యోధులారా! సలామ్‌..!!

Devi Writes On Women In Politics And Economy - Sakshi

స్త్రీలు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లోనూ తమ ఉనికిని నిర్ద్వంద్వంగా చాటుతున్నారు. దీనికి వారు భారీగా మూల్యం చెల్లించవలసి వస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం... శతాబ్దాల పోరాట గాథల నీరాజనం.

ఆకలితో రగిలి రగిలి హక్కులకై ఎలుగెత్తిన మహిళా గళాల సమ్మేళనం మార్చి 8. కనీస వేతనం, 8 గంటల పని, ఉపాధి హామీ మొదటగా స్త్రీల గొంతుల్లో ఒక్కటిగా చెలరేగిన నినాదాలు. చదువుకునే హక్కు, ఓటు హక్కు డిమాండ్లు వాటి ప్రతిధ్వనులు. ‘టైమ్‌ ఈజ్‌ నౌ’ ఇదే సమయం– గ్రామాల్లో, పట్టణాల్లో మార్పును తీవ్రతరం చేస్తూ సమానత్వం కోసం బాటలు వేస్తున్న మహిళా కార్యకర్తల కృషిని ప్రశంసిస్తూ ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం పిలుపు– ప్రభుత్వాలను ముల్లుగర్రతో పొడిచి కదిలించడం.

క్లారాజెట్కిన్‌తో మొదలయ్యి ఐలమ్మ దాకా.. జీవితాల్ని తృణప్రాయంగా అర్పించిన పోరాట యోధులు రాలిపోయేవారు రాలిపోతున్నా రాలేనివారు పక్కకుపోతున్నా ప్రతి మజిలీ కొత్త రక్తాన్ని పొందుతూనే ఉంది. మనదేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంలో స్త్రీల ప్రాధాన్యం బాగా పెరిగింది. వ్యవసాయం ద్వారా ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్న మహిళల శాతం 68కి చేరింది. కానీ గ్రామీణ స్త్రీల ఉపాధి 23 శాతానికి పడిపోయింది.

వ్యవసాయం వదిలేయక తప్పని స్థితి ఏర్పడుతున్నా స్త్రీలు వేరే దారి లేక సేద్యాన్నే నమ్ముకుంటున్నారు. కౌలుదార్లు గాకుండా స్త్రీలు భూమి సాగు చేస్తున్నారు. కానీ నేటికీ 10–15 శాతం భూమి మాత్రమే స్త్రీల పేరిట ఉంది. కనుక వారికి ప్రభుత్వ రాయితీలు లభించవు. సాగుదార్లుగా ఎటువంటి గుర్తింపు లేనందువల్ల మహిళా రైతుల ఆత్మహత్యలు రైతు ఆత్మహత్యల జాబితాలోకి చేరవు.

అమ్మాయిలు పుట్టడం అనవసరం అనుకునే దేశంలో వారి ఆహారం, ఆరోగ్యం కుటుంబ ప్రాధాన్యతల్లో చివరనే ఉంటాయి. రేషన్‌ కార్డులుండి చౌకగా ఆహారధాన్యాలు లభించకపోతే దానికి బలయ్యేది మొదటగా బాలికలూ, స్త్రీలే. రేషన్‌ అందనీయని ‘ఎక్స్‌క్లూజన్‌ ఎర్రర్‌’ 40 శాతం దాకా ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. కనీసం కడుపు నింపడానికి హామీ ఇస్తుందనుకున్న ఆహార భద్రతా చట్టం పేదల ఆకలితో ఆడుకుంటున్నది.

2015–16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ప్రాథమిక స్థాయిలో అసలు బడికి పోని బాలికలు 23 శాతం ఉండగా, మాధ్యమిక స్థాయిలో మానేస్తున్నవారు 46.2 శాతం. కానీ తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు డ్రాపవుట్స్‌ లేనట్టే వ్యవహరిస్తున్నాయి. ఉన్నత విద్యకు 30 శాతం కూడా చేరడం లేదు. దేశంలో చదువు రాని వారికంటే చదువుకున్న నిరుద్యోగులు అందునా చదువుకున్న మహిళా నిరుద్యోగులు అత్యధికంగా ఉన్నారు.

ఇన్ని ప్రతికూలతలకు తోడు మరొక మిత్తి వచ్చిపడింది. అది ఆదాయ అసమానతలు. అభివృద్ధి చెందిన దేశాల్లో మొత్తంగా ఆదాయ అసమానతలు పెరిగినా స్త్రీపురుషుల వేతన వ్యత్యాసాలు బాగా తగ్గాయని ప్రపంచ అసమానత నివేదిక 2018 పేర్కొంది. కానీ మన దేశం లాంటి దేశాల్లో మాత్రం అవి పెరుగుతూనే ఉన్నాయి. ఐటీ రంగంలో కూడా 22 శాతం వేతన వ్యత్యాసం ఉండటం దీనికి నిదర్శనం.

