణంగా వలసలు మొదలై నాయి. ఇది ఆరంభమై యాభై ఏళ్లు దాటుతున్నా, నాయకులు గమనిం చినా దీనికి అడ్డుకట్ట వేసే ప్రయ త్నం చిత్తశుద్ధితో ఆరంభించలేదు. సకల సౌకర్యాలతో ఉన్న గ్రామాలు ఇప్పటికీ నిండుగా కన్పిస్తున్నాయి.

రైతుకి సకాలంలో సరైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు లేరు. వారు వ్యవసాయ శాస్త్రం చదివిన వారు కాదు. అనూచా నంగా వచ్చే పద్ధతుల్నే పాటిస్తారు గానీ నూతన విధానాలంటే భయ పడతారు. వారికి కౌన్సెలింగ్‌ అవ సరం. యూరియా లాంటి రసాయ నాలు అతిగా ఎందుకు వాడరాదో వారికి అర్థమయ్యేలా చెప్పాలి. వచ్చే అనర్థాలని చూపాలి. ప్రతి మండల కేంద్రంలోనూ ఒక పరిశోధనా కేంద్రం ఉండాలి. అక్కడ అన్ని రకాల పంటల్ని ఆధునిక శాస్త్రీయ పద్ధతుల్లో పండించాలి. అలాగ రైతుని నమ్మించాలి. అతిగా నీటి వాడకం, ఎరువుల, మందుల వాడకం, ఇతర అశాస్త్రీయ నమ్మకాల్ని వమ్ము చేయాలి. ఇదంతా ఎవరు చేస్తారు?

అమరావతి కోసం అడిగినదే తడవుగా మూడు పంటలు పండే సుక్షేత్రాలను రైతులు అప్పగించారంటే– దాని వెనుక ఆరుగాలం కష్టించే రైతు విసిగి వేసారి ఉన్నాడని ఒక పరిశీలనలో తేలింది. పూర్వం గ్రామీణులకు ఇతర ఆదాయాలు ఉండేవి. పాడి పశువులు, గొర్రెలు, కోళ్లు, పెరటి కూరలు రోజువారీ ఖర్చులకు ఆసరాగా ఉండేవి. యాంత్రీకరణతో పశుసంపద పోయింది. జనం సుఖం మరిగారు. దళారీ రాజ్యం వర్ధిల్లుతోంది. నిజానికి బ్రోకర్లే ప్రజల్ని ప్రభుత్వాల్ని శాసిస్తున్నారు. ఇప్పుడు పుట్టు కొస్తున్న బ్రాండెడ్‌ రైస్‌లు, వాటి వ్యాపార ప్రకటనలో చూస్తేనే అర్థమవుతుంది. తడుపు తగలని మంచి సన్న ధాన్యాన్ని కల్లాల్లోనే సొంతం చేసుకుంటారు. రైతు ఎప్పుడు డబ్బులు చేతికందుతాయా అని ఎదురు చూస్తుంటాడు. చాలామంది సామాన్య రైతులు ముందే అప్పులు లేదా అడ్వాన్సులు తీసుకుని ఉంటారు. ఇక రుణదాత ఎప్పుడు వసూలు చేయమంటే అప్పుడు చేయాల్సిందే. రైతుకి గడ్డి మిగుల్తుంది. తినేందుకు పశువులు కూడా లేవు. ‘రైతు ఉద్ధరణ’ బాగా కలిసొచ్చిన నినాదం. అందుకే కమల్‌ హాసన్‌ ఆ మాటతో రంగంలోకి దిగాడు.

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top