వైద్యశాలలా, వధ్యశాలలా? | Private Hospitals Are Cheating Common Peoples With Bills | Sakshi
Sakshi News home page

Apr 20 2018 12:58 AM | Updated on Apr 20 2018 12:58 AM

Private Hospitals Are Cheating Common Peoples With Bills - Sakshi

ఆస్పత్రి దుకాణాల బిల్లులో కల్లబొల్లి అంకెలను శిక్షించే సరైన చట్టాలు ఇంకా రాలేదు. రోగులు 1,737 శాతం ఎక్కువ ధర ఎందుకు చెల్లించాలి? ఆస్పత్రి వారు ఆ డబ్బు తిరిగి ఇస్తే సమస్య తీరుతుందా? ఎందరు రోగులు విపరీత బిల్లుల దెబ్బ తిన్నారో పరిశోధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన లేదా?

ఏడేళ్ల ఆద్య డెంగ్యూ వ్యాధి సోకి గుర్‌గావ్‌లో అత్యాధునిక వైద్యశాల పాలయింది. చికిత్స నరకప్రాయం. మెదడు ఆగిపోయింది. చనిపోయిందో లేదో చెప్పరు. బతుకు మీద ఆశలు కనబడవు. ఆస్పత్రినుంచి తమను వెళ్లిపోనీయాలని కోరారు. ‘‘పోతే పోండి కాని ‘డాక్టర్లు వద్దన్నా మేమే వినకుండా వెళ్లాం’ అని రాసి సంతకం చేయండి’’ అన్నారు యజమానులు. తీసుకుపోవడానికి అంబులెన్స్‌ ఇవ్వమంటే ఇవ్వమన్నారు. వెంటిలేటర్‌ తీయడం కుదరదన్నారు. ప్రయివేటు అంబులెన్స్‌ తెచ్చుకుంటే అందులో చేర్చిన తరువాత వెంటిలేటర్‌ తొలగిస్తామన్నారు. ఆవిధంగా తొలగించగానే ఆ అమ్మాయి చని పోయింది. కాని ఆ మరణ ధృవీకరణ ఇవ్వం పొమ్మన్నారు. కేవలం మరణ పత్రంకోసం మరో వైద్యశాలకు వెళ్లక తప్పలేదు. అదొక నరకం. తీరా వెళ్లిపోతుంటే ఆగండాగండి... ఆ పాప వేసుకున్న గౌను మాది. దాని ధర చెల్లించండి అన్నారు. శరీరం ఉబ్బిపోవడం వల్ల సొంత గౌను పట్టక హాస్పటల్‌ వారి గౌను తీసుకొనక తప్పలేదు. అది విప్పడం కుదరదు కనుక అడిగినంత డబ్బు ఇవ్వక తప్పలేదు. 

నిశ్శబ్దంగా పాప మరణిస్తూ ఉంటే వారి కుటుంబం రోదిస్తూ ఉంటే, యాజమాన్యం బిల్లులు రచించింది. అవి గుండె గుభిల్లు బిల్లులు.  వైద్యశాల వారు వాడినట్టు చెప్పుకునే వస్తువుల వివరాలు ఇవి. మొత్తం 661 సిరంజిలు 1,546 జతల గ్లౌజులు వాడారట. అంటే ఆస్పత్రిలో ఉన్న ప్రతిగంటలో రెండు మూడు ఇంజక్షన్లు ఇచ్చారట. అయిదు జతల గ్లౌజులు మార్చారట. మందులపై 108 శాతం, చికిత్సలో వినియోగించిన ఒక్కో వస్తువుకు 1,737 శాతం ఎక్కువ ధరలు వేశారని పరిశోధనలో తేలింది.  చట్టప్రకారం గరిష్టధరకన్న బిల్లు మించరాదు. ఇది కాక మరో 3 లక్షలు కూడా ఇవ్వాలన్నారు. ఎందుకో చెప్పరు. ఆద్యవలె మరో ఏడేళ్ల బాలుడు సూర్యప్రతాప్‌ను కూడా చనిపోయిన తరువాత, తల్లిదండ్రులచేతికి ఇటువంటి భారీ బిల్లు ఇచ్చారు. రు. 15.88 లక్షల రూపాయలు చెల్లించక తప్పలేదు. చికిత్సకు, వస్తువులు వాడారనడానికి రుజువులు రికార్డులు లేవు. అసలు ధర ఎంత, వేసిందెంత ఎందుకు అనే వివరాలు రాయలేదు, చెప్పలేదు. వీరి రక్తనిధి (బ్లడ్‌ బ్యాంక్‌) జలగ వలె నెత్తురిచ్చినట్టే ఇచ్చి బిల్లురూపంలో తాగేస్తుంది. అర్ధరాత్రి ఇనుపకడ్డీలతో బాదే బందిపోట్లు గునపపు పోట్లు ఇస్తే వీరి బిల్లులు గుండె పోట్లు ఇస్తాయి.

