అజయ్‌ రాయ్‌ (మోదీ ప్రత్యర్థి) రాయని డైరీ

Ajay Rai Contest Against Modi In Varanasi - Sakshi

నామినేషన్‌కి రేపు చివర్రోజు. ఏరివేతలకు ఎల్లుండి ఆఖర్రోజు. ఏదైనా మిరకిల్‌ జరిగి, చెల్లని నోటును డిపాజిట్‌ మిషన్‌ విసిరి కొట్టినట్టుగా ఎలక్షన్‌ కమిషన్‌ నా నామినేషన్‌ని విసిరికొట్టేస్తే బావుణ్ణు. ఇప్పటికే ఒకసారి మోదీజీ మీద ఓడి పోయాను. మళ్లొకసారి మోదీజీ గెలుపును నా చేతుల్లో పెట్టి ‘‘మీదే బాధ్యత’’ అని వెళ్లి పోయాడు రాహుల్‌! ‘రాహుల్‌బాబూ.. నాకెప్పుడూ ఒక సందేహం వస్తుంటుంది’’ అన్నాను.. రాహుల్‌ నా చేతుల్లో పెట్టదలచుకున్నది పెట్టి వెళ్లిపోతున్నప్పుడు. ‘ఎప్పుడూ వచ్చే సందేహమే అయితే ఇప్పటికీ దానిని ఒక సందేహంగానే ఉండనిచ్చినందుకు ఎప్పటికైనా దానిని నివృత్తి చేసుకోవలసిన బాధ్యత మీదే అవుతుంది అజయ్‌. కొత్తగా వచ్చిన సందేహమైతేనే మీరు నన్ను అడగండి’ అన్నాడు! ‘‘కానీ.. నా సందేహం కొత్తదేమీ కాదు  రాహుల్‌బాబూ..’’ అన్నాను.

రాహుల్‌ నవ్వాడు. ‘‘ ఓ! నాకు అర్థమైంది అజయ్‌. నా ప్రియ సోదరిని  వారణాసిలో మోదీపై పోటీగా నిలబెడతానని దేశమంతా అనుకున్నట్లే మీరూ అనుకున్నారు. ఇప్పుడు ఆమెకు బదులుగా మిమ్మల్ని నిలబెట్టేసరికి మీకూ, దేశానికీ.. అనుకోడానికి ఏమీ లేకుండా పోయింది. ఇలా ఎవ్రీ టైమ్‌ దేశ ప్రజల్ని, పార్టీ అభ్యర్థుల్ని నేనెలా నివ్వెర పాటుకు గురి చేయగలుగుతున్నాననే కదా మీ సందేహం’ అన్నాడు.
‘‘అది కాదు నా సందేహం రాహుల్‌బాబూ. మోదీపై ఎవరు ఎవర్ని నిలబెట్టినా అది ఎవరికైనా నివ్వెరపాటే. మీరు నన్ను నిలబెట్టారు. అఖిలేశ్‌.. షాలినిని నిలబెట్టాడు. షాలిని ఎవరో వారణాసిలో ఎవరికీ తెలీదు. నేనెవరో తెలియనివాళ్లు వారణాసిలోనే లేరు. మోదీపై నిలబడ్డాం కనుక ఇప్పుడు ఇద్దరం ఒకటే. ఎవరికీ తెలియని షాలిని అందరికీ తెలిశారు. అందరికీ తెలిసిన నేను ఈసారి కూడా మోదీపై ఓడిపోతే ఎవరికీ తెలియకుండా పోతాను’’ అన్నాను. రాహుల్‌ అసహనంగా చూశాడు. ‘‘మీ సందేహం ఏమిటో చెప్పకుండా, మీ సందేహం ఏమిటోనన్న సందేహంలోకి నన్ను నెట్టేస్తున్నారు’’ అన్నాడు. వెళ్లే తొందరలో ఉన్నాడని నాకు అర్థమైంది.

‘‘రాహుల్‌బాబూ.. మీ ప్రియ సోదరి మీకు అక్క అవుతారా, లేక మీకు చెల్లి అవుతారా? ఎప్పుడూ నాకిదొక సందేహం’’ అన్నాను. ఇదేనా మీ సందేహం అన్నట్లు చూశాడు రాహుల్‌. ‘‘పోలింగ్‌కి గట్టిగా ఇరవై రోజులైనా లేకుండానే మీకిలాంటి సందేహాలు వస్తున్నాయంటే, పోలింగ్‌ ఫలితాలపై మీకెలాంటి సందేహాలూ లేనట్లు అర్థమౌతోంది అజయ్‌’’ అనేసి వెళ్లిపోయాడు! రాహుల్‌ వెళ్లిపోగానే మనోజ్‌ కుమార్‌కి ఫోన్‌ చేశాను. ‘‘ఒక స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌కి మీరిలా నేరుగా ఫోన్‌ చెయ్యకూడదు’’ అన్నాడు మనోజ్‌. ‘‘పార్టీ అభ్యర్థిగా కాదు, ఒక పౌరుడిగా చేశాను’’ అన్నాను. ‘‘చెప్పండి’’ అన్నాడు. ‘‘పదహారు క్రిమినల్‌ కేసులు ఉండి, గూండా యాక్ట్‌ కింద అరెస్ట్‌ అయి, పోలీసుల్ని తన్ని, పోలీస్‌ వాహనాల్ని తగలేసి, ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేసి, ప్రైవేట్‌ ఆర్మీని నడిపి, నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద బుక్‌ అయిన ఒక వ్యక్తి నామినేషన్‌ని తిరస్కరించడానికి వీలువుతుందా?’’ అని అడిగాను. ‘‘టు మై నాలెడ్జ్‌.. వీలు కాకపోవచ్చు’’ అన్నాడు కమిషనర్‌. ‘‘పోనీ.. అఫిడవిట్‌లో ఐదొందల నోటు చూపి, జేబులో రెండువేల నోటు పెట్టుకుని తిరుగుతున్నాడని ఎవరైనా కంప్లయింట్‌ చేస్తే, అప్పుడైనా నామినేషన్‌ని తిరస్కరిస్తారా?’’ అని అడిగాను. ‘‘సారీ.. ఇవన్నీ చెప్పడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం’’ అని ఫోన్‌ పెట్టేశాడు కమిషనర్‌.

మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top