ఇంతకూ వైద్యం సేవా.. వ్యాపారమా?

Guest Column By  Dr.Nalini - Sakshi

కార్పొరేట్‌ వైద్యం రాజ్యమేలుతూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ప్రాథమిక ఆరోగ్య సేవలు నత్తనడకతో సాగుతున్న పరిస్థితిని సరిచేయడానికి ఫ్యామిలీ మెడిసిన్‌ ప్రాముఖ్యతని అన్ని దేశాలూ గుర్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ వైద్య కమిషన్‌ బిల్లు ప్రజా వ్యతిరేకత లక్ష్యంతో ఉంది. ఈ కమిషన్‌ సూచించే నియంత్రణలన్నీ ప్రభుత్వ కళాశాలలకి మాత్రమే వర్తిస్తాయి. అలాంటప్పుడు సమానత్వం ఎక్కడిది? ఒకే రకమైన, నాణ్యమైన విద్య ఎక్కడిది? ప్రైవేట్‌ వైద్యకళాశాలలు, డీమ్డ్‌ యూనివర్సిటీల్లో 15 శాతం సీట్లు యాజమాన్యం చేతిలో ఉండగా ఇప్పుడు ఈ బిల్లులో దాన్ని 50 శాతానికి పెంచడం పేదలకు ఎలా ఉపకరిస్తుంది? అందుకే ఇది ‘ప్రజా వ్యతిరేక, పేదల వ్యతిరేక బిల్లు’ మాత్రమే. మన వైద్య రంగాన్ని నిర్వీర్యపరిచే ఇలాంటి బిల్లులు సమానత్వాన్ని చాటలేవు. వైద్యాన్ని మొత్తంగా ప్రభుత్వపరం చేసి, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరిచే విధానాలు మాత్రమే ప్రజల ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడగలవు. 

మన కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జాతీయ వైద్య కమిషన్‌ బిల్లు (ఎన్‌.ఎం.సి. బిల్‌) అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. అందుకే దేశవ్యాప్తంగా వైద్యరంగ నిపుణులు, వైద్య విద్యార్థులు తమ నిరస నని తెలుపుతున్నారు. 1956 నాటి భారతీయ మెడికల్‌ కౌన్సిల్‌ యాక్ట్‌ని రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎం.సి.ఐ.లో అవినీతి పేరుకు పోయినందుకు, దాన్ని రద్దుచేసి, వైద్యవిద్య, ఆరోగ్య రంగాల్లో ఈ కొత్త నియంత్రణలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. దీని ద్వారా దేశానికి అవసరమైన ఉన్నతస్థాయి వైద్యులని అందించవ చ్చని, అత్యాధునిక పరిశోధనని అమలు చేయవచ్చని, వైద్య కళాశాలలపై క్రమబద్ధమైన పర్యవేక్షణ వీలవుతుందని, సమస్యల పరిష్కా రానికి తగిన వేదిక ఏర్పడుతుందనీ ప్రభుత్వం వాదిస్తోంది.

కానీ అవినీతి లేనిదెక్కడ? అవినీతిని రూపు మాపడం కోసం ఈ కొత్త కమిషన్‌ని ఏర్పాటు చేయాలని చెప్పే అమాత్యుల్లో ఎంతమంది లంచగొండులున్నారు? ఐదేళ్ల పరిపాలనా కాలంలో వారి ఆస్తులు ఎంత పెరిగాయో లెక్కలు తీసి ఫాస్ట్‌ కోర్టులకి అప్పగించాలని జస్టిస్‌ చలమేశ్వర్‌ సూచించారు. 34 శాతం కొత్త ఎంపీల మీద క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ప్రజాస్వామిక సంస్కరణల సంస్థ (ఏడీఆర్‌) నిర్ధా రించింది. డాక్టర్లు ఎన్నుకున్న ఎంసీఐలో 120 మంది సభ్యులు ఉంటారు. వీరిలో కొందరు అవినీతిపరులున్నారనే నెపంతో ఆ సంస్థనే రద్దు చేస్తే, మరి పై అంచనాల ప్రకారం అసెంబ్లీలు, పార్ల మెంట్‌లు ఏమవ్వాలి? ఈ కమిషన్‌ సూచించే నియంత్రణలన్నీ ప్రభుత్వ కళాశాలలకి మాత్రమే వర్తిస్తాయి. అలాంటప్పుడు సమా నత్వం ఎక్కడిది? ఒకే రకమైన, నాణ్యమైన విద్య ఎక్కడిది? ప్రైవేటు కళాశాలలకి నియమ నియంత్రణలు ఉండవు. తనిఖీలు ఉండవు. నామమాత్రపు అనుమతితో కాలేజీ పెట్టవచ్చు. సీట్లు పెంచుకో వచ్చు. దాదాపు 80 మంది ఎంపీలకు ప్రైవేటు వైద్య కళాశాలలతో సంబంధాలున్నాయి. వాటి యజమానులుగానో, ట్రస్టీలుగానో, మేనే జింగ్‌ భాగస్వాములుగానో వాటిలో వారి ప్రమేయం ఉంది. అందుకే నియంత్రణలో ఈ పక్షపాత వైఖరి.