డిసెంబర్‌ 2017న ఫోర్టిస్‌ మెమోరియల్‌ రీసర్చ్‌ సంస్థ వారి రక్తనిధి లైసెన్సును వారం పాటు సస్సెండు చేశారు. మేదాంత ఆస్పత్రి వారి ఫార్మసీ లైసెన్స్‌ను ఏప్రిల్‌ 5, 2018న ఏడు రోజులు సస్సెండు చేశారు. ఈ వార్త వచ్చిన రెండు రోజుల్లోనే ఆర్టీఐ వైద్య రంగంపై సీఐసీ ఇటీవల ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ అధికారులు చట్టాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం కింద లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేయడం తప్ప మరే చర్య కనిపించదు.  దున్నపోతు మీద దోమ వాలడం ఓ శిక్షా?  చికిత్స పేరుతో కొనసాగే హింసను ఈ చట్టం అరికట్టగలదా? హాస్పిటళ్లను వైద్యశాఖ నియంత్రించగలదా? ఆస్పత్రి దుకాణాల బిల్లులో కల్లబొల్లి అంకెలను శిక్షించే సరైన చట్టాలు ఇంకా రాలేదు. రోగులు 1,737 శాతం ఎక్కువ ధర ఎందుకు చెల్లించాలి? ఆస్పత్రి వారు ఆ డబ్బు తిరిగి ఇస్తే సమస్య తీరుతుందా? ఎందరు రోగులు విపరీత బిల్లుల దెబ్బ తిన్నారో పరిశోధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన లేదా? అందరికీ డబ్బు వాపస్‌ ఇప్పించలేరా?

వీరిపై సర్కారు చర్యలు తీసుకోకపోతే బాధితులకు కోర్టుకు పోవడం ఒక్కటే మార్గం. కింది కోర్టుతో మొదలై సుప్రీంకోర్టుదాకా అనేకసార్లు వెళ్లగల సంపన్న దవాఖాన వ్యాపారసంస్థలతో సామాన్యుడు సరితూగడం సాధ్యం కాదు. ఎవరైనా విమర్శిస్తే కోట్లరూపాయల పరువు నష్టం దావాలు వేస్తారు. క్రిమినల్‌ కేసులు కూడా వేస్తాయి. ఈ తెల్ల కోట్లు నల్లకోట్ల రక్షణతో కోర్టు కేసులు నడిపితే రక్షించుకునే స్తోమత రోగులకు, విమర్శకులకు ఉంటుందా?

‘‘వారితో పోరాడడం మాకు సాధ్యం కాదు. మేం చెల్లించిన డబ్బు 15.88 లక్షల రూపాయలు మాకు తిరిగి ఇస్తామంటే రాజీ పడ్డాం. మాకు మరో కూతురు ఉంది. మా కుటుంబం బతకాలి. పెద్ద అమ్మాయి చికిత్సకు చేసిన అప్పులు ఇంకా తీరలేదు, చిన్న అమ్మాయిని చదివించడానికి బోలెడంత డబ్బుకావాలి. కోర్టు ఖర్చులు భరిస్తూ పది పదిహేనేళ్లు ఎదురు చూడడం కష్టం. కనుక వారిచ్చిన డబ్బు తీసుకున్నాం’’ అని లాభార్జనా దురాశకు బలైన పిల్లల తల్లిదండ్రులు విలేకరులకు వివరించారు.  వ్యాపార పక్షపాత ప్రభుత్వ అవినీతి మీద, సరైన చట్టం చేయలేని శాసనవ్యవస్థ బలహీనతమీద, విపరీత విలంబ న్యాయప్రహసనం మీద ఈమాటలు విస్ఫులింగాలు. రాజ్యాంగం మూడు వ్యవస్థలకున్న ఏలికల బలాబలాలపైన సునిశిత విమర్శనాస్త్రాలు.  

చట్టవ్యతిరేక  ఔషధ బిల్లులు వేసి, అధిక ధరకు రక్తం అమ్మిన నేరాలకు శిక్షలు జరిమానాలు విధించే చట్టాలు ఎందుకు చేయరు? నరుల ఆరోగ్యాన్ని సంపదను హరించే వీటినుంచి సామాన్యులను రక్షించేదెవరు? చట్టాలు బలవంతులపై బలంగా, బలహీనులపై ఉదారంగా ఉండాలన్నది న్యాయసూత్రం. కానీ బలవంతుల ముందు అసమర్థంగా, బలహీనులపైన క్రూరంగా చట్టం ఉంటుందా? క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌ మెంట్‌ చట్టానికి క్షయరోగం ఉందా? ఈ ఆస్పత్రుల చట్టానికి రాచపుండును కోసే శస్త్ర చికిత్స అవసరమేమో పరిశీలించాలి. ప్రభుత్వం ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయలేకపోతే కారణాలేమిటో తెలపాలి. ఆద్య, సూర్యప్రతాప్‌ వంటి బాధితుల్ని ఎవరు ఆదుకుంటారు? 

ఈ చట్టంలో రోగులకు చికిత్స పత్రాలు వివరంగా ఎప్పటికప్పుడు ఇవ్వాలనే స్పష్టమైన నిబంధన గానీ, ఇవ్వకపోతే హాస్పటళ్లపైన ఎవరు ఏ చర్యలు ఎప్పుడు తీసుకుంటారో తెలిపే నియమాలు కానీ లేవు. కనీస ప్రమాణాలు పాటించాలంటారు. అన్ని అంశాలు అందులోనే ఉన్నాయని, ప్రత్యేకంగా మరే నియమం అవసరం లేదనీ అంటారు. ఒక అస్పష్ట నియమం కింద బలహీనమైన వాక్యాల రూపంలో ఈ నీతి వాక్యాలు ఉంటే అమలు చేయడం సాధ్యమా? ఎప్పటికప్పుడు రోగులకు చికిత్స వివరాలు ధృవీకరించిన పత్రాల రూపంలో ఇవ్వాలని  లేదా జరిమానాలు శిక్షలు ఉంటాయని కఠినమైన రోగి రక్షణ చట్టాలు ఎందుకు చేయడం లేదు? పాటించని సలహాలతో కూడిన చట్టాలు పనిచేస్తాయా? (ఏప్రిల్‌ 7, 2018న కేంద్ర సమాచార కమిషన్‌ ఏర్పాటు చేసిన సెమినార్‌లో రచయిత సమర్పించిన పత్రంలో ఒక భాగం).

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement