రేటింగ్‌ సంస్థల లోపాలపై నిఘా!

MP Varun Gandhi write article on Credit Rating Agencies - Sakshi

విశ్లేషణ
దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చేసే శక్తి క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థలకు ఉంది కాబట్టి సెబీ వంటి ఆర్థిక రెగ్యులేటరీ వ్యవస్థలు పరపతి సంస్థల అంచనాలపై పూర్తి నిఘా ఉంచి పరిశ్రమ ప్రమాణాలను అవి పాటించేలా చేయాలి. అసాధారణ రేటింగ్‌లు, ఉన్నట్టుండి రేటింగ్‌లను తగ్గించడంపై అప్రమత్తంగా ఉండాలి.

ఒక వ్యక్తిని, ఒక సంస్థనూ, చివరకు ఒక దేశాన్ని కూడా కొలవడం అనేది యుగాలుగా జరగుతున్న ప్రక్రియ. ప్రాచీన చరిత్ర కారుడు హెరొడోటస్‌ సిరీన్‌ పండితుడు కల్లిమచుస్‌తో కలిసి ప్రపంచపు ఏడు వింతల జాబితాను రూపొందించాడు. వాటి విలువను అత్యద్భుతమైన శైలితో వర్ణించాడు. అయితే ఆధునిక క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థలు ఇటీవల కాలంలో మాత్రమే వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో 1837లో ఆర్థిక సంక్షోభం వెలుగులో ఇవి మొట్టమొదటి సారిగా ఉనికిలోకి వచ్చాయి. న్యూయార్క్‌లో 1841లో లెవిస్‌ టప్పన్‌ తొలి క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థను నెలకొల్పాడు. వ్యాపారి రుణం చెల్లించే సామర్థ్యాన్ని కొలిచే అవసరంలో భాగంగా ఇవి పుట్టుకొచ్చాయి. అలాంటి డేటాను అప్పట్లో లెడ్జర్లలో పదిలపర్చేవారు. 

అచిరకాలంలోనే ఈక్విటీ వాటాలకు కూడా వీటిని వర్తింపజేశారు. తర్వాత స్వతంత్ర మార్కెట్‌ సమాచారం కోసం డిమాండ్‌ ఏర్పడింది. పరపతి విలువను నిజాయితీగా విశ్లేషించే కొలమానాలను ప్రతిపాదిస్తూ మూడీస్‌ రేటింగ్స్‌ సంస్థ ప్రచురణలు పారిశ్రామిక సంస్థలు, వాటి ప్రయోజనాలపై ఉత్తరాల రూపంలో రేటింగ్‌ ఇచ్చేవి. 1920 నాటికి ప్రపంచంలో మూడు అతిపెద్ద రేటింగ్‌ సంస్థలు (మూడీస్, ఫిచ్, స్టాండర్డ్‌ – పూర్‌) నెలకొన్నాయి. 1960ల నాటికి ఇలాంటి రేటింగ్‌లు వాణిజ్య పత్రాలు, బ్యాంక్‌ డిపాజిట్లు, గ్లోబల్‌ బ్యాండ్‌ మార్కెట్, సావరిన్‌ బాండ్లకు విస్తరించాయి. 

అయితే ప్రపంచ వాణిజ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు అనిర్దిష్టమైన, అసందర్భ రేటింగులతో విశ్వసనీయత విషయంలో విఫలమవుతూ వచ్చాయి. దీంతో అమెరికా న్యాయ విభాగం 1996లో మూడీస్‌ వంటి సంస్థల రేటింగ్‌ పద్ధతులపై విచారణకు పూనుకుంది. ప్రత్యేకించి ఎన్రాన్‌ పతనం, అమెరికాలో ఇటీవలి సబ్‌ ప్రైమ్‌ దివాళా సంక్షోభం తర్వాత  అన్ని క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థలూ న్యాయవివాదాల్లో చిక్కుకున్నాయి. 

