రేపటి తరాల కోసం తిరుగులేని సంకల్పం

Special Article On CM YS Jagan One Year Ruling - Sakshi

సందర్భం

ఆంధ్రప్రదేశ్‌ నవ, యువ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు స్వీకరించిన ఏడాది లోపే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రజల ఆకాంక్షలను తీరుస్తున్న పేదల అను కూల సంస్కరణలకు ప్రతీ కగా తన ముద్ర వేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ భాషా మాధ్యమం ప్రవేశపెట్టడం, వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు మించని ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ పథకం వర్తింపచేయడం, విశిష్టమైన గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పర్చటం, విద్యా దీవెన, రైతు భరోసా వంటి అసంఖ్యాక పథకాలను ప్రారంభించారు. 2019 శాసనసభ ఎన్నికలకు ముందు తాను సాగించిన 3,600 కిలోమీటర్ల మారథాన్‌ పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర ప్రజల అవసరాలు, ఆకాంక్షలపై వైఎస్‌ జగన్‌ తెలుసుకున్న వాస్తవాల ప్రాతిపదికన ఈ పథకాలన్నీ అమలులోకి తీసుకొచ్చారు.

వైఎస్‌ జగన్‌ ప్రజలను నమ్ముకున్నారు. ఆ ప్రజలు సైతం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం కట్టబెట్టడం ద్వారా వైఎస్‌ జగన్‌పై నమ్మకం ఉంచారు. రాష్ట్రంలోని పిల్లలకు మాతృభాష అయిన తెలుగులోనే బోధన అవసరమంటూ పలువురు విద్యావేత్తలు సూచించినప్పటికీ.. కార్పొరేట్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లలో తమ పిల్లల చదువులకు భారీ ఫీజుల భారం నుంచి తమను బయటపడేయాలంటూ అసంఖ్యాక తల్లిదండ్రులు చేస్తున్న డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభం గురించి ప్రకటించారు. 

ఏ గొప్ప సమాజమైనా తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని వైఎస్‌ జగన్‌ బలమైన నమ్మిక. చదువుకోవడానికి దారిద్య్రం అడ్డుకాదని ప్రతి చిన్నారి భావించనంత కాలం మన సమాజం గొప్ప సమాజంగా ఉండదు. దారిద్య్రం నుంచి బయటపడేయడానికి ఒక అవకాశాన్ని కల్పించాలి. అయితే ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టేసింది. మాధ్యమిక విద్య వరకు మాతృభాషనే బోధనా మాధ్యమంగా కొనసాగించాలంటూ అనేకమంది విద్యావేత్తలు, విద్యా కమిషన్లు, మహాత్మాగాంధీ సైతం చేసిన వ్యాఖ్యలను హైకోర్టు ఈ సందర్భంగా ఉల్లేఖించింది. అయితే 1921లో యంగ్‌ ఇండియా పత్రికలోనే గాంధీ మనందరి హృదయాల్లో ఇంగ్లిష్‌ నిలిచి ఉందని గాంధీ నిజాయితీగా అంగీకరించారు. 

నాలుగు దశాబ్దాల క్రితం దేశంలో కార్పొరేట్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలు ప్రవేశించడంతో స్వల్ప ఆదాయాలు ఉన్న అనేకమంది తల్లిదం డ్రులు కూడా భారీ ఫీజులను చెల్లించి మరీ తమ పిల్లలను కార్పొరేట్‌ స్కూళ్లకు పంపించసాగారు. ఆ సమయంలోనే దేశంలోని సంపన్న, మధ్యతరగతి వర్గాలకు చెందిన పలువురు విద్యాధిక యువకులు మంచి ఆదాయాల కోసం అమెరికా తదితర దేశాలకు వెళ్లడం మొదలెట్టారు. కాలం గడిచేకొద్దీ పేద కుటుంబాలకు చెందిన విద్యాధిక యువత కూడా అమెరికా, తదితర దేశాలకు వెళ్లాలని కలకనడం ప్రారంభించారు. అయితే ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకోకపోతే టొఫెల్, జీఆర్‌ఈలలో మంచి మార్కులు సాధించడం అంత సులువు కాదని వీరికి అర్థమైంది. దీనికి తోడుగా పలు కార్పొరేట్‌ సంస్థలు ప్రధాన నగరాలు, పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలను ప్రారంభించాయి. దీంతో ప్రభుత్వ తెలుగు మీడియం స్కూళ్లలో చేరేవారి సంఖ్య తీవ్రంగా దెబ్బతింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే పేద తల్లిదండ్రులకు సహాయం చేయడానికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలని వైఎస్‌ జగన్‌ దృఢంగా నిర్ణయించారు. తమ పిల్ల లను పాఠశాలలకు పంపే ప్రతి తల్లికీ తలొక రూ. 15,000లను వారి బ్యాంక్‌ ఖాతాలో నేరుగా వేయాలని కూడా ఆయన నిర్ణయించారు. ఇది మాత్రమే కాకుండా ప్రతి చిన్నారికీ మూడు జతల యూని ఫారం, గ్లౌజులు, సాక్సులు, స్కూల్‌ బ్యాగ్, పుస్తకాలను కూడా ప్రభుత్వం అందించనుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగును బోధనా మాధ్యమంగా కొనసాగించడంపై హైకోర్టు నిశ్చితమైన అభిప్రాయం కలిగి ఉన్నప్పటికీ, యూఎస్‌ఏఐడీ, ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన పలు సర్వే రిపోర్టుల ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో నాలుగో తరగతి చదువుతున్న పిల్లల్లో చాలా మంది తమ మాతృభాషలో కూడా కనీసం చదవలేకపోతున్నారన్న విషయం బయటపడింది. దేశంలో పాఠశాలలకు వెళుతున్న పిల్లల్లో సగంమంది ఈ కోవకు చెందినవారు కావడంతో మాతృభాషలో చదవలేకపోతున్న పిల్లల సంఖ్య మరీ తక్కువగా మాత్రం లేదు.

