కరోనా కాటేసిన పాఠాలు

Madabhushi Sridhar Writes Story Over Online Education In Covid Crisis - Sakshi

విశ్లేషణ

కోవిడ్‌–19 తీవ్రఘాతం చదువులమీద పడింది. వానాకాలపు చదువులనుంచి ఆన్‌లైన్‌ చదువుల్లోకి మళ్లాం. కంప్యూటర్‌ అనబడే చిన్నడబ్బా ముందు కూచుని, స్మార్ట్‌ విద్యార్థులైతే చిట్టి మొబైల్‌ ముందుం చుకుని చదువు చెబుతున్నామనీ, చదువుకుంటున్నామనీ అనుకుంటున్నారు. ఉపాధ్యాయుడు మాట్లాడుతూ ఉంటారు. విద్యార్థి వింటున్నాడో లేదో కెమెరాముందు ఉన్నాడో లేదో తెలియదు. ఉన్నంత మాత్రాన విన్నట్టూ, విన్నంత మాత్రాన అర్థం చేసుకున్నట్టూ కాదు. విద్యార్థి ముఖంలో కవళికలను చూడడం ఒక భాగ్యం. అర్థం కానట్టు ముఖం పెడితే టీచర్‌ మరో ప్రయత్నం చేస్తాడు. ఒక వ్యక్తి చెప్పిన అంశం మరొక వ్యక్తి మనసుకు తగిలి, అతనిని కదలించి, ఆ కదలిక సంగతిని మొదటి వ్యక్తికి తెలియజేసినప్పుడు భావ ప్రసారం పూర్తవుతుంది. ఈ ప్రసారం ప్రతిస్పందన ప్రయాణించి తొలి ప్రకటనకర్తకు చేరితే సంపూర్ణ చక్రం. 

ఎన్ని సాంకేతిక సమాచార ప్రసార వ్యవస్థలు వచ్చినా గురుశిష్య బోధనా విధానం ముందు వెలవెల బోవలసిందే. ఒక వ్యక్తి నిలువెత్తు నిలబడి, ఆలోచిస్తూ, చేతులు కదిలిస్తూ, చూపుడు వేలుచూపుతూ మార్గదర్శకత్వం చేస్తుంటే ఆయన జీవకళలోంచి కొన్ని కాంతులు మనకు చేరుతుంటే, చదువు రూపుదిద్దుకున్న గురువై కళ్లెదుట కదులుతూ ఉంటే ఎంత బాగుం టుంది. అంతర్జాల మాయాజాలంలో పడి కరోనా ఇంద్రజాలంలో నలిగి చదువు బక్కచిక్కుతున్నది. సిలబస్‌ను తగ్గించడం ద్వారా పిల్లల మూపున భారం తగ్గించవచ్చని కేంద్ర విద్యా పాలనా యంత్రాంగం ఒక నిర్ణయానికి వచ్చింది. సరే. 30 శాతం సిలబస్‌ భారాన్ని కత్తిరించారు. చాలా గొప్ప సంస్కరణ. సులువైన సంస్కరణ. పెద్దగా ఆలోచించాల్సిన పనే లేదు.  ఏ ముప్పై శాతం పోతుంది అనేది ప్రశ్న. ఎవరు కోస్తారనేది మరో కీలకసమస్య. మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు, సీబీఎస్‌ఈ పాలకులు ఖడ్గాలు ఝళిపిస్తూ 30 శాతం దగ్గర వేటు వేస్తారా?

ఈ సందేహం పాలనాపరమైన సమస్యకు సంబంధించినది. సీబీఎస్‌ఈ అధికారులు, పదకొండో తరగతి పాఠ్యాంశాలనుంచి కొన్ని కోసేశారు. కోవిడ్‌–19 చదువుమీద కూడా ఎంత క్రూరప్రభావం చూపిందో కోతపడిన అంశాలు చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా రాజకీయ శాస్త్రం నుంచి తొలగించిన అంశాలు కీలకమైనవి. శాస్త్రం చేస్తున్న ఆర్తనాదం ఎవరికైనా వినబడిందో లేదు. ఇందులో పూర్తిగా వేటుబడిన అంశాలివి. తొమ్మిదో తరగతి నుంచి ప్రజాస్వామిక హక్కులు, మనదేశంలో ఆహార భద్రత, పదోతరగతి నుంచి ప్రజాస్వామ్యం భిన్నత్వం, ప్రఖ్యాత ప్రజా ఉద్యమాలు, ప్రజాస్వామ్యానికి సవాళ్లు, లింగం, మతం కులం, పదకొండో తరగతినుంచి సమాఖ్య లక్షణాలు (ఫెడరలిజం), పౌరసత్వం, జాతీయతా వాదం, సెక్యులరిజం. పన్నెండో తరగతి నుంచి సామాజిక ఉద్యమాలు, నవసామాజిక ఉద్యమాలు, ప్రాంతీయ ఆశలు, దేశవిభజనపట్ల అవగాహన అనే అంశాలు అక్కరలేదట. మనకు స్థానిక ప్రభుత్వాలెందుకు అనే అంశాన్ని కూడా తొలగించారు.

మనదేశంలో ఉండవలసిన కేంద్ర, రాష్ట్ర సార్వభౌమ సమానత (ఫెడరలిజం), జాతీయత, పౌరసత్వం, ప్రజాస్వామ్య హక్కులు స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయో లేవో తెలియని మాయాజాలంలో పడిపోయిన అంశాలే. రాష్ట్రాల అధికారాలు వివరించే సమాఖ్య లక్షణాలు కూడా పాఠాలనుంచి తొలగించడమా? అన్నింటికీ మించి అన్ని మతాలకు సమానగౌరవం సమాన దూరం అనే సూత్రాన్ని పాటించనవసరం మన సిద్ధాంతమన్నట్టు, సెక్యులరిజం ఏదో పాపమైనట్టు అంటరాని దైనట్టు పాఠ్యాంశాలనుంచి పనిగట్టుకుని తొలగించడం ప్రశ్నించదగిన సంగతి. కారణాలేమిటి? వీటినే ఎందుకు తొలగించారు? తొలగించి ఏం సాధిద్దామనుకున్నారు అనే ప్రశ్నలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి, రమేశ్‌ పోక్రియాల్‌ గారే ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి.

ఈ అంశాలు కనుక విద్యార్థులకు బోధిస్తే అవి దేశంలో ఉన్నాయో లేవో తెలుసుకునే శక్తి నవతరానికి వస్తుందన్న భయమా? వాటిగురించే తెలియజెప్పకపోతే ఇక తమ విధానాలకు తిరుగే ఉండదనే నమ్మకమా? మన సంవిధానం మౌలిక లక్ష్యాలు ఇవి. రాజ్యాంగ పీఠికలో ప్రత్యేకంగా రాసుకున్న లక్ష్య లక్షణ వాక్యాలు ఇవి. ఇవి లేకుండా రాజ్యాంగం లేదు. 30 శాతంలో ముందు ఇవే పోతాయంటే అంతకన్నా రాజ్యాంగ విరోధ ఆలోచన ఏమిటి? సంవిధానం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సమాఖ్యత్వం.. మస్తకాల్లోంచి తీసేద్దామా? వెన్నెముకల గురించి మరిచిపోయాం. కనీసం పుస్తకాలు మస్తకాలైనా ఉన్నాయా? ఉంటాయా? 

వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్‌
బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top