ప్రైవేటు వైద్య కళాశాలలు 90వ దశకం తర్వాత విపరీతంగా పుట్టుకొచ్చాయి. వాటిని నియంత్రించి, ప్రమాణాలకి చేరని వాటిని రద్దుచేసి, మిగిలిన వాటిని ప్రభుత్వపరం చేయాలి. అప్పుడు నియం త్రణ సజావుగా, సమానంగా ఉంటుంది. అంతేగానీ, హెచ్చుతగ్గు లను అలాగే ఉంచి, సమానత్వం ఎలా సాధిస్తారు? ప్రస్తుతం ప్రైవేటు కళాశాలల్లో, డీమ్డ్‌ యూనివర్సిటీల్లో 80 శాతం సీట్ల ఫీజుని ప్రభుత్వం నిర్ణయిస్తుంటే, 15 శాతం సీట్లు ప్రైవేటు కాలేజీ చేతిలో ఉండేవి. ఇప్పుడు ఈ బిల్లులో దాన్ని 50 శాతం చేశారు. ఇది పేదలకి ఎలా ఉపకరిస్తుంది? అందుకే దీన్ని ‘ప్రజా వ్యతిరేక, పేదల వ్యతిరేక బిల్లు’గా డాక్టర్లు అభివర్ణిస్తున్నారు. గామీణ ప్రాంతాల్లో డాక్టర్లని పెంచే దిశగా ఈ బిల్లుని ఏర్పరిచామని చెప్పే ప్రభుత్వం ఇలా ధని కులకి కోటాని పెంచి, పేదలకి అవకాశాలు తగ్గించేస్తోంది.

కమ్యూనిటీ హెల్త్‌ ప్రొవైడర్లుగా కొందరికి లైసెన్స్‌ ఇచ్చే అధి కారం ఈ కమిషన్‌కి ఉంది. ఈ మధ్యస్థాయి ప్రాక్టీషనర్ల స్థాయి ఏమిటనేది స్పష్టం చేయడం లేదు. కానీ వారు ప్రాథమిక వైద్య స్థాయిలో కొన్ని మందులు వాడవచ్చని ప్రతిపాదించారు. ఎంబీబీఎస్‌ కాని వారికి ఆరు నెలల బ్రిడ్జి కోర్సు కలిగించి వారిని గ్రామీణ డాక్టర్లుగా గుర్తించే ప్రతిపాదనని అందరూ అడ్డుకోగా, ఇప్పుడు మాటలు మార్చి, అదే ప్రతిపాదనని దొడ్డితోవన తీసుకొచ్చి, నకిలీ డాక్టర్లకి అవకాశం కల్పిస్తున్నారు. అల్లోపతి డాక్టర్లు పల్లెలకు పోవడం లేదని, పల్లెల్లో ఆరోగ్య వ్యవస్థని పటిష్టం చేయడం కోసం ఈ చర్య తప్పదని అంటున్నారు. మనం ప్రతి ఏటా 60 వేల మంది డాక్టర్లని తయారు చేస్తున్నాం. వారిలో కొద్దిమందికి మాత్రమే కాంట్రాక్టు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మిగిలినవారు పల్లెలకి పోతామని, దానికి తగిన వసతులు కల్పించమని, జీతాలు తగినట్టు ఇవ్వమని చెబుతూ కొన్ని సౌకర్యాలు ఇవ్వమని కోరుతున్నారు. కానీ ఈ నిరు ద్యోగుల మొర ఆలకించకపోగా, నిపుణులని పక్కకి నెట్టి, అరకొర వైద్యం తెలిసిన వారిని అందలం ఎక్కించి ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారు.

ఏ రంగానికి ఆ రంగాన్ని వృద్ధి చేయకుండా, అడ్డదారిలో వైద్యాన్ని ప్రవేశపెడితే, ఆయుష్‌ విద్యార్థులు మాత్రం తమ ప్రమాణాలని ఎలా పెంచుకోగలరు? వైద్య రంగానికి బడ్జెట్‌ కేటాయింపులు పెంచి, ప్రభుత్వ వైద్య సంస్థల ప్రమాణాలని పెంచి, అల్లోపతి డాక్టర్ల నియామకాలను పెంచితే సమస్య పరిష్కారం అవుతుంది కానీ ఇలా చిట్కాలతో సమస్య తీరదు. నిజానికి మనకి డాక్టర్ల కొరత లేదు. స్పెషలిస్టుల కొరత ఉంది. పీజీ సీట్లు పెంచి, వారి నైపుణ్యాన్ని పెంచి, వారిని ప్రభుత్వ రంగంలో నిలిపి ఉంచుకోగలిగితే వైద్య రంగం పురోగమిస్తుంది. కానీ అన్ని రంగాల్లో లాగానే వైద్య రంగంలో కూడా కార్పొరేట్లకి రాయితీలు ఇస్తూ ప్రాథమిక వైద్య సేవలని దెబ్బ తీస్తున్నారు.

