జీవించే హక్కు వీరికి లేదా?

MLA Solipeta Ramalinga Reddy Article On Victims Of Treason Charges - Sakshi

సందర్భం

సమాజానికి రాజకీయం అవసరం. నలుగురు కూడి  ఓ సమస్యకు పరిష్కారం వెతికే అద్భుత క్రతువే రాజకీయం. రాజకీయంలో భిన్న ఆలోచనలుంటాయి. అంతులేని విజ్ఞాన శోధన ఉంటుంది. వాటిలో తార్కి కత ఉంటుంది. ఏకాభిప్రాయాలు, విస్తృతాభిప్రాయాలు, విభేదాలు  కూడా ఉంటాయి. ఈ సంఘర్షణలోంచే భిన్న రాజకీయ దృక్పథాలు ఉత్పన్నమవుతాయి. విప్లవ భావజాలం పుట్టుకొస్తుంది,  అది పరిసరాలను, ప్రాంతాలను, అవసరాలను బట్టి సాయుధ పోరాటంగానూ మారవచ్చు లేదా శాంతి మార్గంలోనూ నడవవచ్చు. ఎలా రూపాంతరం చెందాలనేది అక్కడి ప్రజల విశ్వాసాలు, అవసరాలు, ఆకాంక్షలను బట్టి ఉంటుంది.

ప్రశ్నించే స్థాయికి ఎదిగితే రాజద్రోహమే
పాలకులకు ఎప్పుడూ ప్రజా విశ్వాసాలు మూఢంగా ఉండాలి. రాజభక్తిని ప్రదర్శించే విధంగానే ఉండాలి. అంతే కానీ అవి బలమైన భావజాలంగా మారొద్దు. రాజ్యహింసను, దోపిడీని, నిరంకుశత్వాన్ని ప్రశ్నించే స్థాయికి ఎదగొద్దు. అట్లా ఎదిగితే వాళ్లు రాజద్రోహులు అవుతారు. వాళ్ల మీద పోలీసు నిర్బంధం పెరుగుతుంది. ఇనుప గజ్జల బూట్ల కింద  పౌరహక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ప్రజా విశ్వాసాల మీద నిర్బంధ దాడి మొదలవుతుంది. ఇక్కడే ధర్మదేవత అడ్డం పడి ప్రజా హక్కులను రక్షించాలి.  పౌర స్వేచ్ఛను కాపాడాలి. కానీ ఎందుకో న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక శాఖ తీరుగానే ఆలోచన చేస్తోంది. పోలీసులు చేసే హక్కుల ఉల్లంఘనకు అంగీకార ముద్ర వేసే ధోరణి క్రమంగా బలపడుతోంది.

నిర్బంధించడం రాజ్యానికి కొత్తేమీ కాదు
ప్రధాన మంత్రి మోదీని హత్య చేయటానికి మావోయిస్టులు కుట్ర పన్నారనే అభియోగం మోపి పుణే పోలీసులు హక్కుల ఉద్యమకారులు సురేంద్ర గాడ్లింగ్, సుధీర్‌ ధావ్లే, రోనా విల్సన్, మహేశ్‌ రౌత్, సుధా భరద్వాజ్, వర్నన్‌ గోంజాల్వెస్, అరుణ్‌ ఫరేరా, వరవరరావుల మీద కుట్ర కేసులు పెట్టి జైల్లో నిర్బంధించారు. అంతకుముందు ప్రొఫెసర్‌ సాయిబాబా మీద కూడా దేశ ద్రోహం కిందనే జైల్లో పెట్టారు.

ప్రజా విశ్వాసాల మీద పోలీసులు దాడి చేస్తూ.. కృత్రిమ లేఖలు, ఊహాత్మక అభియోగాలతో ప్రజా సంఘాల నాయకులను  ఏళ్లకు ఏళ్లుగా జైల్లో బంధించటం అనేది రాజ్యానికి కొత్తేమీ కాదు.  ప్రపంచాన్ని కోవిడ్‌–19 మహమ్మారి కబళి స్తున్న సమయం ఇది. అన్ని వ్యవస్థలను లాక్‌డౌన్‌ చేసి స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయాం. వయసు మళ్ళిన వృద్ధుల మీద ఆ కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఇటువంటి వాళ్లకు సామాజిక  దూరమే పరిష్కారమని వైద్య పరిశోధనలు, పరిశీలనలు చెబుతున్నాయి.

కరోనా కేసుల్లో మహారాష్ట్ర రికార్డు
దేశంలోకల్లా మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. మే 9 నాటికి ఈ రాష్ట్రంలో అత్యధికంగా 19,063 కేసులు నమోదు కాగా 1,089 పాజిటివ్‌ కేసులు కొత్తగా నిర్ధారణ అయ్యాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా మృతుల సంఖ్య ఈ శుక్రవారానికి 731కి చేరుకుంది. పాజిటివ్‌ కేసులు, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఒక్క రాష్ట్రంలోనే 714 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. సమూహాలుగా ఉంటే వైరస్‌ వేగంగా విస్తరించే అవకాశాలు ఎక్కువ.  