మూడీస్‌ అయితే ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ప్రామాణిక రేటింగ్‌ విధివిధానాలను పాటించనుందుకు గాను అనేక జరిమానాల పాలబడింది. ఒక్క అమెరికాలోనే మూడీస్‌ సబ్‌ ప్రైమ్‌ సంక్షోభంలో దాని పాత్రకు గానూ 864 మిలియన్ల డాలర్ల మేరకు జరిమానా చెల్లించవలసి వచ్చింది. స్టాండర్డ్‌ – పూర్‌ కూడా అమెరికన్‌ ప్రభుత్వానికి 1.4 బిలియన్‌ డాలర్ల జరిమానాను చెల్లించాల్సి వచ్చింది.
భారత్‌లో కూడా రేటింగ్‌ ఏజెన్సీలకు ద్వంద్వ రికార్డు ఉంది. ఆమ్‌టెక్‌ ఆటో, రికోహ్‌ ఇండియా వంటి కేసుల కారణంగా రేటింగ్‌ సంస్థలపై సెబీ దర్యాప్తు ప్రారంభించి నిబంధనలను కఠినతరం చేసింది. పరిశ్రమ ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా రేటింగ్‌ సంస్థలకు ముకుతాడు వేసేందుకు సెబీ రంగం సిద్ధం చేసింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే సరైన అంచనాలను ఇవ్వని రేటింగ్‌ సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. 

1990లలో తూర్పు ఆసియా సంక్షోభం దీనికి తిరుగులేని ఉదాహరణ. అమెరికా, యూరోపియన్‌ సావరిన్‌ రుణాల సంక్షోభం, గ్రీస్, పోర్చుగల్, ఐర్లండ్‌ ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలిపోవడం, యూరో జోన్‌ కనీవినీ ఎరుగని నిరుద్యోగ సంక్షోభంలో చిక్కుకుపోవడం వంటివి ఇటీవలి ఉదాహరణలు. రేటింగ్‌ సంస్థల వైఫల్యంతో విసిగిపోయిన రష్యా, చైనా దేశాలు తమ సొంత రేటింగ్‌ ఏజెన్సీలను ఏర్పర్చుకున్నాయి కూడా. 

వ్యవస్థాగత లోపాలు చాలా ఉన్నప్పటికీ, క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థల నుంచి అధిక రేటింగ్‌ స్థాయిలను పొందడానికి దేశాలు చాలా ప్రాముఖ్యం ఇస్తున్నాయి. దీన్ని సాకుగా తీసుకుని క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థలు రేటింగేతర కార్యకలాపాల ద్వారా ఆదాయల సాధనకు పూనుకున్నాయి. ఇలా లాభార్జన కోసం రేటింగ్‌ సంస్థల పాట్లు అనేవి ప్రయోజనాల మధ్య వైరుధ్యాన్ని తీసుకువచ్చాయి. 

ఏమైనప్పటికీ మన పురోగమన గమ్యంలో రేటింగ్‌ సంస్థలను సమర్థంగా ఉపయోగించుకోవలసిన బాధ్యత ఆయా దేశాలపై ఉంది. ఈ క్రమంలో అసాధారణ రేటింగులు, ఉన్నట్లుండి రేటింగులను తగ్గించడం వంటి పరిణామాలపై సెబీ వంటి సంస్థలు నిఘా పెంచాల్సి ఉంది. దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చేసే శక్తి క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థలకు ఉంది కాబట్టి సెబీ వంటి ఆర్థిక రెగ్యులేటరీ వ్యవస్థలు పరపతి సంస్థల అంచనాలపై పూర్తి నిఘా ఉంచి పరిశ్రమ ప్రమాణాలను అవి పాటించేలా చేయాలి.

అలాగే ప్రభుత్వ స్థాయిలో కూడా త్రైమాసికం తర్వాత త్రైమాసికంలో మన పరపతి రేటింగును పెంచుకోవడానికి ప్రయత్నించడం బదులుగా, మన ఆర్థిక విధాన నిర్ణయాలు సంపూర్ణ ఉపాధి, సృజన, ఆవిష్కరణ వంటి ఆర్థిక వృద్ధి విధానాలకు ముందుకు తీసుకుపోయేలా ఉండాలి.

- వరుణ్‌ గాంధీ
వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు
fvg001@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top