మన దేశంలో ప్రాథమిక ఆరోగ్య విధానం దిగజారిపోతోంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే విధానాలు అంటువ్యాధులని నియం త్రించే ప్రాథమిక సూత్రాలు అడుగంటిపోతున్నాయి. జీవన విధాన మార్పులతో వచ్చే వ్యాధులకి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే కార్పొరేట్‌ వైద్యం రాజ్యమేలుతోంది. ప్రజల జీవన ప్రమాణాలని పెంచే ప్రాథ మిక ఆరోగ్య సేవలు నత్తనడకన సాగుతున్నాయి. దీన్ని సరిచేయ డానికి ఫ్యామిలీ మెడిసిన్‌ ప్రాముఖ్యతని అన్ని దేశాలూ గుర్తిస్తు న్నాయి. కానీ మన దేశంలో మాత్రం ఈ నిపుణుల సేవలని అంది పుచ్చుకోవడంలో విఫలం అవుతున్నాం. అన్ని వయసుల వారిని, అన్ని ప్రాథమిక వ్యాధులని పరీక్షించగల నైపుణ్యంగల ఈ డాక్టర్లని, ఈ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.

ప్రాథమిక వైద్య కేంద్రాల్లో వీరి సేవలను ఉపయోగిస్తే ప్రాథమిక స్థాయిలో ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఏ వృత్తికి ఆ వృత్తి స్వయం నిర్ణయాధికార హక్కు ఉండాలి. అలా వైద్య వృత్తిని వైద్యులు నియంత్రించాలిగానీ ప్రభుత్వాలు కాదు. ప్రైవేటు కళాశాలలని ప్రభుత్వపరం చేయడానికి బదులు వారికి 50 శాతం సీట్ల ఫీజులపై పెత్తనాన్ని అప్పగించడం సమా   నత్వం ఎలా అవుతుంది? వైద్య విద్యని మేధ కాక డబ్బు నియంత్రిస్తే నీట్‌ ఎందుకు? నెక్ట్స్‌ ఎందుకు? కష్టపడి చదవడం ఎందుకు? పేదల నోట్లో మన్ను ఎందుకు? విద్యని కొనుక్కునే డాక్టర్లు సామాన్యుల ఆశాజ్యోతులవుతారా? విద్య వైద్యం పూర్తిగా ప్రభుత్వపరంగా ఉండి ప్రజల అవసరా లను తీరిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ ప్రస్తుతం ఈ రెండు రంగాల్లో ప్రైవేటు సంస్థలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వం తన బాధ్యతని దులిపేసుకోవడంతో ప్రజలు 80 శాతం వైద్య ఖర్చులను తామే భరిస్తూ నిరుపేదలవుతున్నారు. రైతుల ఆత్మహత్యలకి కార ణాల్లో వైద్య పరమైన అప్పులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

సేవా రంగాలను వ్యాపార రంగాలుగా మార్చడం మానాలి. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు పెంచి, అందులో నైపుణ్యం గల డాక్టర్లని నియమించి, వైద్య విద్యా ప్రమాణాలను పెంచి, వాటి అనుబంధ ఆసుపత్రులకి కేటాయింపులు పెంచి, నాణ్యమైన పరికరాలు అందిస్తే వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రాథమిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలే తప్ప, అవకతవక సంస్కరణలతో వారిపై భారాన్ని పెంచి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీయకూడదు. క్యూబా, థాయ్‌లాండ్, యూరప్‌ వంటి చోట్ల ఉన్న మెరుగైన వైద్య ఆరోగ్య సేవల అనుభవాన్ని అధ్యయనం చేసి మన వైద్య రంగాన్ని మెరుగు పర్చుకోవాలి. లేదంటే, ఈ తప్పుడు విధానాల వల్ల అంటువ్యాధులు ప్రబలి, జాతీయ భద్రతకే ముప్పు వాటిల్లవచ్చు. మనవైద్య రంగాన్ని నిర్వీర్యపరిచే ఇలాంటి బిల్లులు సమాన త్వాన్ని చాటలేవు. వైద్యాన్ని మొత్తంగా ప్రభుత్వపరం చేసి, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరిచే విధానాలు మాత్రమే ప్రజల ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడగలవు. సేవా రంగాన్ని వ్యాపారం మింగేస్తే అలాంటి దేశానికి భవిష్యత్తు ఉండదు.
- డాక్టర్‌ నళిని, పిల్లల వైద్య నిపుణులు    

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top