అది స్వర్ణయుగమేనా?!

Mallepally Laxmaiah Guest Column On Amit Shah - Sakshi

కొత్త కోణం

‘‘ఒక చరిత్రకారుడు నిక్కచ్చిగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఉండాలి. భావోద్వేగాలకూ, రాగద్వేషాలకూ అతీతంగా వ్యవహరించాలి. చరిత్రలో నిజాలకు మాత్రమే సముచిత స్థానం ఉంటుంది. సత్యం చరిత్రకు తల్లిలాంటిది. గతంలో జరిగిన సంఘటనకు చరిత్ర సాక్ష్యంగా నిలవడం మాత్రమే కాదు, భవిష్యత్తుకు దిక్సూచిగా మారుతుంది’’ అన్న బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ వ్యాఖ్యలు చరిత్ర అధ్యయనానికీ, చారిత్రక గమనాన్ని అర్థం చేసుకోవడానికీ మార్గదర్శకంగా నిలుస్తాయి. భారతదేశ చరిత్రను అత్యంత ప్రతిభతో అధ్యయనం చేసిన మహనీయులలో ఆయన ఒకరు.  అయితే ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చరిత్రపై చేసిన వ్యాఖ్యానాలు వేల ఏళ్ళ భారత చరిత్రను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి. సత్యాన్ని మరుగుపరిచి, అసత్యాలకు పట్టంగట్టేవిగా ఉన్నాయి.  బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో గతవారం గుప్తుల సామ్రాజ్యంలో ఒక రాజైన స్కందగుప్తునిపై వెలువరించిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ ‘‘భారతదేశ చరిత్రను బ్రిటిష్, మొఘల్‌ల ఆలోచనా దృక్పథంలో రాశారు.  అందుకే చరిత్రను తిరగరాయాలి. గుప్తుల కాలం ఒక స్వర్ణయుగం. అందులో స్కందగుప్తుడు హూణులను ఓడించిన వీరుడు’’ అంటూ అమిత్‌షా ప్రశంసల వర్షం కురిపించారు.  

దేశ చరిత్రను అధ్యయనం చేసిన వాళ్లనూ, అప్పటి లిఖితపూర్వకమైన గ్రంథాలను చూసిన వాళ్లనూ ఈ వ్యాఖ్యలు కొంత ఆలోచనలో పడేస్తాయి. చరిత్రను అధ్యయనం చేయడానికి గతంలో రెండే రెండు ఆధారాలు ఉండేవి. ఒకటి సాహిత్యం – అందులో మౌఖిక సాహిత్యం, లిఖిత సాహిత్యం ఉన్నాయి. రెండోది పురాతత్వ శాస్త్ర పరిశోధనలు. కానీ ఇటీవల శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన పురోగతి మూడో చారిత్రక అస్త్రంగా అందివచ్చింది. అందువల్ల సత్యాలను దాచేస్తే దాగే పరిస్థితి లేదు.  బౌద్ధాన్ని నిలువరించాలనుకున్న వైదిక మత ప్రబోధకులకు గుప్తుల కాలం బలమైన అండదండలను అందిం చింది. క్రీ.శ.మూడవ శతాబ్దం నుంచి ఆరవ శతాబ్దం వరకు కొనసాగిన గుప్తుల సామ్రాజ్యంలో వైదిక మతం తన భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పథకాలు రచించింది. భారత సామాజిక వ్యవస్థను కులాలుగా విడగొట్టి వర్ణవ్యవస్థను పటిష్టం చేసిన మనుధర్మం సంపూర్ణమైన రూపం తీసుకున్నది గుప్తుల కాలంలోనే. అప్పటి వరకు చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ కులాలను విడ గొట్టి ప్రతి కులానికీ ఒక స్పష్టమైన విధివిధానాలను రూపొందించింది ఆకాలంలోనే. దానికి వారు సంస్కృతాన్ని ఒక సాధనంగా వాడుకున్నారు.

అప్పటి వరకు బహుళ ప్రాచుర్యంలో ఉన్న పాళి, ప్రాకృతం, పైశాచిలాంటి భాషలను దాదాపు ధ్వంసం చేశారు. తర్వాతనే దేవాల యాలు, వాటిలో ఆరాధనలు పుట్టాయి. అందులో భాగం గానే బౌద్ధాన్ని ఒకవైపు దెబ్బతీస్తూనే, రెండోవైపు గౌతమ బుద్ధుడిని విష్ణువు అవతారంగా ప్రకటించారు. lతపస్సుగానీ, జ్ఞానసముపార్జనగానీ కేవలం బ్రాహ్మణులు చేయాలనే దానికి రామాయణంలో ప్రముఖ స్థానం కల్పించారు. శంబూక వథ అందులో భాగమే. అదే సమయంలో బౌద్ధాన్ని ఇంకా పాటిస్తున్న వాళ్ళను, వైదిక మతాన్ని కుల వ్యవస్థను నిరసిస్తున్న వాళ్ళను అంటరాని వాళ్ళుగా ముద్రవేసి, ఊరవతలికి నెట్టివేశారు. ఆనాడు సమాజంలో వేళ్ళూనుకున్న అదే భావన నేటికీ అంటరానితనపు కుచ్చితత్వాన్ని వెలివాడల రూపంలో కొనసాగిస్తోంది. బౌద్ధులను గ్రామాల్లోనికి రానివ్వద్దని, వారి ముఖం చూడకూడదని నిబంధనలు విధించారు. ఆ సమయంలో రాసిన మృచ్ఛకటికం సంస్కృత నాటకంలో ఇటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంటే గుప్తుల కాలం స్వర్ణయుగం కాదు. అది వర్ణయుగం. వర్ణ వ్యవస్థను కుల వ్యవస్థగా విడగొట్టి సమాజాన్ని మరిన్ని ముక్కలుగా విడగొట్టిన కాలమది.  

పశ్చిమబెంగాల్‌లోని ‘‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ జినోమిక్స్‌’’ ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టి ట్యూట్‌’’కు చెందిన ‘‘హ్యూమన్‌ జెనెటిక్స్‌ యూనిట్‌’’లు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో గుప్తుల కాలంలో కుల వ్యవస్థ బలపడిందని తేల్చాయి. అయితే అమిత్‌షా లాంటి వాళ్ళు ఇటువంటి విష యాలు తెలియక మాట్లాడుతున్నారో, లేదా మళ్లీ ఒకసారి అటువంటి యుగంలోకి తీసుకెళ్ళి కులవ్యవస్థ సరైనదే, దానిని కొనసాగించాలనే అభిప్రాయాన్ని ప్రజల మెదళ్ళలో నాటడానికి ప్రయత్నిస్తున్నారో అన్న ప్రశ్నలు తలెత్తక మానవు. దాదాపు రెండువేల సంవత్సరాలుగా కొనసాగుతున్న కుల వ్యవస్థకు మనువులాంటి వాళ్ళు రూపొందించిన కుల చట్టాలను, చట్రాలను పక్కకు తోసి 1950 సంవత్సరంలో భారత ప్రజలందరూ సమానులేననే ఒక చట్టాన్ని రాజ్యాంగం ద్వారా రూపొందించుకున్నాం. అమిత్‌ షా లాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయనడంలో సందేహం లేదు. ఇటువంటి మాటలు మాట్లాడేముందు చరిత్రను ఆధునిక దృక్పథంతో సత్యం పునాదిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సమాజ రథచక్రాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాలేగానీ, వెనక్కి తిప్పకూడదు. ఇది వాంఛ నీయం కాదు.

మల్లెపల్లి లక్ష్మయ్య  
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, 81063 22077

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top