ఆరెస్సెస్‌ యూనిఫాంలో ఆర్మీ మాజీ చీఫ్‌

Karan Thapar Writes On RSS - Sakshi

ఆదిత్య హృదయం
తటస్థత అత్యవసరమైన షరతుగా ఉండే, అత్యున్నత రాజ్యాంగ పదవులను గతంలో అలంకరించినవారు తమ పదవీ విరమణ అనంతర ప్రవర్తన సమాజానికి పంపుతున్న సందేశం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదా? తమ ఈ ప్రవర్తన.. వారు గతంలో నాయకత్వం వహిం చిన సంస్థ గురించి ఇబ్బందికర ప్రశ్నల్ని లేవనెత్తే అవకాశం ఉందని వీరు మరిచిపోతున్నారా? లేదా వారు దేన్నీ లెక్కపెట్టదల్చుకోవడం లేదా?

దాదాపు 42 ఏళ్లపాటు సైన్యంలో పనిచేసి దాని చీఫ్‌ స్థాయికి ఎదిగిన జనరల్‌ వి.కె. సింగ్‌ గురించే నేను ప్రత్యేకించి దీన్ని రాస్తున్నాను. ప్రస్తుతం భారత విదేశాంగ సహాయ మంత్రి జనరల్‌ సింగ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ యూనిఫారం ధరించి ఆ సంస్థ సభ్యుల మధ్యలో ఉన్నట్లు చూపుతున్న ఫొటోలు ఇటీవల విస్తృతంగా పంపిణీ అయ్యాయి. నాతోపాటు, మన సైన్యం లౌకికవాదాన్ని పరిరక్షించాలనుకుంటున్న చాలామందికి అవి దిగ్భ్రాంతి కలిగిం చాయి. లౌకికవాదం ఆర్‌ఎస్‌ఎస్‌ గౌరవించే సిద్ధాంతం కాదనుకోండి.

భారతదేశంలోని ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు వంటి విభిన్న మతాల ఉనికిని గుర్తించకుండా వారందరూ హిందువులే అని ఆరెస్సెస్‌ ప్రకటిస్తుం డగా, మరోవైపున ప్రతి వైయక్తిక మతాన్ని కూడా మన సైన్యం ప్రగాఢంగా గౌరవిస్తోంది. తమ తమ స్వభావాన్ని అనుసరించి భారత సైనిక రెజిమెంట్లు తమ సొంత పూజా మందిరాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలను కలిగివున్నాయి. ఆయా రెజిమెం ట్లలో మౌల్వీలు, పండిట్లు, గ్రంథిలు, పూజారులు కూడా ఉండటం విశేషం. నిజానికి ఒక సైనిక విభాగంలో నిర్దిష్ట మతానికి చెందిన 120 మంది సైనికులు ఉన్నట్లయితే, వారి మతానికి చెందిన గురువు తప్పకుండా ఆ రెజిమెంట్‌లో ఉంటారు.

ఆర్మీ కమాండింగ్‌ ఆఫీసర్లు అన్ని మతాల ఉత్సవాల్లో పాల్గొంటుంటారు. ఈద్‌ సందర్భంగా వారు టోపీని ధరిస్తుంటారు. దీపావళి నాడు టిక్కాను, గురుపౌర్ణమి నాడు తలపాగాను ధరిస్తారు. నిజానికి, రెజిమెంటల్‌ పండిట్‌ లీవులో ఉన్నట్లయితే జన్మాష్టమి కార్యక్రమాన్ని ఒక మౌల్వీ నిర్వహించే ఏకైక చోటు మన సైన్యమే అని చెప్పాలి. ఇవేవీ ఆర్‌ఎస్‌ఎస్‌ విషయంలో వాస్తవం కాదు. నిజానికి ఆ సంస్థ దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

అలాంటప్పుడు ఒక మాజీ సైనికాధిపతి ఇలాంటి సంస్థను కౌగలించుకోవడం అంటే దానర్థం ఏమిటి? సైనిక సర్వీసులో ఉన్న కాలంలో తాను ఆరెస్సెస్‌ రహస్య సభ్యుడిగా ఉండేవారా? మతపరమైన తటస్థతకు సంబంధించి సైన్యం సూత్రబద్ధతపై తన నిబద్ధత బూటకమైనదేనా? మరింత ఆందోళన కలిగించే విష యం ఏమిటంటే, సైన్యానికి తెలియకుండానే ఇతర ఆరెస్సెస్‌ మద్దతుదారులు కూడా సైనిక ముసుగులో దాగి ఉంటున్నారా?

