ప్రశ్నను చిదిమే పన్నాగం!

Dileep Reddy Guest Column On National Youth - Sakshi

సమకాలీనం

ఈ దేశ యువత సామాజిక స్పృహతో మళ్లీ చైతన్యమౌతోందా? ఒకింత ఆశ కలుగు తోంది. రాజకీయ శక్తుల చేతుల్లో పావుగా మారి జారిపోతోందా? కాస్త భయం కలు గుతోంది. రెండు పార్శా్వల నడుమ ఏదో సంఘర్షణ సంకేతాలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా నేడు నెలకొన్న వివాద పరి స్థితుల్లో యువతరం, ముఖ్యంగా విద్యార్థి లోకం నడక భిన్న వైఖరుల్ని వెల్లడి చేస్తోంది. ఏవో శక్తులు దూరం చేస్తున్న తమ భవిష్యత్తును, వెనక్కి లాక్కో వాలనే స్పృహ యువతలో కనిపిస్తోంది. ఈ మొగ్గు నిజంగా ప్రజా స్వామ్య పరిరక్షణ వైపు సాగితే, దేశ భవిష్యత్తు ఆశావహంగా ఉండటం ఖాయం! మరో రెండు రోజుల్లో జాతీయ యువజన దినో త్సవ (స్వామీ వివేకానంద జయంతి) వేడుకలకు అంతటా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘యువత రోజుకై నినాదం’ అన్నది ఈ యేటి (2020) అంశంగా నిర్ణయించారు. మరో పక్క దేశం వివిధ ప్రాంతాల్లో నిరసనోద్యమాలు, అసమ్మతి ప్రదర్శనల్లో యువత కీలకపాత్ర పోషిస్తోంది.

ముఖ్యంగా యువతకు నెలవైన పలు విశ్వవిద్యాలయాలు నిప్పురవ్వలై రగులుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ (జేఎన్‌యూ) ప్రాంగణంలో చిందిన నెత్తుటి తడి ఇంకా ఆరనే లేదు. దాడి చేసిన ముష్కర మూకల ఆనవాళ్లున్నా దోషుల జోలికెవరూ వెళ్లటం లేదు! వెంటనే చర్యలు తీసుకోవాలనే ఆందోళనలు ఆగటం లేదు. సినీనటి దీపికా పడుకొనే ఈ దేశపు యువతరానికి ప్రాతినిధ్యం వహిస్తారో లేదో గానీ, ఆమె ఆలోచనలు నేటి యువత మారుతున్న భావజాలానికి సంకేతం కాకుండా పోవు. జేఎన్‌యూలో విద్యార్థులు –టీచర్లపై దాడిని నిరసిస్తూ ఆమె సరాసరి విశ్వవిద్యాలయానికి వెళ్లి వారిని పరామర్శించడం దేశ వ్యాప్త చర్చకు తెరలేపింది. సగానికి పైగా జనాభా యువతరంతో నిండిన అతి పెద్ద దేశంగా ప్రపంచ పటంలో పతాకం ఎగురుతున్న కీర్తి మనది. వచ్చే ఒకటి, రెండు దశాబ్దాల్లో విశ్వవ్యాప్తంగా అత్యధిక పనివాళ్లున్న దేశంగా పీఠం మనకే దక్కనుంది. ఈ పరిస్థితుల్లో మన యువత ప్రస్తుత ఆలోచనా ధోరణి నిస్సందేహంగా భవిష్యత్తును శాసించేదే! అందుకే, ఈ దేశపు మేధావి వర్గమంతా యువత అడుగుల్ని, నడకని, గమనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. భవిష్యత్తుకు భరోసా వెతు క్కుంటున్నారు.

కొత్తగాలి దేనికి సంకేతం?
పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ), జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్నార్సీ) ప్రక్రియకు వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థి ఆందో ళనల విస్తృతి వారి ఆలోచనా దోరణిని ప్రతిబింబిస్తోంది. విశ్వవిద్యా లయాల్లోని సామాజిక శాస్త్రాల వారే కాక న్యాయ, వైద్య, ఇంజ నీరింగ్, ఎంబీయే వంటి వృత్తి కోర్సుల విద్యార్థులూ వీధుల్లోకొ చ్చారు. తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటూ కూడా స్పష్టమైన వైఖరినే వెల్లడిస్తున్నారు. రాజధాని ఢిల్లీలోని జేఎన్‌యూ, జామియా వంటి చైతన్యస్రవంతి సంగతి సరేసరి! అహ్మదాబాద్‌లోని ఐఐఎమ్‌ విద్యా ర్థులు చేతుల్లో రాజ్యాంగ ప్రతిని పట్టుకొని సామూహికంగా ‘రాజ్యాంగ పీఠిక’ బహిరంగ పఠనకు సిద్ధమయ్యారు. మరో రోజు, పోలీసు లాఠీలనెదుర్కొంటూ కొవ్వొత్తులతో మౌన ప్రదర్శన చేశారు. పుణే లోని ఫిల్మ్‌–టెలివిజన్‌ సంస్థ, బరోడా సాయాజీరావ్‌ విశ్వవిద్యా లయ లలితకళల విభాగం, ఢిల్లీ అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్‌)ల విద్యార్థులు ప్రస్తుత ఉద్యమాలకు దూరంగా లేరు. దూసుకొని వెళ్తూ స్పష్టమైన తమ వైఖరి, వ్యక్తీకరణతోనే ఉన్నారు.

