ఇదేనా ప్రజాస్వామ్యం?

K Ramachandra Murthy Article On TDP MPs Defections To BJP - Sakshi

త్రికాలమ్‌

చట్టాలు చేసిన పెద్దలు అవే చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ వర్ధిల్లుతున్న ‘ప్రజాస్వామ్య’ దేశం ప్రపంచంలో భారత్‌ ఒక్కటే. ఇతర ప్రజాస్వామ్య దేశా లలో అమలు చేయడానికే చట్టాలు చేస్తారు. మనలాగా ఉల్లంఘించడానికి కాదు. కొన్నేళ్ళుగా అత్యంత భ్రష్టుపట్టిన చట్టం ఫిరాయింపుల నిరోధక చట్టం. ఒకసారి ఎన్నికలు పూర్తయిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీని ప్రజలు విశ్వసి స్తున్నారని ప్రతిపక్షాల సభ్యులు చెప్పడం, తమ నియోజకవర్గం అభివృద్ధి కోసం అధికారపార్టీలో చేరుతున్నామంటూ బొంకడం నిస్సిగ్గుగా సాగుతున్న జాతరలో భాగమైపోయింది. 

గోవా నుంచి ఇద్దరు కాంగ్రెస్‌ సభ్యులను ఢిల్లీకి విమానంలో పిలిపించుకొని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా వారి మెడలో బీజేపీ కండువా వేసి స్వాగతం పలికితే, పార్టీ ఫిరాయించిన నలుగురు రాజ్యసభ సభ్యులతో ప్రధాని నరేంద్రమోదీ చిరునవ్వులు చిందిస్తూ కబుర్లు చెబుతుంటే, ప్రతిపక్ష సమావే శానికి హాజరైన కారణంగానే జేడీ (యూ) నేత శరద్‌యాదవ్‌పైన అనర్హత వేటు వేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అర్జీ ఇచ్చిన కొన్ని గంటలలోనే టీడీపీ సభ్యులను బీజేపీ  సభ్యులుగా పార్లమెంటు వెబ్‌సైట్‌లో పరిగణిస్తే  ఫిరాయిం పుల నిరోధక చట్టాన్ని ఎవరు రక్షించాలి? విభిన్నమైన పార్టీ (పార్టీ విత్‌ ఎ డిఫరెన్స్‌)అంటూ తరచు స్వోత్కర్షకు ఒడిగట్టే బీజేపీ అడ్డగోలు ఫిరాయింపులను అనుమతిస్తే ఏమని చెప్పాలి?  

పార్టీ ఫిరాయింపులపైన ఫిర్యాదు చేసే నైతిక హక్కు కానీ, ఫిరాయించేవారిని తప్పుపట్టే అధికారం కానీ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి వీసమెత్తు కూడా లేదు. అనైతిక, అవకాశవాద రాజకీయాలలో పండిపోయిన టీడీపీ అధినేతకు చట్టాల గురించీ, విలువల గురించీ మాట్లాడే స్థాయి లేదు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణాధారమైన సాధారణ ప్రజలకు తమ ప్రతినిధుల అక్రమాలనూ, అవినీతినీ ప్రశ్నించే హక్కు ఉన్నది. ప్రశ్నించవలసిన అవసరం, బాధ్యత కూడా ఉన్నాయి. తమ తీర్పును తుంగలో తొక్కి తాము ఓడించిన పార్టీలో తమ శాసనసభ్యుడు లేదా లోక్‌సభ సభ్యుడు చేరిపోవడం ఆ నియోజకవర్గం ప్రజలు సహించకూడదు. ఇది గోవాలో జరిగినా, తెలంగాణలో జరిగినా, ఆంధ్రప్రదేశ్‌లో జరిగినా ప్రజావంచనే. 

‘ఆయారాం, గయారాం’
‘ఆయారాం, గయారాం’ సంస్కృతి ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తు న్నదని గుర్తించిన రాజీవ్‌గాంధీ 1985లోనే ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చారు. చట్టసభలోని ఒక పార్టీ సభ్యులలో మూడింట ఒక వంతు మంది విడిపోతే అది చీలిక అవుతుంది కానీ ఫిరాయింపు కాదని ఈ చట్టం నిర్దేశించింది. ఈ లొసుగును ఉపయోగించుకొని అవకాశవాదులు పార్టీలు ఫిరాయించినా సభ్యత్వం కాపాడుకున్నారు. 1992లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభు త్వంపైన అవిశ్వాసతీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టినప్పుడు టీడీపీ లోక్‌సభ పక్షం చీలిపోయింది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు భూపతిరాజు విజయ కుమార్‌రాజు నాయకత్వంలో ఆరుగురు లోక్‌సభ సభ్యులు చీలిపోయి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏడుగురు టీడీపీలో మిగిలారు. ఈ లోపం పూడ్చే ప్రయత్నంలో 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం పిరాయింపుల నిరోధక చట్టం, 1985కు  సవరణ చేసింది. 