ఇటీవల యూఎస్‌ఏఐడీ విడుదల చేసిన 2018 సర్వే తెలిపిన డేటా ప్రకారం మాతృభాషలో ముఖతః చదివే సామర్థ్యం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో  క్లాస్‌ 2లోని 76 శాతం మంది పిల్లలకు ఏమాత్రం లేదని తెలుస్తోంది. ఇక రాజస్తాన్, కర్ణాటకలలో కూడా వీరి శాతం 69, 53గా ఉన్నట్లు సర్వే తెలి పింది. నోటితో చదివే సామర్థ్యంలో జీరో స్కోర్‌ సాధించడం ఆంటే ఒక పదంలోని అక్షరాలను స్వరాలుగా, పదాలుగా మార్చి చదవడంలో వీరికి ఏమాత్రం నైపుణ్యం లేదని అర్థం. చివరకు పదాలకు అర్థవివరణ కానీ, పదాలను కలపడం కానీ, ఖాళీలు పూరించడం కానీ వీరికి ఏమాత్రం తెలీదని సర్వే తేల్చేసింది.

ఈ సర్వే తెలిపిన వాస్తవాలను ప్రభుత్వం సొంతంగా నిర్వహించిన నేషనల్‌ అచీవ్‌మెంట్స్‌ సర్వే (ఎన్‌ఏఎస్‌), ప్రథమ్స్‌ యాన్యువల్‌ స్టేటస్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్, ఇటీవలి ప్రపంచ బ్యాంకు రిపోర్టు కూడా బలపర్చడమే కాకుండా దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల విద్యాబోధనకు సంబంధించి తీవ్రమైన అవగాహనా సంక్షోభం నెలకొని ఉన్నట్లు ఎత్తిచూపాయి. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో 50 శాతం మందికి ప్రాథమిక అక్షరాస్యతా కౌశలం, లెక్కల నైపుణ్యం కూడా లోపించాయని ఈ సర్వేలు చాటాయి. 

ప్రభుత్వ పాఠశాలల్లో పదేళ్ల వయసు పిల్లల్లో 55 శాతం మంది సాధారణమైన పాఠాన్ని చదవటం, అర్థం చేసుకోవడం ప్రాథమిక నైపుణ్యం కూడా ఉండటం లేదని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో 97 శాతం విద్యార్థుల చేరిక, వారి అద్భుతమైన హాజరు వంటి అంశాలకు సంబంధించి విద్యా శాఖ చెబుతున్న గణాంకాలు అర్థరహితమని తెలుస్తోంది. బోధనా మాధ్యమంగా మాతృభాషే ఉంటున్నప్పటికీ ఈ పిల్లల్లో మెజారిటీ విద్యార్థులు భాషను అవగాహన చేసుకోలేకపోతున్నారని ఈ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

క్యాట్, నీట్‌ వంటి పలు ఎంట్రన్స్, పోటీ పరీక్షల్లో పాల్గొనే సామర్థ్యాన్ని విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం అందిస్తున్న కారణంగానే వైఎస్‌ జగన్‌ ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ అంశంపై రాజ కీయ ప్రత్యర్థుల బురదజల్లుడు ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు కూడా.

చాలావరకు పేదలు మరింత పేదలు కాకుండా రక్షించే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ రైతుభరోసా, విద్యాదీవెన, వసతిదీవెన వంటి అనేక కీలకమైన పథకాలను ప్రారంభించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అర్థంతరంగా జీవితాలు ముగించుకోవడం, వారి భవిష్యత్తు అగమ్యగోచరం కావడం అనే పరిస్థితి ఇకపై ఉండదు.


సీహెచ్‌ రాజేశ్వరరావు
(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top