తాను ఇటీవలివరకు పనిచేసిన సంస్థ పట్ల ఒక ఆర్మీ మాజీ అధిపతి ఇలాంటి ప్రశ్నలు రేకెత్తడానికి వీలు కల్పించాడంటే ఇది భ్రమలు తొలిగిపోతున్న దానికంటే ఎక్కువేనని చెప్పాల్సి ఉంటుంది. ఇది తీవ్ర విచారకరమైంది. ఆయన తాను ధరించిన యూనిఫారంకు తగిన అర్హుడు కాదని ఇది సూచిస్తుంది. పైగా ఆర్మీ చీఫ్‌గా తాను పొందిన గౌరవానికి కూడా తానేమాత్రం అర్హుడు కాదని దీనర్థం.

ఏమైనప్పటికీ జనరల్‌ సింగ్‌ మాత్రమే దీనికి మినహాయింపు కాదు. పదవీ విరమణ చేసిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి కేబినెట్‌ మంత్రులుగా మారిన చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్లు కూడా మనకున్నారు. అయినా సరే సీఈసీగా తన తటస్థతకు, తాను పనిచేసిన అత్యున్నత సంస్థ తటస్థతకు సంబంధించి లేవనెత్తుతున్న ప్రశ్నల గురించి మాజీ సీఈసీ ఎమ్‌ ఎస్‌ గిల్‌ ఏమాత్రం ఆందోళన కనబరుస్తున్నట్లు లేదు.

రాజ్యసభలో పక్షపాతంతో కూడిన రాజకీయ సభ్యత్వాన్ని స్వీకరించడమే కాకుండా, పార్టీ క్రమశిక్షణకు కూడా లోబడిన భారతీయ ప్రధాన న్యాయమూర్తులను కూడా మనం కలిగివున్నాం. అయినప్పటికీ సుప్రీంకోర్టు, న్యాయవ్యవస్థలపై ఇలాంటి పదవులు కలిగించే సందేహాల గురించి రంగనాథ మిశ్రా లెక్కచేయనట్లుగానే కనపడుతోంది. దారితప్పి వక్రమార్గంలో నడుస్తున్న మన సైనిక జనరల్‌ ఒక అప్రతిష్ఠాకరమైన సంప్రదాయంలో భాగమనిపిస్తోంది.

చివరకు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్స్‌.. ఎంపీలుగానూ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు లోక్‌సభ స్పీకర్లుగా లేక గవర్నర్లుగా మారుతుండటం కూడా దీంట్లో భాగమే. ఇలాంటి ప్రతి సందర్భంలోనూ వ్యక్తులు లాభపడుతుండవచ్చు కానీ సంస్థలు నష్టపోతున్నాయి. అంతకు మించి సామాజిక విలువలను, ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తున్న మన నైతికతకు మరింత నష్టం కలుగుతోంది.

స్వార్థ ప్రయోజనాల సాధన కోసం ఔచిత్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు భారత్‌ అనే భావననే అది దిగజార్చివేస్తుంది. మన ఆర్మీ చీఫ్‌లు, న్యాయమూర్తుల చేతుల్లోనే ఇది జరుగుతున్నప్పుడు క్షమాపణ చెప్పినంత మాత్రాన సరిపోదు. కానీ, ఇలాంటి బాపతు వ్యక్తులు తాము చేస్తున్న పనులకు గానూ కనీసం పశ్చాత్తాపమైనా చెందుతున్నారా అనేదే సందేహం.

కరణ్‌ థాపర్‌
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ : karanthapar@itvindia.net

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top