సవరించిన చట్టం ప్రకారం లెజిస్లేచర్‌ పార్టీలో లేదా పార్లమెంటరీ పార్టీలో మూడింట రెండు వంతుల మంది పార్టీ మారాలని నిర్ణయించుకుంటే అది పార్టీ చీలిక అవుతుంది. అనర్హత వేటు పడదు. సవరించిన చట్టంలో కూడా మిగిలిపోయిన కీలకమైన లొసుగు ఏమిటంటే శాసనసభ్యులు పార్టీ ఫిరాయిస్తే, వారిపైన అనర్హత వేటు వేయమని సదరు పార్టీ నాయకత్వం సభాపతికి ఫిర్యాదు చేస్తే సభాపతి వెనువెంటనే నిర్ణయం తీసుకోవాలన్న నిబంధన లేదు. ప్రధానికీ లేదా ముఖ్యమంత్రికి విధేయులైన సభాపతులు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఏళ్ళ తరబడి సభాపతి నిర్ణయం తీసుకోకుండా సాచి వేత ధోరణి ప్రదర్శించినా ప్రశ్నించే వెసులుబాటు న్యాయవ్యవస్థకు లేదు. సభా పతిని కాదని వేటు వేసే అధికారం ఎన్నికల సంఘానికి సైతం లేదు. చట్టంలోని ఈ లోపాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడూ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావూ (కేసీఆర్‌) సంపూర్ణంగా వినియో గించుకున్నారు. 

2014–19లో ఆంధ్రప్రదేశ్‌లో 23 మంది శాసనసభ్యులనూ, ముగ్గురు లోక్‌సభ సభ్యులనూ వైఎస్‌ఆర్‌సీపీ నుంచి టీడీపీకి ఫిరాయింపజేశారు. తెలంగాణలో టీడీపీని నిర్వీర్యం చేయడానికీ, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేయడానికి ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపాన్ని కేసీఆర్‌ ఉపయోగించుకున్నారు. ఈ రోజున దేశంలో ఫిరాయింపులకు వ్యతి రేకంగా మాట్లాడుతున్న, వ్యవహరిస్తున్న నాయకుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే. ఎవరు పార్టీ మారినా అనర్హత వేటు వేయవలసిందిగా సభాపతి తమ్మినేని సీతారాంను జగన్‌ అభ్యర్థించారు. ఫిరాయింపుల జాఢ్యాన్ని నిరోధించకపోతే ఎన్నికలు అర్థరహితం అవుతాయి. పార్టీల భావజాలాలూ, సిద్ధాంతాలూ బూటకమై ప్రజలను వంచిస్తాయి.

పరాజయ ప్రభావమా?
ఇక నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యుల  పార్టీ ఫిరాయింపుల విషయానికి వస్తే, ఇందులో కనిపించేదంతా నిజమో, కాదో అనే అనుమానం కొందరు వెలి బుచ్చుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న రోజులలోనూ, అధికారం చెలాయించిన కాలంలోనూ చంద్రబాబునాయుడితో అంటకాగిన సుజనాచౌదరీ, సీఎం రమేష్‌లు నిజంగా ఆయన అనుమతి లేకుండా, మరి కొందరు పెద్దల ఆశీస్సులు లేకుండా పార్టీని వీడి బీజేపీలోకి వెళ్ళి సంచలనం సృష్టించారంటే కొందరికి నమ్మశక్యంగా లేదు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నాటి ప్రతిపక్ష నేత జగన్‌ మోహన్‌రెడ్డి సమర్థంగా నిర్మిస్తున్నారనీ, ఆ కారణంగా ప్రజలలో ఆయన ప్రాబ ల్యం విశేషంగా పెరుగుతున్నదనీ గ్రహించిన చంద్రబాబునాయుడు ప్లేటు ఫిరా యించారు. అంతవరకూ ప్రశంసించిన ప్యాకేజీని పక్కన పెట్టారు. 

