జనయోధుడు తుర్రేబాజ్‌ ఖాన్‌!

History Of Thurrebaj Khan - Sakshi

ఆయనొక సామాన్యుడు. కానీ నిజాం రాజ్యవీరులకే వీరుడు. హైదరాబాద్‌ శూరులకే శూరుడు, బేగంపేట గల్లీకే గర్వకారకుడు. తెలుగునేలలో జనంవైపు నిలిచిన జనప్రియుడు. నేటి కోఠీ మహిళా కళాశాల ప్రాంగణంలో ఉండిన నాటి బ్రిటిష్‌ రెసిడెన్సీపై 1857 జూలై 17న ఐదువేలమందితో ముట్టడి చేసి వలసపాలకులను వణికించిన ధీరుడు. ఆయన ఎవరో కాదు. మనందరం మర్చిపోయిన తుర్రేబాజ్‌ ఖాన్‌. ప్రథమ భారత స్వాతంత్య్ర పోరాటంలో హైదరాబాద్‌ హీరోయే కాని ట్యాంక్‌ బండ్‌ శిల్పాల సరసన స్థానం దక్కని అనాథ. బ్రిటిష్‌ వారి పెత్తనాన్ని, దోపిడీని తీవ్రంగా ద్వేషించిన తుర్రేబాజ్‌ తన కల నిజం కాకముందే హైద్రాబాద్‌ సమీపాన తూప్రాన్‌ వద్ద నిజాం–బ్రిటిష్‌ బలగాలతో జరి గిన పోరులో 1859 జనవరి 23న ప్రాణాలర్పించాడు. జనంలో భయం కలి గించడానికి తన శవాన్ని హైదరాబాద్‌లోని బేగంబజార్‌లోని తన నివాసంలోనే చెట్టుకు  వేలాడదీశారు.

1857 నాటికి నిజాం రాజ్యంలో, దేశం మొత్తంలో సంభవిస్తుండిన రాజకీయ పరి ణామాలకు తుర్రేబాజ్‌ ప్రభావితుడై ఆంగ్లేయులంటేనే రగిలి పోయేవాడు. తొలుత ఫెస్కల్, మాన్‌ కడప్, గుల్బర్గా వంటి ప్రాంతాల్లో బ్రిటిష్‌ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్ని చేపట్టి శిక్షలు కూడా అనుభవించాడు. 1857 జూలై 17న హైదరాబాద్‌లోని మక్కామసీదుకు వెళ్లిన తుర్రాబాజ్‌ అక్కడి మౌల్వీలు, ఇతర పెద్దలు బ్రిటిష్‌ రెసిడెన్సీని ముట్టడించాలని తీసుకున్న నిర్ణయాన్ని విని ఆవేశంతో మత జెండాను చేతబట్టుకుని, గుర్రంపై బేగంబజారుకు వెళ్లి రొహిల్లాలు, అరబ్బులు, విద్యార్థులు, బ్రాహ్మణులు, బ్యాంకర్లు, వ్యాపారులు, ఇతరులను అయిదువేలమందికి పైగా కూడగట్టుకుని కోఠీ లోని బ్రిటిష్‌ రెసిడెన్సీని ముట్టడించాడు. 

ఇదే తరుణంలో, అప్పటికే రహస్య మంతనాలతో తనకు అనుకూలంగా తుర్రేబాజ్‌ మార్చుకోగలిగిన ఇస్లాం మత బోధకుడు, నగరంలో అత్యంత గౌరవనీయుడుగా పేరుగాంచిన మౌల్వీ సయ్యద్‌ అల్లా ఉద్దీన్‌ కూడా తన అనుచరగణంతో పుత్రీబౌ మీదుగా పయనించి రెసిడెన్సీ నైరుతి కొస ప్రాంతానికి చేరుకొన్నాడు. రెసిడెన్సీ పశ్చిమ గోడకు ఎదురుగా రెండు పెద్ద గృహాల్ని, దిల్‌షుక్‌ గార్డెన్‌ని స్వాధీనపర్చుకున్నారు. ఒక రెండు రెసిడెన్సీ గేట్లను విరగ్గొట్టారు. బ్రిటిష్‌ సైనికులకు, తిరుగుబాటుదార్లకు మధ్య తుపాకీలతో పోరాటం 1857 జూలై 18 తెల్లవారు జామును నాలుగుగంటల వరకు కొనసాగింది. 

ఇక పోరాటం కొనసాగించడం కష్టమని భావించి తుర్రేబాజ్, అల్లావుద్దీన్‌ అదనపు బలగాల సేకరణకు అక్కడినుంచి నిష్క్రమించారు. 1857 జూలై 22న తుర్రేబాజ్‌ ఖాన్‌ బందీగా పట్టుబడ్డాడు. బ్రిటిష్‌ ప్రభుత్వం తనకు జీవితాంతం ఖైదీగా అండమాన్‌లో గడపాలని శిక్ష విధించింది. అయితే 1858  జనవరి 23న జైలునుంచి తప్పించుకున్నాడు. కానీ ఇతని కోసం తీవ్రమైన గాలింపు చర్యలను చేపట్టారు. కడకు  1859 జనవరి 23న కుర్బాన్‌ ఆలీ ఆధీనంలోని సాయుధ బలగాల చేతిలో తూప్రాన్‌ వద్ద పట్టుబడగా బ్రిటీష్‌ పాలకులు వెనువెంటనే తనని చంపివేశారు. అతడి శవాన్ని హైదరాబాద్‌లోని బేగంబజారులో ఉన్న తన నివాస ప్రాంతానికి తెచ్చి ఇంటి సమీపంలోని చెట్టుకు వేలాడదీశారు. 

జనం కోసం, బ్రిటిష్‌ పాలన అంతం కోసం, నిజాం పాలననుంచి విముక్తి కోసం వీరమరణం పొందాడు తుర్రేబాజ్‌ ఖాన్‌. అధికారం కాపాడుకోవడం కోసం బ్రిటిష్‌ వారికి ఆద్యంతం తొత్తులుగా వ్యవహరించిన నిజాం, సాలార్‌ జంగ్‌ల కోసం కాకుండా బ్రిటిష్‌ వారిపై పోరాడిన తుర్రాబాజ్, అల్లావుద్దీన్‌లను గుర్తు తెచ్చుకోవడం మన కనీస ధర్మం. ఈ వ్యాసానికి మూలం వ్యాసకర్త రచించిన ‘అప్‌ రైజింగ్‌ ఆప్‌ 1857’ గ్రంథం.
డాక్టర్‌ దేవిరెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి, రిటైర్డ్‌ ప్రొఫెసర్, ఎస్వీ యూనివర్సిటీ
మొబైల్‌ : 98495 84324 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top