ఈ నేపథ్యంలోనే పుణే జైలులో స్థాయికి మించి ఖైదీలను బంధించి ఉంచారని, ఖైదీలకు సులువుగా కరోనా అంటుకునే ప్రమాదం ఉందని, ఈ వ్యాధి బారి నుంచి తప్పించుకోవడానికి తమకు తాత్కాలికంగా బెయిలు మంజూరు చేయాలని వరవరరావు, సోమాసేన్‌ ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టుకు దరఖాస్తు పెట్టుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ వారి ఇద్దరి బెయిల్‌ అభ్యర్థన పట్ల అభ్యం తరం  చేసింది. కోర్టు బెయిలు నిరాకరించింది. మరో వైపు నాగపూర్‌ సెంట్రల్‌ జైలులో ఉన్న ప్రొఫెసర్‌ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఆయనకు  పిత్తాశయం, క్లోమ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. 90 శాతం అంగవైకల్యం, దాదాపుగా కుప్పకూలిన వ్యాధినిరోధక సామర్థ్యం. ఛాతీ నొప్పి, గుండెదడ తదితర ఆరోగ్య సమస్యలతో ఉన్న సాయిబాబా జీవించే హక్కులో భాగంగా  న్యాయస్థానాల్లో బెయిల్‌ కోసం పిటిషన్‌ పెట్టుకుంటే అంగీకరించలేదు.

25 కేసులు కొట్టేసినా వీవీని వదలని రాజ్యం 
వరవరరావు మీద కుట్ర కేసులు కొత్తేమీ కాదు.ఆయన మీద 25 రకాల కేసులు పెట్టారు. ఇందులో ఒకటి అంటే ఒక్కటి కూడా నిర్ధారణ కాలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో కుట్ర చేశారని 1974లో 46 మందిపై కుట్ర, రాజద్రోహ అభియోగం మోపారు. నాటి నక్సలైట్‌ నేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి లతో పాటు విప్లవ రచయితల సంఘం సభ్యులైన వరవరరావు, చెరబండరాజు, కె.వి.రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, ఎం.టి.ఖాన్‌లను ఈ కుట్ర కేసులో నిందితులుగా పేర్కొన్నారు. 1989 ఫిబ్రవరి 27న సెషన్స్‌ కోర్టు  అందరినీ నిర్దోషులుగా తేల్చింది. 

1986లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారంటూ రాంనగర్‌ కుట్ర కేసు పెట్టారు. కొండపల్లి సీతారామయ్య, వరవరరావు తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. కేసు విచారణ జరిగిన ఈ సుదీర్ఘ కాలంలో వరవరరావు, సూరిశెట్టి సుధాకర్‌లు మినహా మిగిలిన నిందితులంతా మరణించారు. 2003 సెప్టెంబర్‌లో వరవరరావు, సూరి శెట్టి సుధాకర్‌లు ఇద్దరినీ నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు కేసు కొట్టివేసింది. 2005లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఔరంగాబాద్‌లో కుట్ర పన్ని, అది అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విరసం సభ్యులను 2005 మే 30న నిజామాబాదులో అరెస్ట్‌ చేశారు. 2010 ఆగస్ట్‌ 2న నిజామాబాద్‌ అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి ఆ కేసును కొట్టేశారు. 

రాజ్యహింస ప్రజా విశ్వాసాలపై దాడి
ఇలా ఏ కేసు స్టడీ చేసినా రాజ్యహింసే ఉంది. ప్రజా విశ్వాసాల మీద పోలీసుల దాడి కనిపిస్తుంది. బెయిల్‌ మంజూరు చేసే విషయంలో కోర్టు ఈ రికార్డును కూడా పరిగణనలోకి తీసుకొని విచారణ జరపాలి. సామూహిక ప్రదేశాల్లో నివసించడం వలన కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఒక్కసారి వ్యాధి అంటుకుంటే ఒకవైపు వృద్ధాప్యం మరోవైపు వ్యాధి నిరోధక శక్తిని పోగొట్టుకున్న వీళ్లు తట్టుకుని నిలబడటం కష్టం. అదే జరిగితే వాళ్ల జీవించే హక్కును రాజ్యాంగం  హరించినట్లు అవుతుంది. కార్యనిర్వాహక వ్యవస్థ తరహాలో కాకుండా న్యాయవ్యవస్థ విభిన్నంగా, తార్కిక ఆలోచన చేయాలి. ఉద్యమకారులకు సత్వర న్యాయాన్ని అందించాలి. మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసుకొని హక్కుల ఉద్యమకారులపై పెట్టిన రాజద్రోహం కేసులను ఉపసంహరించుకోవాలి. జీవించే హక్కును గౌరవించాలి.
వ్యాసకర్త: సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు, తెలంగాణ శాసనసభ  అంచనాలు, పద్దుల కమిటీ చైర్మన్‌ 

మొబైల్‌ : 94403 80141

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top