ప్రత్యేకహోదా సంజీవని కాదని అప్పటి వరకూ దబాయించి అదే  నినాదం పేరుతో ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి నిష్క్రమించారు. అప్పుడు సుజనా చౌదరి కేంద్ర ప్రభుత్వంలో సహాయమంత్రి అయినప్పటికీ ఆయనది కేబినెట్‌ మంత్రి అశోక్‌గజపతి రాజు కంటే ఎక్కువ పెత్తనం. బీజేపీ నాయకులతో సంబంధాలూ, హడావిడీ అంతా ఆయనదే.  2004 నుంచి 2014 వరకూ పార్టీ కార్యకలాపాలు సుజనాచౌదరి ఇంటి నుంచే జరిగేవి. పార్టీ కోసం చంద్రబాబునాయుడు హెరిటేజ్‌ బ్యాంకు ఖాతా నుంచి నయాపైసా తీయలేదు. సుజనాచౌదరి వంటి సంపన్న నాయకులే ఖర్చులు భరించారు. పార్టీలో లోకేశ్‌ ప్రాధాన్యం పెరిగిన కొద్దీ సుజనాచౌదరి ప్రాముఖ్యం తగ్గుతూ వచ్చింది. సుజనా ఆధ్వర్యంలోని సుజనా గ్రూప్‌ ఆఫ్‌  కంపెనీస్‌ బ్యాంకులకు 5,700 కోట్ల మేరకు టోపీ పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్, ఆదాయంపన్ను శాఖల అధికారులు తమ కార్యాలయాలపైనా, నివాసాలపైనా దాడులు చేయడం ఎన్‌డీఏ నుంచి టీడీపీ నిష్క్రమించిన కారణంగానేనని సుజనాచౌదరి, మరో రాజకీయ వ్యాపారి సీఎం రమేష్‌ భావిస్తున్నారు. 

‘నేను టీడీపీ ఎంపీని కనుకనే నన్ను టార్గెట్‌ చేశారు. మోదీనీ, బీజేపీని వ్యతిరేకించేవారిని వేధించే ప్రయత్నం ఇది. కేంద్రాన్ని ఎవరు ప్రశ్నిస్తే వారిపైన ఆదాయంపన్ను శాఖ దాడులు చేస్తున్నది’ అంటూæ రమేష్‌ ఘాటుగా ఆరోపించి ఎన్నో మాసాలు కాలేదు. సుజనాచౌదరికీ, రమేష్‌కీ టీడీపీ ఎన్‌డీఏని వీడటం బొత్తిగా ఇష్టం లేదు. తమ నాయకుడు అపర చాణక్యుడనీ, మోదీ పరాజయం ఖాయమనీ, మోదీ వ్యతిరేకులను ఒక తాటిమీదికి తెచ్చి, రాహుల్‌గాంధీ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి వెనక నుంచి ఆయనే చక్రం తిప్పుతాడనే ఆశతో ఎన్నికలు పూర్తయ్యే వరకూ కించిత్‌ ఆశా భావంతో మౌనంగా ఉండిన సుజన, రమేష్‌లు ఓట్ల లెక్కింపులో టీడీపీ గల్లంతు కాగానే తమ దారి తాము చూసుకోవాలనీ, ఆత్మరక్షణ కోసం బీజేపీలో చేరడం వినా గత్యంతరం లేదనీ తీర్మానించుకున్నారు. రాజ్యసభ సీటు కోసం భారీ ఖర్చు చేసిన టీజీ వెంకటేశ్‌కు పార్టీ పట్ల విధేయత ఉండాలనుకోవడం అత్యాశ. తెలంగాణలో టీడీపీ ఉనికి లేదు కనుక బీజేపీలోకి వెళ్ళాల్సి వచ్చిందని గరికపాటి మోహనరావు చెప్పవచ్చు. నలుగురికీ చెప్పుకోవడానికి ఏదో ఒక కారణం ఉంది.

వ్యూహంలో భాగమా?
ఈ నలుగురు ఎంపీలు తామంతట తామే బీజేపీలోకి వెళ్ళారా లేక టీడీపీ అధి నేత వ్యూహంలో భాగంగానే బీజేపీ పంచన చేరారా? అనే ప్రశ్న ఒకటి వినిపి స్తున్నది. ఈ విధంగా అనుమానించడానికి చంద్రబాబునాయుడు మార్కు రాజ కీయం కారణం. ఆత్మరక్షణతో పాటు తమ అధినేతపైన కేంద్ర దర్యాప్తు సంస్థలు విరుచుకుపడకుండా మోదీ, షాలను ప్రభావితం చేయడం కోసమే సుజన, రమేష్‌లను బీజేపీలోకి పంపించారనేది కొందరి వాదన. పార్టీలో చేరినంత మాత్రాన దర్యాప్తులు ఆగవంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ప్రకటిం చారు. విచారణ జరిగి తనను దోషిగా నిర్ధారిస్తే తనకు అభ్యంతరం లేదంటూ సుజనాచౌదరి ‘ఇండియా టుడే’తో అన్నారు. అటువంటిది ఏమీ జరగదనే విశ్వాసం ఆయన మాటలలో ధ్వనించింది. 