స్వతహాగా నిరసన గళాలు వినిపించే మార్గాలు వెతుక్కుంటున్నారు తప్ప, రాజకీయ పార్టీలు చూపే దారుల్లో నడిచేందుకు వారు సిద్ధంగా లేరు. లక్నోలో ఒక విద్యార్థిని జాతీయ టీవీ మీడియాతో మాట్లా డుతూ, ‘మేం చెప్పే లౌకిక వాదమంటే, ఏదో.. ఫలానా... రాజకీయ పార్టీ వల్లించే కుహనా లౌకికవాదం కాదు, మహాత్మాగాంధీ ఆశించి నట్టు, భిన్నమతాల వారు కలిసి సాగించే సయోధ్య–సహజీవన వాదం...’ అని పలికిన స్వరం గంభీరంగానే కాదు, నిజాయితీగానూ ఉంది. ఇంతటి సంక్లిష్ట సమయంలో గాంధీ ప్రస్తావన ఓ సాను కూలాంశం. అస్సాంలో కొత్త జవజీవాలు నింపుకున్న అఖిల అస్సాం విద్యార్థి సంఘం (ఆసు) నిరసన భయానికి ప్రధాన మంత్రి పర్యటన రద్దయినట్టు ప్రకటన వెలువడింది. ప్రస్తుత విద్యార్థి లోకం చేస్తున్న వ్యక్తీకరణలు ఏ విద్యాసంస్థలకో, పార్టీ సిద్ధాంతాలకో, మత–కుల వర్గ సమూహాలకో పరిమితమైన భావజాలంలా లేవు. దేశ చారిత్రక నేపథ్యాన్ని, రాజ్యాంగం అక్షరబద్ధం చేసిన ప్రజాస్వామ్య స్ఫూర్తినీ, నిజమైన లౌకకవాదపు పునాదుల్నీ ప్రతిబింబించేవిగా ఉండటం ఆహ్వానించదగ్గ పరిణామం!

కొత్తగా తెస్తున్న చట్టాల కన్నా, పాత చట్టాలకు చేస్తున్న మార్పుల కన్నా ప్రభుత్వాల నియంతృత్వ ధోరణుల్ని తప్పుబడు తున్నారు. ప్రజల నిరసన సహించని అసహనాన్ని వారెక్కువగా వ్యతిరేకిస్తున్నారు. అసమ్మతి గళాల్ని తొక్కేసే పాలకుల ధోరణిని నిశితంగా నిరసిస్తున్నారు. ‘ఎందుకిలా?’ అని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లోని లజపతినగర్‌లో కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌షా ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేస్తున్నపుడు ఒక అపార్ట్‌మెంట్‌ బాల్కనీ నుంచి బ్యానర్‌తో నిరసన ప్రదర్శన, నినాదాలు చేసిన యువతి సాహసం ఇందుకొక ఉదాహరణ! ఇంటి యజమానిని అడ్డుపెట్టి, 24 గంటల్లో ఆమె ఉంటున్న అద్దె ఇల్లు ఖాళీ చేయించడం పాలకుల దమననీతికి పరాకాష్ట!

ఆధిపత్యం కోసం అరాచకం
జేఎన్‌యూలో విద్యార్థి వివాదాలు, భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణలు కొత్త కాదు. సాంస్కృతిక, రాజకీయ, సామాజికార్థికాంశాలపై లోతైన చర్చలు, వాదోపవాదాలు ఇక్కడ నిత్యకృత్యం. పాలకుల విధానాలపై ఓ ఆరోగ్యవంతమైన చర్చకు వేదికై, దేశమంతటికీ లోతైన భావాలు వ్యాప్తి చేసే కేంద్రమై అర్ధ శతాబ్ద కాలంగా విరాజిల్లుతోంది. కానీ, అక్కడ గత ఆదివారం జరిగింది ఓ దుర్మార్గమైన చర్య. ఒక విద్యార్థి సంఘం వారు బయటి గూండాలను ముసుగులతో తీసుకువచ్చి, పాలకుల  విధానాల్ని వ్యతిరేకిస్తూ నిరసిస్తున్న విద్యార్థులు–బోధకు లపై హాకీ స్టిక్స్, క్రికెట్‌ బ్యాట్లు, ఇనుప రాడ్లతో జరిపిన పాశవిక దాడి దారుణం. విశ్వవిద్యాలయ భద్రతా సిబ్బంది కనిపించకుండా పోతే, పోలీసులు మౌన ప్రేక్షక పాత్ర వహించారు. ఈ దుర్నీతిని ప్రజా స్వామ్య వాదులంతా ఖండించారు.