ఈ అశక్తతల పరిణామాలు స్త్రీలను అన్ని రంగాల్లో బలహీనపరుస్తున్నాయి. మహిళలపై పురుషాధిక్యపు ప్రతికూలత తగ్గకపోగా పెరుగుతున్నదని, ఇది పోవాలంటే ఇంకో 200 ఏళ్లు పడుతుందని ప్రపంచ ఆర్థిక సంస్థ పేర్కొంది. అయినా స్త్రీలు వ్యక్తిగత జీవితాల్లోనూ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లోనూ తమ ఉనికిని నిర్ద్వంద్వంగా చాటుతున్నారు. ఈ విధంగా చూడటానికి వారు భారీగా మూల్యం చెల్లించవలసి వస్తోంది.

‘మీ టూ’అనే ఉద్యమం పనిప్రదేశాల్లో ప్రత్యేకించి హాలీవుడ్‌ లోని లైంగిక హింసపై గొంతు విప్పే అవకాశం కల్పించింది. దాన్ని అందిపుచ్చుకుని అనేక దేశాల్లో లైంగిక చర్చ ప్రధాన చర్చగా మారింది. పేరు ప్రఖ్యాతులు, బిరుదులు ఉన్న అనేకమంది రాజీనామాలకు దారితీసింది. దాని కొనసాగింపుగా ‘టైమ్‌ ఈజ్‌ అప్‌’– సమయం అయిపోయిందనే హెచ్చరిక కూడా ఊపందుకుంది. మన దేశంలో శానిటరీ ప్యాడ్‌ల నుంచి లైంగిక అత్యాచారాల దాకా విభిన్నమైన అంశాలపై ప్రచార కార్యక్రమాలు సామాజిక మాధ్యమాల్లో ఆదరణ పొందుతున్నాయి. ప్రచార ప్రసార మాధ్యమాల్లో ప్రాధాన్యత పెంచుకుంటున్న భావజాల ఉద్యమాలు వాస్తవ జీవితాలను మార్పు చేసే దిశగా ప్రయాణించాలంటే భావాలను ఆచరణలోకి తెచ్చేందుకు సామాన్య మహిళలకు అవగాహన కలిగించే కార్యకర్తలు కీలకం. మాధ్యమాల్లో జరిగే చర్చ అవగాహనకు దోహదపడినా అంతిమంగా మార్పు తేవాల్సింది సామాన్య మహిళలే.

వేతనాలు, ఉపాధి, ఆహార భద్రతలే కాదు.. గృహహింస, పని ప్రదేశాల్లో లైంగిక హింస, ఇంటా బయటా వయసుతో నిమిత్తం లేకుండా జరుగుతున్న లైంగిక దాడులు, పెట్రేగిపోతున్న సెక్స్‌ అక్రమ రవాణా వంటివి స్త్రీల శారీరక ఆరోగ్యానికే కాక మానసిక ఆరోగ్యానికి హానికరంగా మారాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నది. రానున్న కాలంలో అతిపెద్ద ఆరోగ్య సమస్యలు హింస కారణంగా ఏర్పడేవి మొదటి స్థానంలో ఉంటే, బండచాకిరి వలన ‘అలసట’ రెండో ప్రధాన ఆరోగ్య సమస్యగా మహిళలు ఎదుర్కోవలసి వస్తోంది. ఏవయినా ఆ మహిళల హక్కులను కాపాడాలని వారికి అండగా నిలబడటం వలన వారి పని తీరు మంచి ఫలితాల్నిస్తుందని తేలింది.

కానీ మన దేశంలో పదే పదే వినిపించే ప్రశ్న ఏదంటే.. ప్రైవేట్‌ సంస్థలు అటుంచితే ఎన్ని ప్రభుత్వ సంస్థల్లో నిజంగా పనిచేసే లైంగిక వేధింపుల కమిటీలు ఉన్నాయి? తన చట్టాలను తాను పాటిస్తూ ప్రైవేట్‌ సంస్థలతో కచ్చితంగా వాటిని పాటించేలా చేయడం ప్రభుత్వాల బాధ్యత. అంతర్జాతీయ మహిళా దినోత్సవం గత ఏడాది సాధించిన దాన్ని బేరీజు వేసుకుని రానున్న కాలానికి ప్రాధమ్యాలు నిర్దేశించుకునే రోజు. ఏడాది పొడవునా తీవ్రతరం చేయాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేసుకునే రోజు అంటే మార్చి 8 స్ఫూర్తి ఏడాదంతా కొనసాగుతూనే ఉంటుంది.

దేవి
వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త  
ఈ–మెయిల్‌ : pa_devi@rediffmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top