‘చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా మీరు అప్రూవర్‌గా మారబోతున్నారా?’ అంటూ ఒక న్యూస్‌చానల్‌ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు ‘అటువంటిది ఏమీ లేకపోగా, టీడీపీకి ఏ మాత్రం ఉపయోగ పడినా నేను సంతోషిస్తాను,’ అని చౌదరి వ్యాఖ్యానించారు. మోదీ,షాలు ఏదీ మరచిపోరనీ, ఎవ్వరినీ క్షమించరనీ ప్రతీతి. అందుకే యూరోప్‌లో పర్యటిస్తూ కూడా చంద్రబాబునాయుడు అమరావతిలో పార్టీ నేతలతో ఫోన్‌లో మాట్లాడి నప్పుడు తాను మోదీకి వ్యతిరేకంగా ఏమీ చేయలేదనీ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడాననీ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ పూర్తయిన తర్వాత 42 రోజులకు కానీ ఓట్ల లెక్కింపు జరగలేదు. ఆ వ్యవధిలో విహార యాత్రకు వెళ్ళకుండా ఇప్పుడు ఎందుకు నారావారి కుటుంబం యూరోప్‌ వెళ్ళింది? ఆంధ్రప్రదేశ్‌  పోలింగ్‌ అనంతరం ఢిల్లీ, లక్నో, కోల్‌కతా, బెంగళూరు వగైరా నగరాలను చుట్టి మోదీ వ్యతిరేకులను కూడగట్టి ప్రతిపక్షంలో ఐక్యత సాధించిన నాయకుడుగా పేరు తెచ్చుకోవాలనే తాపత్రయంతో కాలికి బలపం కట్టుకొని తిరిగారు కనుక తీరిక లేక విహారయాత్రకు వెళ్ళలేకపోయారా? నలు గురు ఎంపీలు పార్టీ నుంచి బీజేపీలోకి గెంతే సమయంలో తాను విదేశీపర్యట నలో ఉండాలన్నది ముందే రాసిపెట్టుకున్న స్క్రిప్టా? అంటూ సందేహం వెలి బుచ్చుతున్నవారు ఉన్నారు. 

రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో బీజేపీ ముందరి కాళ్ళకు బంధం వేసినట్టు ఉన్నది. ప్రముఖ వార్తా సంస్థ ఐఏఎన్‌ఎస్‌ ఇస్తున్న లెక్క ప్రకారం నలుగురు టీడీపీ సభ్యుల చేరికతో రాజ్యసభలో బీజేపీ బలం 71 నుంచి 75కి పెరిగింది. ఎన్‌డీఏ ఎంపీల సంఖ్య 108కి చేరింది. ఇంకా 18 మంది ఎంపీలు చేరితే కానీ 245మంది సభ్యులు కలిగిన రాజ్యసభలో ఎన్‌డీఏకి సాధారణ మెజారిటీ సిద్ధించదు. రాజ్యాంగ సవరణ ఆమోదానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ రావాలంటే మరో ఏడాది ఆగాలి. యూపీఏకి 66 స్థానాలు ఉండగా, ఎన్‌డీఏకీ, యూపీఏకీ చెందని పక్షాలకు చెందిన సభ్యుల సంఖ్య 66. తొమ్మిది స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాబోయే  నవంబర్‌లో ఉత్తర ప్రదేశ్‌ నుంచి పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. పదికి పదీ గెలుచుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం బీజేపీకి ఉంది. 

16వ లోక్‌సభ ఆమోదించిన రెండు తీర్మానాలు–సిటిజన్‌షిప్‌ అమెండ్‌ మెంట్‌ బిల్లు, 2018, ముస్లిం మహిళల (వివాహానికి సంబంధించిన హక్కుల పరిరక్షణ) బిల్లు, 2018 (త్రిపుల్‌ తలాఖ్‌ బిల్లు)– రాజ్యసభలో తగినంత బలం లేని కారణంగా మురిగి పోయాయి. 17వ లోక్‌సభలో మొదటి బిల్లుగా త్రిఫుల్‌ తలాఖ్‌ బిల్లును న్యాయశాఖమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ తిరిగి శుక్రవారంనాడు ప్రవేశపెట్టారు. ఈ సారైనా ఈ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందకపోతే ఎన్‌డీఏ సర్కార్‌కు తలవంపులు తప్పవు. అందుకోసం నేపథ్యాలతో, నైతికతతో నిమిత్తం లేకుండా రాజ్యసభ సభ్యులు ఎవరైనా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉంటే వారికి స్వాగతం చెప్పాలని అధినాయకత్వం నిర్ణయించుకున్నట్టు కనిపి స్తున్నది. కారణాలు ఏమైనా కావచ్చు, అధికారంలో ఉన్న జాతీయ పార్టీ ఫిరా యింపుల నిరోధక చట్టాన్ని చట్టుబండలు చేయడం రాజ్యాంగస్ఫూర్తిని మంట గలపడమే.


-కె. రామచంద్రమూర్తి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top