ముసుగుల వెనుక ముఖాలు దాచుకున్న ముష్కర మూకకు జేఎన్‌యూ ఔన్నత్యమేమి తెలుసు? వివాద సంక్షోభం తలెత్తిన ప్రతిసారీ, భారతావనికి ప్రత్యామ్నాయ ఆలోచనాధారను అవి రళంగా అందించిన జ్ఞాన కేంద్రం జేఎన్‌యూ అని తెలుసా? మూకలే కిరాయివా? వారిని తీసుకువచ్చిన విద్యార్థి విభాగాలూ భావపరమైన రాజకీయ దాస్యంలో మగ్గుతున్నాయా? అనే సందేహాలు వ్యక్తమౌతు న్నాయి. ప్రత్యర్థులూ మరో రాజకీయ పక్షానికి ప్రతినిధులనే ప్రత్యా రోపణలూ ఉన్నాయి. ఆ సందేహాలే, చిగుళ్లు తొడుగుతున్న సరికొత్త ఆశలను చిదుముతున్నట్టనిపిస్తోంది. ఆయా విద్యార్థి సంఘాలను రాజకీయ పక్షాలు వెనుకేసుకొస్తున్న ధోరణి అనుమానాలకు తావి స్తోంది. ప్రశ్నించే తత్వం విస్తరించి, చైతన్యం వెల్లివిరిసే వేళ విద్యార్థి లోకాన్ని రాజకీయ శక్తులు మళ్లీ తమ గుప్పిట్లోకి లాక్కుంటు న్నాయా? అనే భయ–సందేహాలు కలుగుతున్నాయి. రాజకీయాల కతీతంగా అక్కడక్కడ పెల్లుబికే స్వేచ్ఛా–స్వతంత్ర వాదనలు ఆశలు రేపుతున్నాయి. 

ప్రశ్నే ప్రజాస్వామ్యానికి వన్నె!
చైతన్య దీపికలుగా వెలగాల్సిన విశ్వవిద్యాలయాలను ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు గుడ్డి దీపాలు చేస్తున్నాయి. అణుమాత్రం వ్యతి రేకతనూ అంగీకరించే స్థితిలో లేవు. అందుకే, విద్యా విషయంగా, నిర్వహణ రీత్యా, ప్రవేశాల పరంగా... అన్ని విధాలా వాటిని నిర్వీర్యం చేస్తున్నాయి. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనా సరళి, స్వేచ్ఛా భావధారను మొగ్గలోనే చిదిమేస్తున్నాయి. సమాజంలో సంఘర్షణను ఎదుర్కొనే, ప్రశ్నించే సామాజిక వర్గాలకు అక్కడ తావులేని స్థితి కల్పిస్తున్నాయి. మేలిమైన ఉన్నత విద్యకు వారిని క్రమంగా దూరం చేస్తున్నాయి. రిజర్వేషన్ల కోత విధించి, రమారమి ఫీజులు పెంచి, సంఘర్షణతో ఆధిపత్యం సాధించి అల్పాదాయ, మధ్య తరగతిని అక్కడికి రానీకుండా చేస్తున్నాయి. ప్రశ్నించకుండా అన్నిటికీ ఊ కొట్టే, కడుపు నిండిన ఉన్నత–సంపన్న వర్గాల వారికే అవి అందుబాటులో ఉండేట్టు చేస్తున్నాయి. 

ఈ ప్రక్రియలన్నింటి వెనుక కుట్ర దాగుందని మేధావివర్గం భావిస్తోంది. ఇప్పుడు జెఎన్‌యూలో తాజా వివాదం కూడా అక్కడే మొదలయింది. విద్యార్థి లోకం, ఇతరేతర యువతరం ఈ గుంజా టన నుంచి బయటపడాలి. స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆలోచించాలి. ప్రశ్నించే తత్వానికి మరింత సానపెట్టాలి. నిరసన తప్పు కాదు. ప్రజాస్వామ్య పరిధిలో అసమ్మతి వ్యక్తీకరణ నేరమూ కాదు. మానవేతిహాసం మొదలైన్నుంచీ నిరసన, అసమ్మతికి తావుంది. వేద కాలం, పురాణ–ఇతిహాస కాలంలోనూ తప్పలేదు. భిన్నాభిప్రా యాలకు తావుంది కనుకే... విభీషణ విభేదమైనా, రామాంజనేయ– కృష్ణార్జున యుద్ధాలెనా జరిగిందందుకే! ‘నేనేదైనా చేయగలను!’ అనుకోవాలి. ‘పట్టుదలతో నిరాకరిస్తే, పాము విషం కూడా పని చేయకుండా పోతుంది’ అన్న స్వామీ వివేకానందుడి మాటలే నేటి యువతకు స్ఫూర్తి కావాలి!

దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top